రాష్ట్ర చరిత్రలో దుర్మార్గమైన, అన్యాయ పాలన

గతంలో ఏనాడూ ఇంత దారుణంగా లేదు

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

అక్రమ కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌

తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు

వెంటనే ఆపకుంటే, భవిష్యత్తులో మీకూ అదే గతి 

సీఎం చంద్రబాబుకు శ్రీ వైయస్‌ జగన్‌ హెచ్చరిక

వరదల్లో 60 మందిని చంపిన పాపం చంద్రబాబుదే

టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకే నందిగం సురేష్‌ అరెస్ట్‌

నాడు సీఎంగా ఉన్న నాపై టీడీపీ ప్రతినిధి దారుణ వ్యాఖ్యలు

అవి విన్న ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే ఆ ఘటన

మేము అధికారంలో ఉన్నా, కక్ష సాధింపులకు దిగలేదు

వైయ‌స్ జగన్‌ను ప్రేమించే వారు టీడీపీ ఆఫీస్‌ వద్ద ధర్నా చేశారు

నాలుగేళ్ల తర్వాత కేసులో ఇప్పుడు అక్రమ అరెస్టులు:  వైయస్‌ జగన్‌ ఆక్షేపణ

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విజయవాడలో విపత్తు 

భారీ వర్షాలు, వరదలపై ముందస్తు సమాచారం ఉంది

అయినా ప్రజలను ఏ మాత్రం అప్రమత్తం చేయలేదు

దీంతో నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు వరద

అయినా నిందను మా పార్టీపై మోపుతున్న చంద్రబాబు

గుర్తు చేసిన వైయస్‌ జగన్‌ 

సహాయ చర్యల్లోనూ ప్రభుత్వ ఘోర వైఫల్యం

దాన్నుంచి డైవర్షన్‌ కోసమే బోట్ల ఢీ పై వక్రభాష్యం

మేమే ఆ పని చేశామంటూ అదేపనిగా దుష్ప్రచారం

నిజానికి ఆ బోట్లు టీడీపీ నాయకుల బంధువులవి

అందుకు తగిన సాక్ష్యాలున్నా అబద్ధాలతో వక్రీకరణ

తన తప్పులపై చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

తేల్చి చెప్పిన వైయస్‌ జగన్‌

గుంటూరు:  రాష్ట్ర చరిత్రలో దుర్మార్గమైన, అన్యాయ పాలన కొనసాగుతోందని, గతంలో ఏనాడూ ఇంత దారుణంగా లేదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దాడులు, ఆస్తుల విధ్వంసం, అక్రమ కేసులు, అరెస్టులతో తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్న చంద్రబాబు, ఇకనైనా వాటన్నింటినీ ఆపాలని, లేకపోతే వారికీ అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదన్న ఆయన, ఇప్పుడు వారు వేస్తున్న ఈ బీజం సునామీ అవుతుందని, రేప్పొద్దున వారంతా ఇదే జైలులో ఉంటారని తేల్చి చెప్పారు. అక్రమ కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

టాపిక్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    విజయవాడ వరదల్లో 60 మందిని చంపిన పాపం పూర్తిగా సీఎం చంద్రబాబుదే అన్న శ్రీ వైయస్‌ జగన్, ఆ టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకే మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్త శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశారని తెలిపారు. నాడు సీఎంగా ఉన్న తనపై టీడీపీ ప్రతినిధి పట్టాభి దారుణ వ్యాఖ్యలు చేశారని, అవి విన్న ఎవరికైనా కోపం వస్తుందని, అందుకే వైయ‌స్‌ జగన్‌ను ప్రేమించే వారు టీడీపీ ఆఫీస్‌ వద్ద ధర్నా చేశారని చెప్పారు. అంతే తప్ప, తాము అధికారంలో ఉన్నా కక్ష సాధింపులకు దిగలేదన్న శ్రీ వైయస్‌ జగన్, నాలుగేళ్ల తర్వాత కేసులో అక్రమ అరెస్టులు చేసి వేధిస్తున్నారని ఆక్షేపించారు.

