మార్పుకు ఓటు వేయండి

అనకాపల్లి ప్రచార సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నవరత్నాలను మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది

మొదటి శాసనసభలోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ. 1150 కోట్లు విడుదల

చంద్రబాబు రైతుల రక్తం తాగుతున్నాడు

మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశాడు

హెరిటేజ్‌ కోసం సహకార డెయిరీలను మూసివేయించాడు

ఇంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి మనకు అవసరమా..?

విశాఖపట్నం: ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం..అబద్ధాలు, అక్రమాలు, అరాచకాలు చూశామని, ఈ ఎన్నికల్లో మార్పునకు  ఓటువేయాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక నవరత్నాలతో అందరి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తానని మాట ిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలోని అనకాలపల్లెలో  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.

అనకాపల్లి నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్ర పూర్తిచేయగలిగానంటే దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పూర్తి చేశాను. ఆ పాదయాత్రలో ఇదే నియోజకవర్గం గుండా నా ప్రయాణం సాగినప్పుడు మీరు చెప్పిన ప్రతి కష్టం, మీ బాధ చూశాను. మీరు చెప్పిన ప్రతి అంశం ఇవాల్టికి నాకు బాగా గుర్తుంది. మీ కష్టాన్ని చూశాను. మీ బాధను విన్నాను.. మీ అందరికీ నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాను. చెరకు రైతుల కష్టాలను చూశాను. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని తెరుస్తారని నాలుగు సంవత్సరాలుగా ఊరించారు. చివరకు ఎన్నికలు వస్తున్నాయని సంవత్సరం ముందు తెరిచారు. తెరిచిన తరువాత రెండు నెలలు కూడా ఫ్యాక్టరీని నడపలేదు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 5 కోట్లు చెల్లించకుండా ఏ స్థాయిలో మోసం చేస్తున్నారని ఆవేదనతో చెప్పిన మాటలు నాకు ఇవాల్టికి గుర్తున్నాయి. బెల్లం రైతులకు గిట్టుబాటు రావడం లేదని, బెల్లం రేటు క్వింటాల్‌కు రూ. 2400 మించడం లేదని, కనీసం రూ. 35 వందలు కూడా రాకపోతే ఏరకంగా గిట్టుబాటు అవుతుందని బెల్లం రైతులు చెప్పిన మాటలు విన్నా.. 

సంక్రాంతి పండుగ వస్తే చంద్రబాబు చంద్రన్న కానుక నుంచి ఇస్తారు.. బెల్లం మాత్రం మహారాష్ట్ర నుంచి తీసుకొస్తారు కానీ, అనకాపల్లి నుంచి కొనుగోలు చేయరు. పాడి రైతుల బతుకుల గురించి విశాఖ డెయిరీ పాలక వర్గం పీల్చి పిప్పి చేస్తుందనే ఆటలు విన్నా.. రైతుల సొమ్మును దోపిడీ చేసి ఆ సొమ్మును సొసైటీల ద్వారా వెదజల్లి ఓట్లు దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల వేళ్లు వారి కంట్లోనే పొడిచేట్లుగా చేస్తున్నారు. లీటర్‌ నీటి ధర రూ. 22 అని చూపించారు. ఒక లీటర్‌ పాలు రూ. 23కు అమ్మాల్సిన దుస్థితులో ఉన్నామని చెప్పిన బాధలు విన్నా.. విశాఖ డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల మాటలు విన్నా.. రోజుకు 12 గంటల నుంచి 18 గంటలు పనిచేయిస్తున్నారు. నెలకు జీతాలు రూ. 6 వేలు మించి ఇవ్వడం లేదన్నా.. ఎలా బతకాలన్నా అని ఉద్యోగులు చెప్పిన మాటలు విన్నా.. విశాఖ డెయిరీ యజమాని కొడుకు హైదరాబాద్‌లో ప్రైవేట్‌ డెయిరీ పెట్టుకుంటే విశాఖ డెయిరీ పాలను దొంగలించి ఆ ప్రైవేట్‌ డెయిరీకి పంపిస్తున్నారు. రైతులకు సేవ చేస్తున్నామనే పేరుతో ఒక ట్రస్టు తెరిచి స్కూల్‌ కట్టి ఆ స్కూల్‌ను నారాయణ కాలేజీకి ఇచ్చేస్తున్నాడు. రైతులకు మేలు చేస్తున్నామని ఆస్పత్రికి కడతారు. ఆ ఆస్పత్రి కిమ్స్‌కు ఇస్తున్నారు విశాఖ డెయిరీ పెద్దలు. రైతుల చెమటతో వేల కోట్ల రూపాయల మేర ఆస్తులు విశాఖ డెయిరీలో ఉన్నాయి. కానీ ఇవాళ ఆ డెయిరీ ఒక కుటుంబానికి సంబంధించిన డెయిరీగా ఉందా.. లేక రైతులకు సంబంధించిన డెయిరీగా ఉందా అని ఆలోచన చేయండి. 

