అధికారంలోకి రాగానే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం

ఉద్యోగాలు, ఉపాధి అని చంద్రబాబూ మోసం చేశారు

నిరుద్యోగ భృతి అని యువతను వంచించారు

జాబు రావాలంటే బాబు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది

గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగాల్లో నిరుద్యోగులకే ప్రాధాన్యం

వాహనాల కొనుగోలు సబ్సీడీ కూడా ఇస్తాం

ఉద్యోగాలు సాధించేలా ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు

నవరత్నాలతో మీ జీవితాలు బాగుపడతాయని నమ్ముతున్నా

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇవ్వండి ప్రతి ముఖంలో సంతోషం నింపుతా

తిరువూరు ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తిరువూరు: అధికారంలోకి రాగానే ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంతేకాకుండా గ్రామ సెక్రటేరియట్‌ ద్వారా ఆ గ్రామాల్లోని పదిమంది యువతకు, 50 కుటుంబాలకు వలంటీర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ఆర్టీసీ బస్సులు, అద్దె కార్లు వంటి వాటిల్లో నిరుద్యోగులకే అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. అద్దెకు పెట్టేందుకు కారు కొనుగోలు కూడా సబ్సిడీ ఇప్పిస్తామన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. గుంటూరు జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎన్నికల బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని మాట్లాడుతూ.. 

ఇదే తిరువూరు నియోజకవర్గంలో రైతన్నలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కాదు. నాగార్జున సాగర్‌ దగ్గరలోనే ఉంది. కానీ సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా చంద్రబాబు దీని గురించి ఆలోచన చేయలేదు. ఇదే తిరువూరు నియోజకవర్గంలో సాగు, తాగునీరు కోసం నూతిపాడు వద్ద అప్పట్లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎత్తి పోతల పథకం, తెల్లదేవరపల్లిలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ రెండు ప్రాజెక్టులు ఆ దివంగత మహానేత హయాంలో జరిగాయి. కనీసం వాటిని కూడా సరిగ్గా వాడుకోలేని అన్యాయమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం ఉందని రైతన్నలు వాపోతున్నారు. తిరువూరులో తాగునీటి కొరత తీర్చడానికి కృష్ణా జలాలు తీసుకువస్తామని, ఇప్పుడు శిలాఫలకాలు వేస్తున్నాడు చంద్రబాబు. ఐదేళ్లు ప్రజలను పట్టించుకోలేదు. ప్రజలకు సాగు నీరు, తాగునీరు ఉందా లేదా అని చూడలేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇవాళ శిలాఫలకాలు వేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి పాలకుడు మనకు కావాలా అని అడుగుతున్నా.. అధికారంలో ఉన్నప్పుడు మనం గుర్తుకురాం. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వచ్చే ఇలాంటి అన్యాయమైన పాలన కావాలా అని అడుగుతున్నా.. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు పైగా మామిడి సాగు అవుతుంది. ఐదేళ్లుగా మామిడికి గిట్టుబాటు ధరలు లేవు. బంగనపల్లి, రసాలు, కలెక్టర్‌ రకాలు టన్ను కనీసం రూ. 30 వేలు వస్తే కానీ గిట్టుబాటు కాదు. పరిస్థితి చూస్తే మార్కెట్‌లో దళారులంతా సిండికేట్‌ అవుతున్నారు. రూ. 15 వేలు కూడా ధర రాని పరిస్థితి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు తన సొంత కంపెనీ లాభాల కోసం రైతులకు నష్టం చేసే విధంగా దళారీలకు తానే కెప్టెన్‌ అయి పంట పండించినప్పుడు రేట్లు తానే దగ్గరుండి తగ్గిస్తున్న అన్యాయమైన పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. 

భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ ఎక్కువై ఏ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితులు నిరుడు సంవత్సరం 30 మంది చనిపోయారు. వారు చనిపోతే కనీసం ఒక్క డయాలసిస్‌ యూనిట్‌ కూడా లేదంటే ఇంతకన్నా అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా..? నా 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి అనువు చూశాను. ప్రతి ప్రాంతం చూశాను. ప్రతి కష్టం విన్నాను. ప్రతి నష్టం చూశాను. నేను మీ అందరికీ చెబుతున్నాను.. నేను ఉన్నానని కచ్చితంగా భరోసా ఇచ్చి చెబుతున్నాను. నా పాదయాత్రలో ప్రతి గ్రామం నుంచి వినేది అన్నా.. ఉద్యోగాలు లేవన్నా.. అనే మాట ప్రతి నోటా వచ్చింది. ఉద్యోగాలు, ఉపాధి లేదు. వస్తాయనే ఆశ లేదు. ఎక్కడ చూసినా నిరాశ, నిస్పృహ. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు. ఐదేళ్లుగా ప్రతి ఇంటికి నెలకు రూ. 2 వేలు ఇస్తానన్న నిరుద్యోగ భృతి రావడం లేదు. ఎన్నా మేము ఎలా బతకాలన్నా.. అని యువతీ యువకులు చెప్పిన బాధలు విన్నా.. కష్టాలు చూశా. ప్రభుత్వ పరిధిలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయే నాటికి లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్‌ కమిటీ తేల్చింది. ఈ ఐదు సంవత్సరాల్లో రిటైర్డ్‌ అయిన వారిని కూడా కలుపుకుంటే మరో 90 వేలు జత అవుతాయి. దాదాపుగా 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్‌ నోటిఫికేషన్‌ ఇస్తుందేమో.. మాకు ఉద్యోగాలు వస్తాయేమో అని పిల్లలు కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు తగలేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్‌ ఇవ్వదు. ప్రత్యేక హోదాను తాకట్టుపెడుతుంది. ఉద్యోగాలు రావు.. నిరుద్యోగ భృతి రానేరాని పరిస్థితుల్లో ఇవాళ యువత ఉంది. ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్న మాట జాబు రావాలంటే బాబు రావాలని అన్నాడు. ఐదేళ్ల పాలన చూశారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా.. జాబు రావాలంటే బాబు పోవాలి అని చెప్పి ప్రతి ఊర్లో స్వరం వినిపిస్తుంది. ప్రతి మాట నేను విన్నాను. ప్రతి కష్టం నేను చూశాను. మీ అందరికీ హామీ ఇస్తున్నాను.. నేను ఉన్నానని మాటిస్తున్నా.. 

