జాబు రావాలంటే బాబు పోవాలి

పలాస సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

జాబు రావాలంటే బాబు రావాలన్నారు..జాబిచ్చారా?

ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు

పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు కరువు

మీ చదువుల బాధ్యత నాదే

మనందరి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల విప్లవం తెస్తాం

ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని భర్తీ చేస్తా

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తెస్తాం

మీ అందరికి నేనున్నానని భరోసా ఇస్తున్నా

బాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని ప్రతి ఒక్కరికి చెప్పండి

 

శ్రీకాకుళం: గత ఎన్నికల్లో ఓట్ల కోసం జాబు రావాలంటే బాబు రావాలన్నారని..ఐదేళ్లలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. జాబు రావాలంటే బాబు పోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే భ ర్తీ చేస్తామని జననేత హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు ఇచ్చే రూ.3 వేలకు నమ్మి మోసపోవద్దని, అన్న ముఖ్యమంత్రి అవుతారని, మన పిల్లల చదువు బాధ్యత తీసుకుంటారని, ఉద్యోగాలు ఇస్తారని, ప్రత్యేక హోదా సాధిస్తారని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

  •  పాదయాత్ర చేస్తున్నప్పుడు దాదాపు 3648 కిలోమీటర్ల పాదయాత్ర దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పాదయాత్ర పూర్తయింది. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మీరు చెప్పిన కష్టాలు, బాధలను నేను విన్నాను. ఆ రోజు ఏం చెప్పారన్నది నేను విన్నాను.. మీ అందరికీ భరోసా ఇచ్చి చెబుతున్నాను.. నేను ఉన్నాను అని భరోసా ఇస్తున్నాను. ఆ రోజు మీరు చెప్పిన మాటలు ప్రతీది గుర్తుంది. అన్న రాష్ట్రంలో, దేశంలో జీఎస్టీ ట్యాక్స్‌ విన్నాం. కానీ ఈ పలాసలో మాత్రం పీఎస్టీ అని తెలుగుదేశం పార్టీ ట్యాక్స్‌ వేస్తున్న వైనాన్ని మీ నోటి నుంచి తెలుసుకున్నా.. ఏ రకంగా ప్రతి జీడిపప్పు ప్యాకెట్‌ మీద రూ. 10 ట్యాక్స్‌ కడుతున్నారో ఇక్కడి ఎమ్మెల్యే అల్లుడికి ట్యాక్స్‌ కడుతున్నారో ప్రతీది మీరు చెప్పింది విన్నా.. 
  • వ్యాపారులపై వేధింపులు, వినకపోతే అధికారులతో దాడులు. అన్ని చూశా.. విన్నా.. బావలపాడు పోర్టు వస్తుందనే ఆనందం కొద్దోగొప్పో ఉన్నా పోర్టు వల్ల మాకేం మేలు జరుగుతుందన్న అన్న మీ స్వరం నేను విన్నా.. పోర్టుతో పాటు అక్కడే మత్స్యకారులకు కూడా ఫిషింగ్‌ హార్బర్‌ కట్టాలని, పోర్టు వచ్చినప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పోర్టు కోసం భూములు కోల్పోతున్న ఆ ప్రజలకు ఇచ్చే సొమ్ము అతి తక్కువగా ఇస్తున్నారని ప్రతీది విన్నా.. తిత్లీ తుఫాన్‌ వచ్చి నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదన్న మీ మాటలు విన్నా. రెండో విడుత జాబిత విడుదల కాలేదన్న బాధలు విన్నా.. ఇచ్చిన చెక్కులు చాలా వరకు చెల్లుబాటు కావడం లేదన్న మీ అంశాలు విన్న. కొబ్బరి చెట్లకు ఇస్తున్న కాంపన్సేషన్‌ రూ. 1500 తక్కువ అన్న మీ మాటలు విన్నా.. జీడి తోటలకు హెక్టార్‌కు ఇస్తున్న రూ. 30 వేలు చాలా తక్కువ అని విన్నా.. 
  • ఆ రోజు నేను అన్న మాటలన్నీ గుర్తున్నాయి. తిత్లీ తుఫాన్‌ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు చెప్పాను. కొబ్బరి చెట్టుకు రూ. 15 వందలు కాదు మనం అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 3 వేలు చేస్తామన్న మాటలు గుర్తున్నాయి. జీడీ పంట హెక్టార్‌కు రూ. 30 కాదు.. రూ. 50 వేలు చేస్తామన్న మాటలు నాకు గుర్తున్నాయి. 
  • కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న బాధితుల కష్టాలు చూశా. వారికి కోసం గతంలో ధర్నాలు కూడా చేశాం. ఆ పరిస్థితులను నెమరవేసుకుంటూ ఒక వైపు ఆనందం, మరో వైపు బాధపడుతూ వారు చెప్పిన కష్టాలు విన్నాను. కిడ్నీ బాధితులకు ఈ ప్రభుత్వం ఏమాత్రం మంచిచేయని పరిస్థితులు వారు చెబుతున్న పరిస్థితులు విన్నా.. వేలమంది బాధితులు ఉంటే కేవలం 370 మందికే పెన్షన్లు ఇస్తున్నారన్న అని మీరు చెప్పిన బాధలు విన్నా.. కిడ్నీ రోగులకు నెలకు దాదాపు రూ. 8 వేలు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం ముష్టివేసినట్లుగా రూ. 2500 ఇస్తే ఎలా బతకగలుగుతామని అన్నప్పుడు వారి బాధలు నేను విన్నాను. డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులు వేల సంఖ్యలో ఉంటే కేవలం 14 వందల మందికి మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేస్తున్నారనే బాధలు విన్నా.. నెప్రాలజిస్టులు లేరు, వైద్యం సరిగ్గా జరగడం లేదన్నప్పుడు ఆ గుండె కోతలు నేను విన్నా.. వారి బాధలు ఇంకా నాకు గుర్తు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో 200 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ కం రీసెర్చ్‌ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తాం, రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి నాణ్యమైన వైద్యం అందిస్తాం. మంచి మంచి డాక్టర్లను తీసుకొచ్చి వైద్యం అందిస్తాం. గ్రామాలకు వ్యాధి ప్రారంభ దశలోనే వైద్యం అందే విధంగా పరీక్షలు చేయడమే కాకుండా, ఉచితంగా మందులు అందజేస్తాం. 
  • అన్ని రకాలుగా తోడుగా ఉంటామని మరొక్కసారి చెబుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ రోగులుకు తోడుగా ఉంటామని, వారికి పెన్షన్‌ రూ. 10 వేలు చేస్తామని ఆరోజు చెప్పిన మాటలు గుర్తున్నాయి. అసలు ఈ కిడ్నీ రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనం తాగే నీళ్లు క్వాలిటీ లేవని తెలిసినా పట్టించుకోని ప్రభుత్వాన్ని చూశాం. ప్రతి ఒక్కరికి చెబుతున్నా.. తాగడానికి నీటి క్వాలిటీని మారుస్తాం. రిజర్వాయర్‌ నుంచి కాల్వలు తీసుకొచ్చి తాగునీరు, సాగునీరు ప్రతి ఒక్కరికీ అందజేస్తామని మాటిస్తున్నా.. పాదయాత్రలో చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. 
  • ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు కాబట్టి మరో 20 రోజులలోపే ఎన్నికలు జరగుతాయి కాబట్టి ఆలోచన చేయాలి. అభివృద్ధి అంటే ఏమిటీ.. అనేది ఆలోచన చేయాలి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు విపరీతంగా అభివృద్ధి చేశానంటాడు. నిన్నటికన్నా.. ఈ రోజు బాగుండడం అభివృద్ధి అని నేను నమ్ముతాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిన్నటి కన్నా.. ఈ రోజు మనం బాగున్నామా అని ఆలోచన చేయాలి. మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాలి. రైతులకు రుణాలు మాఫీ చేశారా..? రైతులకు సన్నా వడ్డీ వస్తుందా..? రైతులకు గిట్టుబాటు ధర అందుతుందా అని అడుగుతున్నా.. అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా..? సున్నా వడ్డీకే రుణాలు వస్తున్నాయా అని అడుగుతున్నా.. నిరుద్యోగులకు రూ. 2 వేల భృతి అన్నాడు, ఉపాధి, ఉద్యోగం అన్నాడు.. ఉద్యోగం ఇవ్వలేదు.. భృతి ఇవ్వలేదు. ప్రతి ఇంటికి 60 నెలల కాలంలో ప్రతి ఇంటికి రూ. 1.20 లక్షలు బాకీ పడ్డాడు చంద్రబాబు. ఆ డబ్బు మీకు అందిందా..? 