విపత్తులో ప్రభుత్వ వైఫల్యం:
    ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విజయవాడ విపత్తు సంభవించిందన్న వైయస్‌ జగన్, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముందస్తు సమాచారం ఉన్నా, ప్రజలను అప్రమత్తం చేయలేదని, దీంతో నగరాన్ని వరద అతలాకుతలం చేసిందని చెప్పారు. అయినా నిందను తమపై మోపుతున్నారని అన్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే 60 మంది చనిపోయారని తెలిపారు. సహాయ చర్యల్లోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న ఆయన, దాన్నుంచి డైవర్షన్‌ కోసమే ప్రకాశం బ్యారేజ్‌ను బోట్లు ఢీకొట్టిన ఘటనను వక్రీకరిస్తూ తామే ఆ పని చేశామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిజానికి ఆ బోట్లు టీడీపీ నాయకుల బంధువులవి అన్న ఆయన, అందుకు తగిన సాక్ష్యాలున్నా అబద్ధాలతో వక్రీకరణ చేస్తున్నారని వెల్లడించారు. 

 

నాలుగేళ్లనాడు ఏం జరిగింది?:
    2021లో ముఖ్యమంత్రిగా ఉన్న తనపై టీడీపీ అధికార ప్రతినిధి దారుణంగా ‘బోస్‌డీకె’ అని తిట్టారని.. అంటే దానర్థం ‘లం.. కొడకా’ అని చెప్పారు. ఆ మాదిరిగా తిడితే.. సీఎంను ప్రేమించే వారు, వైయస్ఆర్‌సీపీని అభిమానించే వారికి కడుపు మండదా అన్న ఆయన, కొందరు టీడీపీ ఆఫీసు వద్ద ధర్నా చేయగా, వారిపైనే దాడి జరిగిదని చెప్పారు. ఆ ఘటనలో ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని సీసీ కెమెరాలు, సెల్‌ ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా గుర్తించి, వారికి 41–ఏ కింద నోటీస్‌ కూడా ఇచ్చారని వెల్లడించారు. అయినా అది ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులే కాబట్టి, అరెస్టు సబబు కాదని స్పష్టం చేశారు.
    మరోవైపు నిజానికి ఆనాడు ఆ లొకేషన్‌లో నందిగం సురేష్‌ కానీ, శ్రీనివాస్‌ కానీ లేరని వైయస్‌ జగన్‌ వెల్లడించారు. టీడీపీ ఆఫీసులోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ చూస్తే ఆ విషయం తెలుస్తుందని గుర్తు చేశారు.  ఇష్టం వచ్చినట్లు తప్పుడు సాక్ష్యాలు జోడించి, భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి, తాము టార్గెట్‌ చేసిన వారి పేర్లన్నీ రాయించి, కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతోందని చెప్పారు.

‘రెడ్‌ బుక్‌’ ఘనకార్యం కాదు:
     రెడ్‌ బుక్‌లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని అనుకుంటున్నారన్న వైయస్‌ జగన్, అది పెద్ద పని కాదని, ఘనకార్యం కానేకాదని స్పష్టం చేశారు. ఆ బుక్‌ చూపుతూ, అందులో పేర్లున్న వారిపై దొంగ కేసులు పెడుతూ, రాజ్యాధికారం చేయడమే చంద్రబాబు పాలన అని గుర్తు చేశారు. రెడ్‌ బుక్‌ పాలనలో నిమగ్నమైన చంద్రబాబు, పరిపాలన పూర్తిగా గాలికొదిలేశారని ఆక్షేపించారు.

అడుగడుగునా అలసత్వం:
    రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై గత నెల 28నే ఐఎండీ (వాతావరణ శాఖ) హెచ్చరించినా, ప్రభుత్వం నాలుగు రోజులు పట్టించుకోలేదని, చివరకు బుడమేరు నీరు వదులుతామని 31వ తేదీన సమాచారం ఇచ్చినా, ఆ తర్వాత 10 గంటలకు పైగా సమయం ఉన్నా, విజయవాడ లోతట్టు వాసులను అప్రమత్తం చేసి, క్యాంప్‌లు ఏర్పాటు చేసి తరలించలేదని వైయస్‌ జగన్‌ తెలిపారు. అన్ని రోజులు కనీసం సమీక్ష కూడా జరపలేదని, ఫలితంగా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తమ పని చేయలేకపోయారని గుర్తు చేశారు. 
    ఎగువన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వద్ద ఫ్లడ్‌ ఫ్లో కుషన్‌ కూడా ఏర్పాటు చేసుకోలేదని చెప్పారు. ఒకవేళ సీఎం సమీక్ష నిర్వహించి, అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉంటే, ఇరిగేషన్‌ సెక్రటరీ ఆ ప్రాజెక్టుల నుంచి ఎప్పటికప్పుడు 25–30 టీఎంసీలు తగ్గిస్తూ.. మొత్తంమీద 80–90 టీఎంసీల మేర నీరు తగ్గించి ఉంటే, ఈ విపత్తు వచ్చి ఉండేది కాదని స్పష్టం చేశారు. రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి, తగిన వసతులు కల్పించే వారని, హోం సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చి వారిని తరలించే వారని తెలిపారు.