చంద్రబాబుతో కలిసి అటునుంచి హెరిటేజ్‌ డెయిరీ, ఇటు నుంచి విశాఖ డెయిరీ రైతుల రక్తాన్ని తాగుతున్నారు. సహకార రంగంలోని డెయిరీ రైతులకు మంచి చేస్తుందని ప్రతి రైతు ఎదురుచూస్తాడు. చంద్రబాబుకు వినని అన్ని డెయిరీలను మూసివేయించేశాడు. పద్ధతి ప్రకారం చిత్తూరు డెయిరీ లాంటివి మూసివేయించారు. తన మాట వినే వాళ్లను డైరెక్టర్‌గా నియమించి కుటుంబ పాలన కిందకు తీసుకువస్తున్నాడు. ఈ ప్రతి మాట నేను విన్నా.. ఆ రోజు అనకాపల్లిలో 200 పడకల అప్‌గ్రేడ్‌ చేశారు కానీ సరిపడా డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు 46 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 15 మంది కూడా లేరన్న ప్రతి మాట విన్నా.. 

ఇదే అనకాపల్లిలోనే సత్యనారాయణపురంలో చంద్రబాబు అవినీతి ప్లాట్లు కడుతున్నాడని ప్రజలు చెప్పిన మాటలు విన్నా.. ఆ ప్లాట్ల గురించి చెప్పినప్పుడు ప్లాటు కట్టడానికి ఎంత అవుతుందని ఏదైనా బిల్డర్‌ దగ్గరకు వెళ్లి అడిగితే.. భూమి ఫ్రీగా వస్తుంది. సిమెంట్‌ సబ్సిడీ మీద వస్తుంది. ప్లాట్లలో లిఫ్ట్‌ కూడా లేదు. గ్రనైట్‌ ఫ్లోరింగ్‌ కూడా లేదు అడుగుకు రూ. వెయ్యి కూడా మించదని చెబుతున్నారు. అలాంటి ప్లాట్లను పేదవాడికి రూ. 2 వేలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. 300 అడుగుల ప్లాటు రూ. 6 లక్షలకు విక్రయిస్తారంట. రూ. 3 లక్షలు కేంద్రం, రాష్ట్రం ఇస్తుందంట. మిగిలిన రూ. 3 లక్షలు 20 సంవత్సరాల పాటు నెల నెల రూ. 3 వేలు కడుతూ పోవాలంట. ఇంతటి దారుణంగా చంద్రబాబు పేదవాడి దగ్గర కూడా అవినీతి చేస్తున్నాడు. ఎన్నికల సమయం కాబట్టి ప్లాట్లు ఇస్తే తీసుకోండి. ఆ తరువాత దేవుడి ఆశీర్వదించి, మీ అందరి దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తరువాత జగన్‌ అనే నేను మీ అందరికీ చెబుతున్నాను.. రూ. 3 లక్షలు మొత్తం మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నా. 

స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు మంచి చేసింది తక్కువ.. కబ్జాలు, భూకుంభకోణాల గురించి నా దగ్గరకు వచ్చి చెప్పారు. జమ్మాదుపల్లి గ్రామంలో రైతుల భూములను వక్ఫ్‌ భూముల రికార్డులను ఏరకంగా తారుమారు చేసి గోల్‌మాల్‌ చేశారో ప్రజలు చెప్పారు. మీ అందరితో ఒక్కటే చెబుతున్నా.. నా ప్రయాణంలో అగ్రిగోల్డ్‌ బాధితులు నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకున్నారు. చంద్రబాబు పాలనలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్క రూపాయి కూడా మేలు చేయలేదు. ఆ అగ్రిగోల్డ్‌ బాధితుల ఆస్తులను మాత్రం చంద్రబాబు, ఆయన కొడుకు, బినామీలు, మంత్రులు గద్దల్లా వాలి ఆ ఆస్తులు కాజేసే కార్యక్రమాలు చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు మాటిస్తున్నా.. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్‌ అనే నేను.. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి శాసనసభలోనే రూ. 1150 కోట్లు కేటాయిస్తాం.. 13లక్షల మందికి లబ్ధి చేకూర్చుతాం. మిగిలిపోయిన వారికి మేలు చేస్తాం. 

ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశారు. నాలుగు రోజుల్లో ఎన్నికలు. ఇటువంటి పాలనలో ప్రజలంతా గమనించింది మోసం.. మోసం.. మోసం..తప్ప మరొకటి ఉండదు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ ఎగరగొట్టాడు. 2016 మే మాసం నుంచి సున్నావడ్డీ పథకం పూర్తిగా రద్దు చేశారు. చంద్రబాబు పసుపు – కుంకుమ పేరుతో మరో మోసం చేస్తున్నాడు. పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మల బృందాలు మామూలుగా రూ. 5 లక్షలు, కొన్ని సంఘాలు రూ. 7 లక్షలు తీసుకుంటాయి. రూ. 5 లక్షలు తీసుకునే సంఘాలు సంవత్సరానికి రూ. 60 వేలు వడ్డీ కడతారు. రూ. 7 లక్షలు తీసుకునే బృందం రూ. 84 వేలు, రూ. 10 లక్షలు తీసుకున్న బృందం రూపాయి వడ్డీ కింద రూ. 1.20 లక్షల వడ్డీలు కడతారు. మే 2016 నుంచి సున్నా వడ్డీ పథకం చంద్రబాబు రద్దు చేశాడు కాబట్టి మూడు సంవత్సరాల్లో రూ. 5 లక్షలు తీసుకున్న బృందాలు సంవత్సరానికి రూ. 60 వేలు రూపాయి వడ్డీ కింద కడితే మూడు సంవత్సరాలకు రూ. 1.20 లక్షల వడ్డీ కట్టారు. రూ. 7 లక్షలు తీసుకున్న బృందాలు రూ. 2.52 లక్షలు, రూ. 10 ల క్షలు తీసుకున్న బృందాలు రూ. 3.60 వేల వడ్డీల రూపంలో కట్టారు. చంద్రబాబు ఎన్నికలు అదిగో వారంలో ఉన్నాయని పసుపు – కుంకుమ కింద ఇచ్చేది గ్రూపు రూ. లక్ష ఇస్తున్నాడు. వడ్డీలే ఇంతలా వసూలు చేసి పసుపు – కుంకుమ అనే డ్రామా పెట్టి రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 87,612 కోట్ల రుణాలు ఉన్నాయి. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు పుణ్యమా అని రైతులకు సున్నావడ్డీ కింద కట్టాల్సిన పథకం పూర్తిగా రద్దు చేశాడు. ఐదు సంవత్సరాల్లో రైతులు వడ్డీలు కట్టుకుంటూ అసలు రూ. 87,612 కోట్ల వడ్డీతో కలిపి రూ. 1.50 లక్షల కోట్లకు రెట్టింపు అయిందంటే ఏ స్థాయిలోమోసం చేశారో అర్థం చేసుకోండి. రుణమాఫీ అని పేరు పెడుతూ.. అక్షరాల రూ. 24 వేల కోట్లు ఇస్తానని సంతకం పెట్టాడు. ఇచ్చింది రూ. 14 వేల కోట్లు. రూ. 87,612 వేల కోట్లకు కనీసం పదిశాతం వడ్డీ వేసుకున్నా.. ఐదు సంవత్సరాలకు కలిపి రైతులు రూ. 40 వేల కోట్ల వడ్డీలు కడితే చంద్రబాబు మాత్రం రూ. 14 వేల కోట్లు కట్టి గుర్తుపెట్టుకోవాలంటే ఇంతకంటే దిక్కుమాలిన ముఖ్యమంత్రి కనిపిస్తాడా..? 