  • బెల్టుషాపులు రద్దు అన్నాడు.. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం చేశాడు.. ఈ రోజు మీ గ్రామాల్లో మందు దొరుకుతుందా..? లేక ఏరులై పారుతుందా ఆలోచన చేయాలి. ఐదేళ్ల చంద్రబాబు పాలనను చూసి ఆలోచించండి. ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో మీరంతా సంతోషంగా ఉన్నారా అనేది ఆలోచన చేయాలి. మీ పిల్లల చదువులు, వారికి ఉద్యోగాల విషయంలో భరోసాగా ఉన్నారా..? మీ పిల్లల చదువులకు డబ్బులు ఉన్నాయా..? పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ ద్వారా పెద్ద చదువులకు ప్రభుత్వమే కడుతుందని చంద్రబాబు చెప్పాడు.. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తానన్నాడు..  ఆ రకంగా జరుగుతుందా.. ఆలోచన చేయాలి. మీ ఇళ్లు, గ్రామాలు, పట్టణాల్లో చదువుకొని ఉద్యోగం కోసం చూస్తున్న యువత ఏమంటుందనే ఆలోచన చేయాలి. ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. ఈ రోజు పరిస్థితి జాబు రావాలంటే బాబు పోవాలి అనే స్వరాన్ని వింటున్నా.. అభివృద్ధి అంటే ఏమిటీ అని ఆలోచన చేయాలి. 
  • చంద్రబాబు ప్రభుత్వంలో గత ఐదేళ్లలో మీ చుట్టూ ఉన్న తమ్ముళ్లు, చెల్లెలను అడగండి. అమరావతి వెళ్తున్నారా.. అక్కడ ఉద్యోగాలు ఉన్నాయా.. లేక ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్తున్నారా అడగండి. పిల్లలు గొప్పగా చదవాలని, చదువుతోనే కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందని తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తారు. కానీ ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అని మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాలి. రాష్ట్రంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ లెక్కలు తేల్చింది. మన పిల్లలకు గవర్నమెంట్‌ ఉద్యోగాలు వస్తాయని మన పిల్లలు ఎదురుచూస్తూ, కోచింగ్‌లు తీసుకుంటూ వేలకు వేలు ఖర్చు చేశారు. ఆ 1.42 లక్షల ఉద్యోగాల్లో ఎన్ని ఇచ్చాడో ఆలోచన చేయాలి. వాటితో పాటు రిటైర్డ్‌ అయిన వారిని కూడా కలుపుకుంటూ ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య 2 లక్షలకుపైగా ఎగబాకాయి. అయినా పట్టించుకోని పరిస్థితి. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులయ్యే వారు 5 లక్షల మంది. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులయ్యేవారు 4 లక్షల మంది. డిగ్రీ పాసై బయటకు వచ్చేవారి సంఖ్య 1.80 లక్షల మంది. పీజీ చదువులు చదువుకొని లక్షకుపైగా యువత ఉద్యోగాల కోసం బయటకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా.. ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి వాటిని తాకట్టుపెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఆలోచన లేని ప్రభుత్వంలో ఉన్నాం. 
  • రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎన్నికల సమయంలో రూ. 2 వేలు ప్రతి ఇంటికి ఇస్తానన్నాడు.. రూ. 2 వేల కథ దేవుడు ఎరుగు.. ఉద్యోగాలు వచ్చే ప్రత్యేక  హోదాను తన స్వార్థం కోసం చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఇదే చంద్రబాబు పాలనలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా గమనించాలి. పాదయాత్రలో చదువులు చదివించలేని తల్లిదండ్రుల పరిస్థితి, చదువుల కోసం ఆస్తులు అమ్మే పరిస్థితి చూశా.. ఆ చదువులు అయిపోయిన తరువాత డిగ్రీ పట్టుకొని ఉద్యోగాల కోసం వెతుకుతున్న పరిస్థితులు చూశాను. మీ అందరి బాధలు విన్నాను.. మీ బాధలు చూశాను.. మీ అందరికీ చెబుతున్నా.. నేను విన్నాను. నేను ఉన్నాను అని భరోసా ఇస్తున్నా.. మీ అందరి దీవెనలతో దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగాల కోసం, చదువుల కోసం అవస్థలు పడుతున్న ప్రతి తల్లి, తండ్రికి  భరోసా ఇస్తున్నా.. మీ పిల్లాడిని ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి చదువులు చదివిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు.. దగ్గరుండి నేను చదివిస్తా... చదువులే కాదు.. ఉద్యోగాల కోసం మన ప్రభుత్వం వచ్చిన తరువాత మనం ఏయాలనుకున్నాం అనే విషయాలపై వివరిస్తా. 