గతంలో ఏనాడైనా జరిగిందా?:
    అయితే అవన్నీ జరగకపోగా, సీఎం కరకట్ట మీద అక్రమంగా ఉంటున్న ఇంటిని రక్షించడం కోసం, ప్రజలకు కనీసం సమాచారం కూడా  ఇవ్వకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత బుడమేరు గేట్లు ఎత్తడంతో, ఆ నీరు విజయవాడను ముంచెత్తిందని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. దీంతో 60 మందికి పైగా చనిపోయారన్న ఆయన, వాస్తవంగా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉందని అన్నారు.
    ‘గతంలో కూడా ఎన్నో తుపాన్లు వచ్చాయి.. మరి ఏనాడైనా ఇలా ఇంతమంది చనిపోయారా?’ అని నిలదీశారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు చేసిన తప్పిదం అన్నవైయస్‌ జగన్, ఆయన మీద నెగ్లిజెన్స్‌ కేసు ఎందుకు నమోదు చేయకూడదని ప్రశ్నించారు.

ఆ బోట్లకు పర్మిషన్‌ ఎవరిది?:
    ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన బోట్లు ఎవరివి?. వాటికి ఎవరి హయాంలో పర్మిషన్‌ వచ్చింది? అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, నిర్వహించిన విజయోత్సవాల్లో ఆ బోట్లు కూడా ఉన్నాయన్న ఆయన.. గత నాలుగు నెలలుగా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దోపిడిలో చంద్రబాబుతో, ఆ బోట్ల యజమానులు కూడా భాగస్వాములయ్యారని చెప్పారు. ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసిన ఉషాద్రి అనే వ్యక్తి చంద్రబాబు, లోకేష్‌తో దిగిన ఫొటోలు ఉన్నాయని, కోమటి రామ్మోహన్, టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేత కోమటి జయరాం సోదరుడి కుమారుడని తెలిపారు. ఆలూరి చిన్నాకు కూడా టీడీపీతో సంబంధం ఉందని చెప్పారు. వాస్తవాలన్నీ ఇలా ఉంటే, అన్నీ వక్రీకరిస్తూ, వరదల నుంచి డైవర్ట్‌ చేస్తూ, తమ పార్టీని నిందిస్తున్నారని ఆక్షేపించారు.

ఎల్లో మీడియా దుర్మార్గపు రాతలు:
    ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇవన్నీ కూడా గోబెల్స్‌ మాదిరిగా చంద్రబాబును మోస్తున్నాయన్న  వైయస్‌ జగన్, ఒక అంశాన్ని ప్రస్తావించారు.
    ‘ఈరోజు ఈనాడులో.. రెయిన్‌ గేజ్‌ మీటర్లు చెడిపోయాయంట.. అని ఫ్రంట్‌ పేజీలో స్టోరీ రాశారు. చంద్రబాబుకు వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదట!. అవి మా ప్రభుత్వంలో చెడిపోయాయట!. చంద్రబాబు వచ్చాక ఇప్పుడు మరమ్మతులు చేయిస్తున్నారట!’ అన్న శ్రీ వైయస్‌ జగన్, ఇంతటి దుర్మార్గమైన రాతలు రాస్తున్న వీళ్లు మనుషులేనా? అని ప్రశ్నించారు.
    రాష్ట్రంలో పాత విధానంలో ఉన్న రెయిన్‌ గేజ్‌ మీటర్లు ఎప్పుడో అవుట్‌డేట్‌ అయ్యాయని, వాటి స్థానంలో 2014 నుంచి ఆటోమెటిక్‌ సెన్సార్‌ వ్యవస్థలు, ఆటోమేటెడ్‌ వెదర్‌ స్టేషన్లు 1599 అందుబాటులో ఉండగా.. వాటిని మరింత బలోపేతం చేస్తూ మరో 450 ఆటోమేటెడ్‌ వెదర్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అందుకే రాష్ట్రంలో వర్షపాతంపై స్పష్టంగా అన్ని వివరాలు ఉన్నాయని, రైతులకు ఇన్సూరెన్స్‌ వస్తోందని, ఈ–క్రాపింగ్‌ జరుగుతోందని చెప్పారు. కేవలం వరదల టాపిక్‌ డైవర్ట్‌ చేసేందుకు సిగ్గు లేని రాతలు రాస్తున్నారని చెప్పారు. 

