తాడేపల్లి: ముస్లిం మైనారిటీ ప్రతినిధులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ముస్లిం మైనారిటీల సమావేశలపై ప్రతినిధులతో చర్చించారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాఫీజ్‌ఖాన్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం :మరోసారి వైయస్ జగన్ స్పష్టీకరణ. ‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాం. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా నిల్చింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుంది. వక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారు’. మరోవైపు ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ (వక్ఫ్) భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. కొత్త వక్ఫ్ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్న వారు, ఆ బిల్లును వైయస్ఆర్ సీపీ వ్యతిరేకించడంపై హర్ష్యం వ్యక్తం చేశారు. బిల్లును వైయస్సార్‌సీపీ వ్యతిరేకించడం వల్లనే, కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తు చేశారు. కాగా, వక్ఫ్ భూముల పరిరక్షణకు శ్రీ వైయస్ జగన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వెల్లడించారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడంతో పాటు, ఆ భూముల వివరాలన్నీ ఆన్‌లైన్ ఒక గొప్ప పరిణామం అన్న ఆయన, ముస్లింలకు జగన్‌గారు చేసిన మేలు, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీఓ నెం:60 జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.