మన పాలన దేశానికే ఆదర్శం కావాలి

అవినీతికి ఆస్కారం లేని పాలన అందించడమే ధ్యేయం

అధికారులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది

ప్రభుత్వం చేసే ప్రతీ పని జ్యూడీషియల్‌ కమిషన్‌ ఎదుటకు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సచివాలయంలో అన్ని శాఖల అధికారులు,  హెచ్‌ఓడీలతో సీఎం సమావేశం

వెలగపూడి: అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, మన పాలన దేశానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టిన సీఎం వైయస్‌ జగన్‌ తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్‌ఓడీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. అధికారులపై నాకు పూర్తి విశ్వాసం ఉందని, అధికార యంత్రాంగం సహకారం వల్లే ప్రభుత్వ– ప్రజల కల సాకారం అవుతుందన్నారు. అనవసర వ్యయాన్ని తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని, మంచి పనితీరు ప్రదర్శించే అధికారులకు సత్కారాలు ఉంటాయన్నారు. 

ప్రభుత్వం చేసే ప్రతి పనిని జ్యూడీషియల్‌ కమిషన్‌ ఎదుట పెడతామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తిని కలిసినప్పుడు న్యాయమైన నిర్ణయం తీసుకోవాల్సింది చీఫ్‌ జస్టిస్‌ను కోరానన్నారు. ఇది దేశంలో ఎక్కడా లేదు. గతంలో కాంట్రాక్ట్‌లు అంటే కేవలం ప్రభుత్వాన్ని నడిపే ఆ  పార్టీలకి చెందిన వారికే ఇచ్చేవారని, కానీ ఇక పరిస్థితి ఉండదని, రివర్స్‌ టెండరింగ్‌కు పద్ధతిని తీసుకువస్తున్నామన్నారు. రాష్ట్రంలోకి సీబీఐ రావడంలో అభ్యంతరం లేదన్నారు. 

మంచి పాలన అందించాలనే సంకల్పంతో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఉందని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టో అందరికీ మార్గదర్శకం కావాలని, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు అధికారులకు దిక్సూచి కావాలన్నారు. 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌ను నియమించుకుందాం. గ్రామ సచివాలయం కేంద్రంగా వలంటీర్లు పనిచేస్తారని అధికారులకు వివరించారు. ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులకు సూచించారు.

 

Back to Top