ఎవరూ రాకూడదని కుట్రలు:
    వర్షాలు, వరదల్లో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే శంకర్రావును అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు, ఆయన కారును «ధ్వంసం చేశారని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. అంటే.. ఎవరూ వరద బాధితులను చూడకూడదట!. వారిని పరామర్శించకూడదట!. అలా ఆయా చోట్లకు ఎవరూ రాకూడదు!. ఎందుకంటే, చంద్రబాబు తప్పిదాలు, పాపాలు బయటకు రాకూడదు అన్నది వారి ధోరణి అని శ్రీ వైయస్‌ జగన్‌ మండి పడ్డారు. శిశుపాలుని పాపాల మాదిరిగా.. చంద్రబాబు తప్పులు, పాపాలు కూడా వేగంగా పెరుగుతున్నాయన్న ఆయన.. చంద్రబాబు, ఆయన పార్టీ భూస్థాపితం అయ్యే రోజులు త్వరలోనే వస్తాయని చెప్నారు.

‘సూపర్‌ సిక్స్‌’ హామీలు ఏమయ్యాయి?:
    టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడున్నర నెలలు దాటుతున్నా.. ఇప్పటి వరకు, గత ఎన్నికల్లో టీడీపీ ఆర్భాటంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హమీలు ఏమయ్యాయో తెలియడం లేదని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు.
    అదే ఈరోజు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంటే.. రైతులందరికీ ఈపాటికే రైతు భరోసా సొమ్ము పడి ఉండేదని, రైతులందరికీ ఉచితంగా ఇన్సూరెన్స్‌ అంది ఉండేదని చెప్పారు. విపత్తులతో ఇంత ఆస్తి, పంట నష్టం జరుగుతున్నా, ఎక్కడా ఆదుకునే కార్యక్రమం జరగడం లేదని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించి, వాటిపై సోషల్‌ ఆడిట్‌ చేసి.. ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా? అందరికీ వచ్చిందా? అన్ని ఊర్లూ నమోదయ్యాయా? అని చూసే కార్యక్రమం జరగడం లేదని చెప్పారు.
    సోషల్‌ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయని, గ్రామ సచివాలయంలో పారదర్శకంగా లిస్టులు పెట్టే కార్యక్రమం కూడా పోయిందని తెలిపారు. అలాగే అర్హత ఉన్నా రాని వాళ్లు ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవాలన్న విధానం కూడా గాలికి ఎగిరిపోయిందని, అలాగే రైతులకు పెట్టుబడి సహాయం లేదని, ఉచిత ఇన్సూరెన్స్‌ లేదని, ఈ–క్రాప్‌ లేదన్న శ్రీ వైయస్‌ జగన్, ఇలాంటి విపత్తు వస్తే కనీసం రైతులను పారదర్శకంగా ఆదుకునే కార్యక్రమం కూడా లేదని గుర్తు చేశారు.

పడకేసిన ఆరోగ్యశ్రీ:
    ‘మామూలుగా జనవరిలో ఏదైనా ఆస్పత్రి బిల్స్‌ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రాసెస్‌ చేసి మార్చిలో బిల్స్‌ ఇస్తారు. మార్చి 16న కోడ్‌ వచ్చింది. ఇక అంతే. జనవరి నుంచి ఇప్పటి దాకా రూ.2 వేల కోట్ల పైచిలుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బిల్లులు. ఇంత వరకు ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్య ఆసరానూ అటకెక్కించారు. 104, 108 ఎంప్లాయీస్‌ జీతాలు ఇవ్వడం లేదంటున్నారు’.
    ‘ఒకేసారి 17 కొత్త మెడికల్‌ కాలేజీలు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కట్టడం మొదలు పెట్టి, అందులో 5 అప్పటికే పూర్తి చేసి, ఆ 5 కాలేజీల్లో సీట్లు తెచ్చుకుని, మిగిలిన 5 కాలేజీల్లో ఇప్పుడు సీట్లు తెచ్చుకునే దాని కోసం అన్ని వసతులూ క్రియేట్‌ చేసి పెడితే, చంద్రబాబు ఏం చేస్తున్నాడు? డబ్బుల కోసం మెడికల్‌ కాలేజీలను స్కాముల కింద మార్చేసి తనకు కావాల్సిన వాళ్ల కోసం మెడికల్‌ కాలేజీలను అమ్మేసే కార్యక్రమం చేస్తున్నాడు. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రతి మెడికల్‌ కాలేజీ, ప్రతి గవర్నమెంట్‌ ఆస్పత్రిలోనూ ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు ఉండేట్టుగా తీసుకొస్తే ఈరోజు మళ్లీ మందుల కొరత, నాడు–నేడు ఆగిపోయింది’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

