అధికారులు, ప్రజాప్రతినిధులు పాలునీళ్లలా  పనిచేయాలి

 సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

 
 అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాలునీళ్లలా కలిసి మెలిసి పనిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించేందుకు అంతా కృషి చేయాలన్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం రాత్రి విజయవాడలోని బరంపార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులకు సీఎం విందు ఇచ్చారు. ఇద్దరు ఎంపీలు కూడా దీనికి హాజరయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ ఇందులో పాల్గొన్నారు.
 

మనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం
అధికారులు, ప్రజాప్రతినిధులు సఖ్యతగా ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో వాటిని ప్రజలకు సంపూర్ణంగా అందించేందుకు పనిచేయాలన్నారు. అహంభావానికి తావు ఇవ్వవద్దని, ప్రజాప్రయోజనాలే అంతిమమని స్పష్టం చేశారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం కోసం తరచూ సమావేశమవ్వాలని, సీఎం కార్యాలయ అధికారులు సహకరిస్తారని సీఎం చెప్పారు.

 1 నుంచి గ్రామాల బాట

జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాల బాట పట్టాలని ఆదేశించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను పరిశీలించాలని కోరారు. పథకాల లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, పేరు లేకపోతే అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా సూచిస్తున్నామన్నారు. మనకు ఓటు వేయని వారికి కూడా అర్హులైతే పథకాల ప్రయోజనాలు అందించాలన్నారు. ఉదయం 8 గంటల్లోపు, రాత్రి 9 గంటల తర్వాత అధికారులకు ఫోన్లు చేసి వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగించొద్దని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ఫోన్‌ చేసినప్పుడు అధికారులు కచ్చితంగా స్పందించాలన్నారు.

తాజా ఫోటోలు

Back to Top