కాకినాడ : చంద్రబాబూ.. ఇకనైనా జగన్నామం ఆపేసి నిజాయితీగా పాలన చేయడం నేర్చుకో..అంటూ వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా చంద్రబాబు నిత్యం వైయస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో వచ్చి ఇన్నిరోజులు గడిచినా.. తాను చేయాల్సిన పనులేవీ చేయలేదు. దానంతటికి కారణం వైయస్ జగనే అంటారు. ఎక్కడ ఏం జరిగినా.. వైయస్ జగన్ పేరే చెప్తారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచింది. చేయాల్సిన దాని గురించి సీఎం ఆలోచించాలని, ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సిన దాని మీద ధ్యాస పెట్టాలని వైయస్ జగన్ సూచించారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారాలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లాంటి ఎల్లో మీడియా తోడైయ్యిందని వైయస్ జగన్ పేర్కొన్నారు. గోబెల్స్ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస. అబద్ధాలను మ్యానుఫ్యాక్చర్ చేయడంలో దిట్ట. వాటిని అమ్ముకోగలిగే కెపాసిటీ ఈ భూమ్మీద కేవలం ఒక్క చంద్రబాబుకే ఉందని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం వైయస్ జగన్ పర్యటించారు. ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాల సందర్శించారు. మాధవపురం, యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి, రమణక్కపేటలో వైయస్ జగన్ పర్యటించి, వరద బాధితులను పరామర్శించి, వారికి కలిగిన నష్టాన్ని ఆరా తీశారు. అనంతరం రమణక్కపేటలో వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ మీడియా సమావేశం ముఖ్యాంశాలు.. బుడమేరు తరహాలోనే..: విజయవాడను ముంచెత్తిన బుడమేరు తరహాలోనే ఏలేరు రిజర్వాయరు నిర్వహణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విజయవాడ ఏ విధంగా వరదలతో అతలాకుతలం అయిందో.. ఇక్కడ ఏలేరులోనూ అదేరకమైన పరిస్థితి కనిపిస్తోంది. తుఫాను వస్తుందని, తీవ్ర వాయుగుండం కింద మారుతుందని, భారీ వర్షాలు పడతాయని ఐఎండీ నుంచి హెచ్చరికలు ఉన్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించింది. కనీసం ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించలేదు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించలేదు. ఫ్లడ్ కుషన్ నిర్వహించలేదు: ఏలేరు రిజర్వాయరులో అప్పటి నీటిమట్టం, రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్లడ్ కుషన్ నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నా, ఆ పని చేయలేదు. ఏలేరు రిజర్వాయర్ కెనాల్ సామర్థ్యం 14 వేల క్యూసెక్కులు మాత్రమే. సెప్టెంబరు 1న, ఆ రిజర్వాయర్‌కు 9950 క్యూసెక్కుల వరద వచ్చినా, కేవలం 300 క్యూసెక్కుల నీరు వదిలారు. సెప్టెంబరు 2న 7033 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, 300 క్యూసెక్కులు మాత్రమే వదిలారు. అలా రిజర్వాయర్ రెగ్యులేటరీ కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. దీంతో 9వ తేదీ నాటికి ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండే పరిస్థితి వచ్చింది. మ్యాన్ మేడ్ ఫ్లడ్: సెప్టెంబరు 9 నాటికి ఏలేరు రిజర్వాయర్‌లో 45,335 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, 21,500 క్యూసెక్కుల వదలగా.. ఆ మర్నాడు 10వ తేదీన, 26,134 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, 27,275 క్యూసెక్కులు మాత్రమే విడిచిపెట్టారు. కెనాల్ సామర్థ్యాన్ని మించి నీరు వదలడంతో, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. అందుకే ఇది కచ్చితంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్. ఇది బాధ్యత లేని, ప్రజల పట్ల మానవత్వం చూపని ప్రభుత్వం. వరదలు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కనీస ఇంగితం లేని ప్రభుత్వం. గోబెల్స్‌కు తమ్ముడు: అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు గోబెల్స్‌కు తమ్ముడు. అలాగే అబద్ధాలను మ్యానుఫ్యాక్చర్ చేయడంలోనూ చంద్రబాబు దిట్ట. వాటిని అమ్మగలగడంలో కూడా చంద్రబాబును మించిన వారు ప్రపంచంలో లేరు. ఆయనకు నిత్యం వంత పాడే మీడియా కూడా అవే అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కెనాల్ ఆధునికీకరణపైనా అబద్ధాలు: ఏలేరు కెనాల్ ఆధునికీకరణపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి ఏ కెనాల్ ఆధునికీకరణ చేయాలన్నా, అందులో నీళ్లు లేనప్పుడో లేదా క్రాప్ హాలీడే ప్రకటిస్తే తప్ప అది సాధ్యం కాదు. వాస్తవానికి తొలుత ఆ పనులను 2008లో నాటి సీఎం వైయస్సార్‌గారు రూ.138 కోట్లతో చేపట్టారు. కానీ, ఆ తర్వాత వచ్చిన వారెవ్వరూ ఆ పనులు పట్టించుకోలేదు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పనుల అంచనా వ్యయాన్ని రూ.295 కోట్లకు పెంచారు తప్ప, పనులు మాత్రం చేయలేదు. నిజానికి అప్పుడు రిజర్వాయర్‌లో నీళ్లు పెద్దగా లేవు. కాలవలో నీరూ పారలేదు. అయినా చంద్రబాబు ఆ పనులు ఎందుకు చేయలేకపోయారు?. 2019లో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరసగా వర్షాల కారణంగా క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం. నిజానికి చంద్రబాబు హయాంలో అంతా కరవే. అయినా పనులు మాత్రం చేయలేదు. ఏం జరిగినా మాపైనే నిందలు: ఇప్పుడు ఏలేరు వరద మొదలు.. ఎప్పుడు, ఎక్కడ, ఏం జరిగినా చంద్రబాబు ప్రతిదానికీ మావైపే వేలెత్తి చూపుతూ, దానికి జగనే కారణం అని ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలైంది. ఇకనైనా ప్రతి దానికి మమ్మల్ని నిందించడం మానుకుని ప్రజలకు న్యాయం చేయండి. అన్నీ విస్మరించారు: రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇంత వరకు ఇ–క్రాప్ లేదు. సచివాలయం, ఆర్బీకే వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ కనుమరుగైంది. రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బీమాను గాలికొదిలేశారు. వారి తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌నూ పట్టించుకోవడం లేదు. గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్లు లేవు. వ్యవసాయ సీజన్ మొదలైనప్పటికే వారికి ఇవ్వాల్సిన రైతు భరోసా, వారికి అందాల్సిన సున్నా వడ్డీ ఏమయ్యాయి?. గతంలో మా ప్రభుత్వ హయాంలో రైతులకు రూ.13,500 పెట్టుబడి సాయం అందేది. రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులకు పంట నష్టం జరిగితే, గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉంటూ.. ఆర్బీకేల సహాయంతో ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ ఉండేది. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందించే వాళ్లం. రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని విధాలుగా ఆదుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కాబట్టి, గతానికీ ఇప్పటికీ తేడా చూడండి. వైయస్ జగన్ ఉండి ఉంటే..: ఈ కష్టంలో కనుక జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే.. రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది. అది కూడా సీజన్ ప్రారంభంతోనే సాయం చేసి ఉండేవాళ్లం. గతంలో చంద్రబాబు హయాంలో విపత్తులు వస్తే హెక్టారుకు కేవలం రూ.15 వేలు మాత్రమే ఇస్తున్న పరిస్థితులు ఉండేవి. కానీ మా ప్రభుత్వ హయాంలో అందుకు రూ.17 వేలు ఇచ్చాం. దీనిపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పుడే కనుక జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే, రైతుకు పెట్టుబడి కింద రూ.13,500, ఎకరాకు రూ.7 వేల ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చేది. ఇన్సూరెన్స్ ప్రీమియమ్ ప్రభుత్వమే పూర్తిగా కట్టి ఉండేది కాబట్టి రూ.24 వేల నుంచి రూ.29 వేల వరకు బీమా పరిహారం కూడా వచ్చేది. దాంతో పాటు, సున్నా వడ్డీ కింద దాదాపు రూ.4 వేలు.. అన్నీ కలిపి రైతులకు ప్రతి ఎకరాకు దాదాపు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు సాయం అంది ఉండేది. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు మాత్రం.. అప్పుడు జగన్ రూ.7 వేలు ఇచ్చాడు.. నేను రూ.10 వేలు ఇవ్వబోతున్నానంటూ అబద్ధాలు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో పంటల బీమా: 2014–19 మధ్య 30.85 లక్షల రైతులకు రూ.3,411 కోట్ల ఇన్సూరెన్స్ మాత్రమే ఇచ్చారు. అది కూడా రైతులు వారే ప్రీమియమ్ కడితే.. మరి ఆయన ఇచ్చిందేమిటి?. అదే జగన్ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య చూస్తే.. 