ముఖ్యమంత్రి కావడం కోసం చంద్రబాబు 2014లో జాబు కావాలంటే బాబు రావాలి అన్నాడు. ప్రతి ఇంటికో ఉద్యోగం, ఉపాధి అన్నాడు. ఈ రెండు ఇవ్వకపోతే నెలకు రూ. 2 వేల భృతి ఇస్తానన్నాడు. ఐదు సంవత్సరాలకు కలిపి రాష్ట్రంలో కోటి 70 లక్షల ఇళ్లు ఉంటే ఆ ప్రతి ఇంటికి ఐదు సంవత్సరాల్లో రూ. 1.20 లక్షల బాకీ ఉన్నాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు మూడు లక్షల ఇళ్లకు తీసుకువచ్చి రూ. 2 వేల భృతిని తగ్గించి రూ. వెయ్యి ముష్టివేసినట్లుగా మూడు లక్షలమందికి ఇచ్చాడు. ఒకసారి ఈ మోసాల గురించి ఆలోచన చేయండి. ఎలాంటి ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేయండి. 

నిన్న మన మేనిఫెస్టో ప్రకటించాం. కేవలం రెండే పేజీలు మాత్రమే. ఇందులో చెప్పిన ప్రతి అంశం ప్రతి రోజు మీరు గుర్తు పెట్టుకునేలా.. ప్రతి అంశం, ప్రతి మాట రోజూ గుర్తు చేస్తాను. ప్రతి రోజు ఇది చేశానని చూపిస్తూనే ఉంటా. ఐదు సంవత్సరాల తరువాత ఇదిగో మేనిఫెస్టో.. ప్రతి అంశం నెరవేర్చానని తిరిగి ఓటు అడుగుతా.. 

చంద్రబాబు 2014లో 50 పేజీల ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాడు. వ్యవసాయ రుణాలు మాఫీ, రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పొదుపు సంఘాల రుణాల మాఫీ, బెల్టుషాపులు రద్దు, మహిళలకు భద్రత, ప్రత్యేక పోలీసు వ్యవస్థ, ఆపదలో ఉన్న మహిళల సెల్‌ఫోన్‌ ద్వారా ఫోన్‌ చేస్తే 5 నిమిషాల్లో సాయం, యువతకు ఉద్యోగం, ఉపాధి, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, పేదలకు కేజీ నుంచి పీజీ వరకు విద్య, ఎన్టీఆర్‌ సృజల స్రవంతి పథకం ఇంటింటికీ రూ. 2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్, అవినీతి లేని సుపరిపాలన.. ఈ హామీల కింద చంద్రబాబు సంతకం, 50 పేజీలతో మేనిఫెస్టో ఒక్కో కులానికి ఒక పేజీ, ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలని చెప్పి పీహెచ్‌డీ చేసి అన్ని వర్గాలను మోసం చేశాడు. మళ్లీ ఇవాళ 2019 మేనిఫెస్టో 34 పేజీలు. మొదటి పేజీలో.. చంద్రబాబు చెప్పింది 2014 మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ప్రణాళిక బద్ధంగా అమలు చేశామని సిగ్గులేకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. ఇంత దిక్కుమాలిన మోసాలు చేస్తున్నాడు.. ఇటువంటి వ్యక్తులు రాజ్యాధికారంలో ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. 

మార్పుకు మనం ఓటు వేయాలని ఆలోచన చేయండి. ఈ వ్యవస్థ మారాలి. ఒక రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని పలానా చేస్తానని చెప్పి.. అది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటు అడిగి అధికారం చేపట్టిన తరువాత హామీ అమలు చేయలేకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. నవరత్నాలతో మనం చెప్పింది.. ప్రతి గడపకు నవరత్నాలు తీసుకొచ్చే బాధ్యత నాది.. నీ బిడ్డది అని హామీ ఇస్తున్నా.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలని కోరుతూ.. మీ చల్లటి దీవెనలు అమర్‌నాథ్‌ మన పార్టీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాడు. అమర్‌ ద్వారా ఈ నియోజకవర్గానికి పూర్తి న్యాయం చేస్తాను. మన పార్టీ తరుఫున ఎంపీ అభ్యర్థిగా సత్యవతి అమ్మ నిలబడుతుంది. మంచి చేస్తుందనే విశ్వాసం నాకు ఉంది ఆశీస్సులు అందించండి. రత్నాకర్‌ను నా గుండెల్లో పెట్టుకుంటాను. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 

Back to Top