ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలు

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

బినామీలకు చెక్కులు ఇస్తున్నారు

ఇది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ మాత్రమే

సెక్రటేరియేట్ ను దుర్వినియోగం చేస్తున్నారు

బాబు ఆదేశాల‌తోనే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు 

కోడెల తనంతట తానుగా చొక్కాలు చించుకొచ్చి డ్రామాలు

బాధితులపైనే కేసులు పెడుతున్నారని గవర్నర్ కు ఫిర్యాదు

హైద‌రాబాద్‌:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఆ తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు, వైయ‌స్ఆర్‌సీపీ  అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప‌రిస్థితులు, టీడీపీ అరాచ‌కాల‌పై వైయ‌స్ జ‌గ‌న్ గ‌వర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడి వైఖరి, ఆయన ఆదేశాల మేరకే  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై దాడులు జరుగుతున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. గురజాల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల రోజున జరిగిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లిన వైయ‌స్ జగన్, పోలీసులు కూడా అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఇవ‌న్నీ కంట్రోల్ చేయండి..
"సెక్రటేరియేట్ లో చీఫ్ సెక్రటరీకి ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వండి. చంద్రబాబునాయుడు, తాను చేసిన స్కామ్స్ మీద, తను అధికారం కోల్పోయిన తరువాత, ఆ ఆధారాలను మటుమాయం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది కాక, తనకు సంబంధించిన బినామీలకు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు... వాళ్లకు మాత్రమే ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి. ఇది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చేదాకా చంద్రబాబునాయుడు సెక్రటేరియేట్ ను దుర్వినియోగం చేస్తూ, తన అన్యాయాలను కొనసాగించడం ధర్మం కాదు. అక్కడ కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలని గవర్నర్ కి చెప్పడం జరిగింది" అని వైయ‌స్ జగన్ అన్నారు.

80 శాతం మంది ఓట‌ర్లు సంతృప్తిగానే ఉన్నారు
ఈవీఎంలపై ఫిర్యాదులు చేస్తున్నది కేవలం చంద్రబాబు మాత్రమే తప్ప, ప్రజలు కాదని జగన్ వ్యాఖ్యానించారు. 80 శాతం మంది ఓటు వేసి, తాము ఎవరికి ఓటు వేశామో వీవీ ప్యాట్ లో చూసుకుని సంతృప్తి చెందారని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని, చంద్రబాబు మాత్రం తాను ఎవరికి ఓటు వేసిందీ తనకు తెలియడం లేదని సినిమా డ్రామాలు ఆడుతున్నారని, ఓ విలన్ మాదిరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ ఏజంట్లతో మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు కూడా ఏ విధమైన ఫిర్యాదులూ లేవని అన్నారు. ఈవీఎంలలో లోపాలుంటే, దాదాపు 40 వేలకు పైగా ఉన్న పోలింగ్ బూత్ లలో ఉన్న టీడీపీ ఏజంట్లు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. 
ఇనుమెట్ల ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు

కోడెల ఇంత చేస్తే..ఇంత‌వ‌ర‌కు కేసు న‌మోదు చేయ‌లేదు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ ఉదయం గవర్నర్ ను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, ఇనుమెట్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి కోడెల వెళ్లి, లోపల అధికారులు ఉండగానే, తలుపులు బిగించుకున్నారని, ఈ విషయం రికార్డెడ్ గా ఉందని, అక్కడున్న సాధారణ ఓటర్లు ఆయన వైఖరిని ప్రశ్నిస్తే, తనంతటతానుగా బట్టలు చించుకుని బయటకు వచ్చి డ్రామాలు ఆడారని ఆరోపించారు. కోడెల ఇంత చేస్తే, అదేమీ నేరం కాదన్నట్టు ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులపై టీడీపీ గూండాలు దాడులకు దిగుతున్నారని, ఇదే విషయాన్ని తాను గవర్నర్ కు ఫిర్యాదు చేశానని వైయ‌స్ జగన్ వ్యాఖ్యానించారు.

ఎన్నికలకు ముందు తమకు నచ్చిన పోలీసు అధికారులకు, తమ కులం వారికి ప్రమోషన్లు ఇచ్చారని, దాని ఫలితంగానే ఇప్పుడు బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని, గవర్నర్ కల్పించుకోవాలని తమ పార్టీ కోరిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని జగన్ తెలిపారు. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ తలుపులను ఎందుకు తీయాల్సి వచ్చిందని ప్రశ్నించిన జగన్, అన్ని స్ట్రాంగ్ రూముల భద్రతనూ కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరాల లైవ్ ఫీడ్ ను కేంద్ర ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అందించాలని కోరామని అన్నారు. ఈ మేరకు నరసింహన్ కు వినతిపత్రాన్ని సమర్పించి, తగు చర్యలు తీసుకోవాలని వైయ‌స్ జ‌గ‌న్  కోరారు.  

 

 

 

Back to Top