ఆక‌ట్టుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగం

ఇండియా టూడే స‌ద‌స్సులో రాష్ట్ర ప‌రిస్థితుల‌ను వివ‌రించిన ప్ర‌తిప‌క్ష నేత‌
 

ఢిల్లీ: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి శ‌నివారం  ప్రముఖ వార్తా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన‌ సదస్సులో ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగించారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (హౌ ది డెక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ) అనే అంశంపై  చ‌ర్చా వేదిక‌లో ఆయ‌న మాట్లాడతారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని ఎండ‌గ‌ట్టారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ఇచ్చిన హామీల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నెర‌వేర్చ‌లేద‌న్నారు.

ఏపీ సీఎం రోజుకో మాట మాట్లాడుతూ..నాలుగేళ్లు కేంద్రంతో క‌లిసి ప‌నిచేసినా రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదానే సంజీవ‌ని అని, హోదా ఇచ్చే పార్టీకే మ‌ద్దతిస్తామ‌ని మ‌రోమారు వైయ‌స్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని వెల్ల‌డించారు.  వైయ‌స్ జ‌గ‌న్‌ వెంట మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాలశౌరి, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.  
 

Back to Top