మృతుల కుటుంబాల‌కు కోటి ప‌రిహారం ఇవ్వాలి

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డిమాండు

 తాడేప‌ల్లి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు కారణంగా పలువురు మరణించడం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. పేలుడు కార‌ణంగా మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నాను. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలి. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలి. మా పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుంది. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాలి.

 

 23న‌ ఘటనా స్థలానికి వైయస్ జ‌గ‌న్ 
 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు ఘటనాస్థలాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి(23న‌) సందర్శించనున్నారు. రేపు ప్రమాదస్థలానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో వైయస్‌.జగన్‌ ఎల్లుండి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో మాట్లాడి వైయ‌స్ జగన్‌ వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు.   

Back to Top