విద్యాదీవెన పెండింగ్‌:
    జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్‌ క్వార్టర్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ క్వార్టర్లకు సంబంధించిన విద్యాదీవెన సొమ్ము పెండింగ్‌ పెట్టారని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. అదే వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకోసారి, విద్యాదీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలో, పిల్లాడు, పాప ఉమ్మడి ఖాతాలో నేరుగా పడిపోయేదని గుర్తు చేశారు. ఇంకా వసతి దీవెన కూడా ఎగరగొట్టేశారని, అమ్మ ఒడి అన్నది గాలికి వదిలేశారని, గోరుముద్ద చంద్రబాబు ప్రభుత్వంలో తినలేక ధర్నాలు చేస్తూ ఆస్పత్రులకు చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం గాలికొదిలేశారని, మూడో తరగతి నుంచి పీరియడ్‌గా పిల్లలకు నిర్వహించిన టోఫెల్‌ క్లాసులనూ ఎత్తేశారని ఆక్షేపించారు.

డోర్‌ డెలివరీ లేదు:
    తమ ప్రభుత్వంలో ప్రతి పథకం డోర్‌ డెలివరీ జరిగేదని గుర్తు చేసిన వైయస్‌ జగన్‌.. పెన్షన్, రేషన్‌ ఇంటికే వచ్చేదని చెప్పారు. అదే ఈరోజు పెన్షన్‌ రావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోందని, రేషన్‌ ఇంటికి రావడం దేవుడెరుగు.. వస్తే చాలు అన్నట్టు తయారైందని, ఇంటి వద్దే సేవలందించే వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలిందని తెలిపారు.

సూపర్‌ సిక్సా? అంటే ఏమిటి?:
    సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గురించి మాట్లాడాల్సి వస్తే.. సూపర్‌ సిక్సా.. సూపర్‌ సెవెనా? అంటే ఏమిటి నాకు గుర్తు లేదే? అని సీఎం చంద్రబాబు అంటున్నాడని శ్రీ వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. 
    ‘ఎన్నికలప్పుడు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటింటికి పంపించి డోర్‌ టు డోర్‌ ప్రచారంలో చెప్పిన మాటలు ఏమిటి?. నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు అన్నారు. ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చిదంటే, వారితో పాటు చిన్నమ్మలో పెద్దమ్మలో బయటకు వచ్చారంటే మీకు 18 వేలు, మీకు 18 వేలు అనేవారు. ఇంట్లో నుంచి 50 ఏళ్ల పైచిలుకు వయసున్న మహిళ బయటకొస్తే జగనన్న చేయూత కింద ఇచ్చింది కేవలం 18 వేలే, చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి 48 వేలు ఇస్తాడు మీకు సంతోషమేనా అన్నారు. ఇంట్లోంచి 20 ఏళ్ల పిల్లాడు బయటకొస్తే నీకు నెలకు రూ.3 వేలు అని చెప్పారు. ఇంట్లో నుంచి రైతు బయటకొస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా’ అని ఊరించారని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు.

క్షమాపణలు చెప్పండి:
    ఇప్పటికైనా చంద్రబాబు తాను చేసిన తప్పులు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని  వైయస్‌ జగన్‌ కోరారు. ఇకనైనా ప్రజలకు మేలు చేయాలని, లేకపోతే పుట్టగతులు ఉండవని అన్నారు. వారి పాపాలు వేగంగా పండుతున్నాయన్న ఆయన, వచ్చే ఎన్నికల్లో వారికి సింగిల్‌ డిజిట్‌ కూడా రాని పరిస్థితి తలెత్తుతోందని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top