  • మన ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్టమొదటి పని, రాష్ట్ర పరిధిలో ఖాళీగా ఉన్న 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమాలు చేస్తాం. ప్రతి సంవత్సరం జనవరి వచ్చే సరికి నోటిఫికేషన్‌ జారీ చేస్తాం. నోటిఫికేషన్‌ కోసం క్యాలెండర్‌ కూడా తయారు చేస్తాం. ఉద్యోగాల కోసం మనం చేయబోయే ఇంకో విప్లవాత్మక మార్పు.. పరిశ్రమలు రావాలని మనం  భూములు ఇస్తున్నాం.. పరిశ్రమలు, పోర్టులు వచ్చినా మన వాళ్లకు ఉద్యోగాలు రావడం లేదు. ఇది పూర్తిగా మార్చేస్తాం. మన ప్ర భుత్వం వచ్చిన వెంటనే మొదటి శాసనసభలోనే ఒక చట్టం తీసుకువస్తాం. ఆ చట్టంలో పరిశ్రమలో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకే ఇవ్వాలనే చట్టం తీసుకువస్తాం. ఇంతే కాదు గవర్నమెంట్‌లో కాంట్రాక్ట్‌ తీసుకునే సర్వీసులు చాలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు కాంట్రాక్టులకు ఇస్తున్నారు. అవి నడిపేది చంద్రబాబు తొత్తులు జేసీ బ్రదర్స్, కేశినేని. గవర్నమెంట్‌ తీసుకునే కాంట్రాక్ట్‌ పనులన్నింటిలో నిరుద్యోగులకే ఇస్తాం. కాంట్రాక్ట్‌లు నిరుద్యోగులకు ఇవ్వడమే కాకుండా వారికి పెట్టుబడి కోసం సబ్సిడీలు కూడా ఇస్తామని చెబుతున్నా.. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకు వేసి నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చే ప్రతి కాంట్రాక్ట్‌లో 50 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయిస్తాం. ఇదొక్కటే కాదు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల కోసం చేయబోయే విప్లవాత్మక మార్పు ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ పెడతాం. అదే గ్రామ సెక్రటేరియట్‌లో మీ ఊరి పిల్లలకు పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. అదొక్కటి కాదు.. ఇంకా ఒక అడుగు ముందుకువేసి గ్రామంలో ఉన్న ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తూ రూ. 5 వేల గౌరవవేతనం ఇస్తాం. గ్రామ వలంటీర్‌ గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై పనిచేస్తారు. ప్రతి ప్రభుత్వ పథకం, ఫీజురియంబర్స్‌మెంట్, పెన్షన్, రేషన్, ఆరోగ్యశ్రీ, ఇల్లు, చివరకు నవరత్నాల్లో మనం ప్రకటించిన ప్రతీ పథకం వలంటీర్లు సెక్రటేరియట్‌తో అనుసంధానమై ప్రతి పథకం డోర్‌ డెలవరీ చేస్తాడని హామీ ఇస్తాడు. ఎవరూ ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. నేరుగా ప్రతీ పథకం మీ ఇంటికే వస్తుందని హామీ ఇస్తున్నా.. గ్రామ సెక్రటేరియట్‌లో దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లో పరిష్కారం చేస్తాం. 
  • ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన పరిస్థితులు చూస్తున్నాం. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు వస్తాయి. కారణం ఏంటంటే హోదా ఉంటే రాయితీలు వస్తాయని, అటువంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టుపెట్టాడు. ప్రత్యేక హోదాను సాధిద్దాం. జిల్లాల్లో పరిశ్రమలు రావాలి. పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించేందుకు నిరుద్యోగుల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు పెట్టి ప్రతి పిల్లాడికి తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నా.. మెరుగైన జీవితాలు వస్తాయని, చదువుల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటుందని నవరత్నాల్లో ఈ అంశాన్ని ప్రకటించాను. రోబోయే రోజుల్లో మీరంతా ఆలోచన చేయాలి. మన జీవితాలు బాగుపడాలంటే నవరత్నాలు ప్రతి ఇంటికి పోవాలి. నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితం బాగుపడుతుందని నమ్ముతున్నా.. 