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్ల ఇన్సూరెన్స్ వచ్చింది. అది కూడా ప్రభుత్వమే పూర్తి ప్రీమియమ్ చెల్లించింది. చంద్రబాబు పెట్టిన రూ.715 కోట్ల బకాయిలు కూడా మా ప్రభుత్వం కట్టింది. మానవతా దృక్పథంలో రెండు ప్రభుత్వాల మధ్య తేడా చూడండి. బాబు నిర్వాకం. రైతులకు నష్టం: 2023–24 ఖరీఫ్‌లో వచ్చిన కరవుకు సంబంధించి, మళ్లీ ఖరీఫ్ వచ్చే సరికి.. అంటే 2024–25 ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులకు సహాయం అందాలంటే, ఆ టైమ్‌లో అంటే.. జూన్‌లో రూ.1278 కోట్ల ప్రీమియమ్ కట్టాలి. కానీ చంద్రబాబు ఆ మొత్తం కట్టకపోవడం వల్ల, గత ఏడాది ఖరీఫ్ నష్ట పరిహారం కూడా రైతులకు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఇందులో ప్రతి మాట వాస్తవం. అదే మా ప్రభుత్వ హయాంలో ఒక్క రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13,500 చొప్పున 53.58 లక్షల మంది రైతులకు ఇచ్చిన మొత్తం రూ.34,288 కోట్లు. ఒక్కసారి గుర్తు చేసుకొండి. ఎన్నికల ముందు వారేమన్నారు?: ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏమన్నాడు. ఇంటింటికి వెళ్లి ఏం ప్రచారం చేశాడు?. చంద్రన్న వస్తాడు. రూ.20 వేలు ఇస్తాడు. జగన్ అయితే రూ.13,500 మాత్రమే ఇస్తాడు. పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు ఇస్తాం అని పిల్లల్ని, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఇంకా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని వారినీ మోసం చేశాడు. ఇంకా 50 ఏళ్లు దాటిన అమ్మలు కనిపిస్తే.. జగన్ మీకు రూ.18 వేలు ఇస్తాడు. మా చంద్రన్న రూ.48 వేలు ఇస్తాడని అమ్మనూ మోసం చేశాడు. ప్రతి పిల్లాడికి నెలకు రూ.3 వేల చొప్పున ఏటా రూ.36 వేల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. కానీ, ఇప్పుడేం జరిగింది?: ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలు. కానీ ఒక్కటీ లేదు. రైతు భరోసా లేదు. అమ్మ ఒడి లేదు. సున్నా వడ్డీ పోయింది. చేయూత లేదు. ఆసరా అంత కంటే లేదు. ఇంత అన్యాయంగా ఒకవైపు అందరినీ మోసం చేస్తూ.. బడి పిల్లల గోరుముద్దనూ నిర్వీర్యం చేశాడు. పిల్లలు ఆందోళన చేస్తున్నారు. బడుల్లో నాడు–నేడు ఆగిపోయింది. టోఫెల్ శిక్షణ లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు జనవని నుంచి రూ.2 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్. జనవరి బిల్లులు మార్చిలో ఇస్తారు. అప్పుడు కోడ్ రావడంతో మేము ఇవ్వలేకపోయాం. ఆరోగ్య ఆసరా లేదు. 108, 104 సర్వీసుల సిబ్బందికి జీతాలు లేవు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు.మూడు ౖత్రైమాసికాలు గడిచి పోయాయి. వసతి దీవెన కూడా అందడం లేదు. వ్యవస్థలన్నీ అతలాకుతలం: వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటీ డోర్ డెలివరీ. కానీ ఇప్పుడు ఏది కావాలన్నా.. టీడీపీ నాయకులను అడగాలి. ఆ నాయకులు ఇళ్లలోనే సచివాలయ సిబ్బంది పెన్షన్ పంచుతున్నారు. ఎవరైనా అలా వెళ్లి పెన్షన్ తీసుకోకపోతే, కట్ చేస్తున్నారు. ప్రభుత్వ పాలన గాలికి ఎగిరిపోయింది. ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే, వారిపైనే రివర్స్ కేసు పెడుతున్నారు. రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వర్షాలు, వరదలపై హెచ్చరికలు ఉన్నా, ఒక్కరిని కూడా రిలీఫ్ కేంద్రాలకు పంపలేదు. ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడు. రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేయడు. హోం సెక్రటరీ వరద బాధితులను, లోతట్టు ప్రాంతాల వారని తరలించడు. ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: అంటే ఎవరూ తమ బా«ధ్యతలు నిర్వర్తించరు. ఇలాంటి దారుణ పాలన పోవాలి. ప్రజలకు అన్నీ అర్ధమవుతున్నాయి. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, మోసాల కింద మారుతున్నాయి. ప్రజలకు కోపం వస్తోంది. వారు తిరగబడే రోజులు దగ్గరే ఉన్నాయి. అది జరగకూడదని రెడ్‌బుక్ పాలన చేస్తున్నారు. అయినా ఏం చేయలేరు. ప్రజలు ఇంకా భరించే పరిస్థితి లేదు. ప్రభుత్వం ప్రజల కష్టాలకు స్పందించడం లేదు. చంద్రబాబు ఎంతసేపూ డ్రామాలు చేస్తున్నాడు. షో లు చేస్తున్నాడు.