అమరావతి : పాదయాత్ర నిజంగానే గొప్ప అనుభవమని, అంత దూరం నడిచానని గుర్తు చేసుకున్నప్పుడు గొప్ప ఉత్తేజం కలుగుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రపై సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి రచించిన ’జయహో’ పుస్తకావిష్కరణ సభ ఎమెస్కో ఆధ్వర్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. జయహో పుస్తకాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించి తొలి కాపీని పుస్తక రచనలో సహకరించిన సీనియర్ పాత్రికేయులు కె. వి. రామిరెడ్డికి అందజేశారు. అనంతరం ఫోటోగ్రఫర్స్, వీడియోగ్రాఫర్స్, జర్నలిస్టులకు జయహో పుస్తకాన్ని వైయస్ జగన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
జగన్ వచ్చాడు.. మమ్మల్ని కలుస్తాడు... మా కష్టాలు చెప్పుకుంటామంటూ ప్రజలు వచ్చేవారు. మా కష్టాలు విన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తే వాటిని తీరుస్తాడనే వారి నమ్మకమే ఒక ఉప్పెనై అదే ఓటుగా మారింది. 50 శాతం ఓట్లతో రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని విజయాన్ని ప్రజలు అందించారు. దేవుడి ఆశీర్వాదంతో వారి నమ్మకాన్ని నిజం చేసేలా ముందుకు వెళుతున్నాం’’ రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వరాదని ప్రతీ క్షణం ఆలోచిస్తూ ఆ దిశగా పరిపాలన సాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతగా ఉండగా తాను చేపట్టిన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్నిచ్చిందన్నారు. సాధారణంగా ఎన్నికల మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు పేజీలకు పేజీలు ముద్రిస్తాయని, వైయస్‌ఆర్‌సీపీ మాత్రం రెండు పేజీల్లోనే ప్రజలకిచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపొందించిందని చెప్పారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని అమలుచేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. 19 బిల్లులు ఒకే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ‘ది ప్రింట్’ ఎడిటర్ ఇన్‌చీఫ్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత శేఖర్ గుప్తా , ‘జయహో’ పుస్తకరచన అని సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి తదితరులు మాట్లాడారు. పాదయాత్ర ఫొటోలు తీసిన జర్నలిస్టులను ఈ సందర్భంగా వైయస్ జగన్ అభినందించారు.