బడ్జెట్‌లో ఇన్ని ప్రలోభాలా? 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి
 
ప్రజల్ని మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర పెద్దలు పీహెచ్‌డీ 

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రకటన లేదు 

ఓటుకు కోట్లు కేసు తర్వాత లొంగుబాటు వల్లే ఈ దుస్థితి 

ప్రత్యేక హోదాను వదిలేసి ప్యాకేజీకి ఊకొట్టారు 

హోదా కోసం ప్రతిపక్షం గొంతెత్తితే ప్రివిలేజ్‌ నోటీసులిచ్చారు.. 

ఇప్పుడు ఎవరూ లేకుండా చూసి బాబు భారీ డైలాగులు 

ఏపీకి అన్యాయం చేసిన పార్టీలన్నిటికీ గుణపాఠం తప్పదు 

అమరావతి: నాలుగు నెలలకు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో వరాలు, పథకాలు ప్రవేశపెడుతూ ప్రలోభాలకు దిగడాన్ని చూస్తుంటే ప్రజల్ని మోసం చేయటంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు పీహెచ్‌డీ తీసుకున్నారని అర్థమవుతోందని ప్రతిపక్ష నేత,  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ ధ్వజమెత్తారు. ఇది దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి అని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్‌ స్పందించారు. శుక్రవారం సాయంత్రం అందుబాటులో ఉన్న నాయకులతో ప్రతిపక్ష నేత హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ‘ఈ చివరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఎలాంటి ప్రకటన లేదు.

ముఖ్యమంత్రి చేతకానివాడు అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో దానికి చంద్రబాబు పెద్ద ఉదాహరణ’ అని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు లొంగుబాటు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆ తర్వాతే ప్రత్యేక హోదాను వదిలేసి లేని ప్యాకేజీకి ఊకొట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఇదే అసెంబ్లీలో నాలుగు సార్లు తీర్మానాలు చేయించాడని గుర్తు చేశారు. ఆ రోజు మేం ఇది తప్పు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని నల్లచొక్కాలతో వస్తే.. మమ్మల్ని సభలో నానా మాటలు అని ఈరోజు చంద్రబాబు నల్లచొక్కాలు వేసుకొచ్చారని వైయ‌స్ జగన్‌ మండిపడ్డారు. 

హత్య చేసినవాడే శాంతి ర్యాలీ చేసినట్లు బాబు వైఖరి
ప్రత్యేక హోదా కోసం గొంతు ఎత్తినందుకు తమ ఎమ్మెల్యేలపై ప్రివిలైజ్‌ నోటీసులు ఇచ్చారని, ప్యాకేజీకి చంద్రబాబు జై కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తుంటే, 2016 సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో అసెంబ్లీలో మాట్లాడ్డానికి తనకు 30 సెకన్ల సమయం కూడా ఇవ్వలేదని జగన్‌ గుర్తు చేశారు. ఈరోజు ఎవరూ లేకుండా చూసి అసెంబ్లీలో చంద్రబాబు భారీ డైలాగులు చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేదు. 2017 జనవరి 27న ఇదే వ్యక్తి ఏమన్నాడో గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంతకంటే ఏ రాష్ట్రానికి ఇచ్చారో చెప్పండి అంటూ వరుసగా నాలుగు సంవత్సరాలు కేంద్రం ఏపీకి అద్భుతంగా సహాయం చేసిందని ఇదే చంద్రబాబు చెప్పారు. హత్యచేసిన వాడే ఆ హత్యకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు డైలాగుల్ని చూసినా అలాగే ఉంది.

నాలుగేళ్లపాటు టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్ర కేబినెట్‌లో ఉన్నారు. వాళ్లు ఉండి కూడా ఈ రాష్ట్రానికి ఏం చేశారంటే.. ఏమీ మాట్లాడరు. ఆ మంత్రులు దిగిపోతూ ప్రెస్‌మీట్‌ పెట్టి కూడా కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా చేసిందని చెప్పారు. నాలుగేళ్లుగా ఏ బడ్జెట్‌ను కూడా చంద్రబాబు గాని, కేంద్రంలోని ఆయన మంత్రులు గానీ వ్యతిరేకించలేదు. విశాఖ మెట్రో రైల్‌కు రూ.1 లక్ష రూపాయలు ఇచ్చినా, పోలవరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకపోయినా చంద్రబాబు జై కొట్టారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇవ్వనిది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లో ఇస్తుందని ఎవరు అనుకుంటారు? ఏపీకి న్యాయం చేసైనా ఎన్నికలకు వెళ్తారు అన్న ఆశ కొద్దిగా ఎవరికైనా మిగిలి ఉంటే అది లేకుండా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలన్నింటికీ గుణపాఠం తప్పదు’ అని వైయ‌స్‌ జగన్‌ హెచ్చరించారు.  

 

Back to Top