  • చంద్రబాబు పాలనలో అన్యాయాలు, అబద్ధాలు, మోసాలు చూస్తున్నాం. చివరకు హత్యలు కూడా చూస్తున్నాం. వీళ్లే హత్యలు చేస్తారు. వీళ్ల మాట వినే ఆఫీసర్లతో విచారణ చేయిస్తారు. వీళ్లకు నచ్చినట్లుగా ఎవరిని కావాలంటే వారిని ఇరికించే కార్యక్రమం చేస్తారు. ఆ తరువాత వక్రీకరించేందుకు పచ్చమీడియాను వాడుకుంటారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనను చూస్తున్నాం. తన ఐదేళ్ల పాలన చూపించి చంద్రబాబు ఓట్లు అడగలేకపోతున్నాడు. ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు చేస్తున్నాడు. 
  • రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. మీ అందరినీ కోరేది ఒక్కటే.. గ్రామంలో ఉన్న ప్రతి అన్న, అక్క, చెల్లి దగ్గరకు వెళ్లి అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు, 20 రోజులు ఓపికపట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు సంవత్సరానికి రూ. 15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు. ఆస్తులు అమ్ముకుంటే తప్ప మన పిల్లలను చదివించలేకపోతున్నాం.. చంద్రబాబు వచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టండి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మలకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు.. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. ఆ తరువాత పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మొత్తం రుణాలు నాలుగు దఫాల్లో వారి చేతికే అందిస్తామని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. బ్యాంకులు మనకు సున్నా వడ్డీకి డబ్బులు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితి మారాలంటే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాడు. ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను అన్న లక్షాధికారులను చేస్తాడని చెప్పండి. 45 నుంచి 65 వయస్సున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్క.. 20 రోజులు ఓపికపట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరువాత 45 నుంచి 65 సంవత్సరాల వయస్సులో ఉన్న ప్రతి అక్క చేతిలో వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా రూ. 75 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. వారిని లక్షాధికారులను చేయాలనే ధృడంతో అన్న వస్తున్నాడు.. రాజన్న రాజ్యంలో అక్కచెల్లెమ్మలకు మంచి రోజులు చూశాం. మళ్లీ ఆ రోజులు రాజన్న కొడుకు జగనన్న రాజ్యంలోనే చూస్తామని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశాం. రుణాలు మాఫీ అన్నాడు మోసం చేశాడు. ఐదేళ్లుగా సున్నా వడ్డీలు, గిట్టుబాటు ధరలు అని మోసం చేశాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. మే మాసం వచ్చే సరికి రూ. 12,500 ప్రతి రైతన్న చేతిలో పెట్టుబడి కోసం ఇస్తాడని చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. గ్రామంలోని అవ్వాతాతలను మూడు నెలల క్రితం మీ పెన్షన్‌ ఎంత అని అడగండి. ఇదే ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు అని ప్రకటించకపోతే ఈ చంద్రబాబు ఇచ్చేవాడేనా అని అడగండి.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి 20 రోజులు ఓపిక పట్టండి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. పెన్షన్‌ రూ. 3 వేలకు అన్న పెంచుకుంటూ పోతాడని చెప్పండి. నవరత్నాలతో ప్రతి పేదవాడికి మేలు జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి ఇవన్నీ ప్రతి ఇంటికి తీసుకెళ్లమని కోరుతున్నా.. 
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించండి. మీ అందరి చల్లని దీవెనలను పలాస అభ్యర్థి అప్పలరావు, ఎంపీ అభ్యర్థిగా మన పార్టీ తరుపున శ్రీను అన్నను నిలబెడుతున్నాం. తనపై కూడా మీ చల్లని ఆశీస్సులు ఉంచాలని, వైయస్‌ఆర్‌ సీపీకి మీ ఆశీర్వాదం అందించాలని పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నా.. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 
Back to Top