ఫీజురియంబర్స్‌మెంట్‌ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల బాధలు విన్నాను. ఇంజనీరింగ్‌ చదవాలంటే సంవత్సరానికి ఫీజులు రూ. లక్షపైనే, ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజురియంబర్స్‌మెంట్‌ అరకొర. ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఆ పిల్లలు ఇంజనీరింగ్‌ చదివించాలంటే ఆ తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి. అప్పులపాలవుతున్న పరిస్థితులు. ఆ పరిస్థితులు చూడలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకున్న దుర్ఘటనలు చూశా. ఫీజుల కోసం అల్లాడుతున్న పిల్లలకు, చదివించలేని పరిస్థితుల్లో ఉన్న ఆ తల్లిదండ్రులకు చెబుతున్నా.. నేను ఉన్నానని భరోసా ఇస్తున్నా. పేదరికంలో ఉన్న ప్రతి పేదవాడికి చెబుతున్నా.. పిల్లలు చదవాలని, చదివితేనే జీవితాలు బాగుపడతాయని, పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద జీతాలు సంపాదించాలని, ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకువస్తారని ఎదురుచూస్తున్న ప్రతి తల్లిదండ్రులకు చెబుతున్నా.. నవరత్నాల్లో మనం ప్రకటించిన నవరత్నం ఒకటి చెబుతా.. ప్రతి తల్లిదండ్రులకు చెబుతున్నా.. మీ పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్‌ చదివిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు దగ్గరుండి నేను చదివిస్తానని మాటిస్తున్నా. పిల్లలను చదివించడమే కాదు. ఆ పిల్లలను చదివించడం కోసం హాస్టల్‌లలో పెట్టాలి. హాస్టల్, మెస్‌ చార్జీల ఖర్చులు సంవత్సరానికి రూ. 15 వేలు అవుతుంది. మీ పిల్లలను చదివించడమే కాదు మెస్, హాస్టల్‌ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ. 20 వేలు అదనంగా ఇస్తానని చెబుతున్నా. 

ఉద్యోగాలు, ఉపాధి కోసం వెతుకుతున్న యువతకు చెబుతున్నా.. దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తరువాత మన పిల్లలకు ఏరకంగా ఉద్యోగాలు ఇప్పిస్తానో చెబుతా.. దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటగా చేయబోయేది గవర్నమెంట్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 2.30 లక్షల ఉద్యోగాలు రిలీజ్‌ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం జవనరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ కూడా విడుదల చేస్తామని మాటిస్తున్నా. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని, వాటి కోసం భూములు ఇస్తాం. ఉద్యోగాలు ఇస్తారేమోనని ఆశిస్తాం. కానీ ఇవాళ పరిస్థితి పరిశ్రమల్లో ఉద్యోగాలు రావడం లేదు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి శాసనసభ సమావేశంలోనే ఒక చట్టాన్ని తీసుకువస్తాం. కొత్తగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే చట్టం తీసుకువస్తాం. మనం తీసుకువచ్చే చట్టం వల్ల పరిశ్రమలు నష్టపోకుండా జిల్లాను ఒక కేంద్రంగా తీసుకొని ఆ జిల్లాలో ఏయే పరిశ్రమలు ఉన్నాయో చూసి ఆ పరిశ్రమలకు సరిపోయే విధంగా మన పిల్లలను తయారు చేసేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు పెట్టి మన పిల్లలకు తర్ఫీదు ఇప్పిస్తాం. మన చదివే ఇంజనీరింగ్‌ కోర్సులకు ఈ తరానికి సంబంధించి ఉద్యోగాలు ఎలా రావాలి. ఏం చదివితే ఉద్యోగాలు వస్తాయనేది మన చదువుల్లో చేర్చుతాం. మన చదువు అయిపోయిన తరువాత ఉద్యోగాలు వచ్చేలా తయారు చేస్తాం. అంతేకాకుండా ఉద్యోగాలు కల్పించేందుకు మీ ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా. ఆ గ్రామ సెక్రటేరియట్‌లో మీ గ్రామానికి చెందిన చదువుకున్న వాళ్లను పది మందికి మీ గ్రామంలోనే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నా.

గ్రామాల్లో పెన్షన్, రేషన్, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా, ఇల్లు, లోన్‌ మంజూరు కావాలన్నా లంచం. లంచం లేనిది ఏ పని జరగడం లేదు. ఈ పనికోసమైనా జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లమంటున్నారు. ఈ వ్యవస్థను కూడా పూర్తిగా మార్చేస్తాం. గ్రామ సెక్రటేరియట్‌ తీసుకొస్తాం. ఇల్లు, రేషన్, పెన్షన్‌ నవరత్నాల్లో ఏ పథకం కావాలన్నా.. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే అందే విధంగా చేస్తానని హామీ ఇస్తున్నా. ఉద్యోగాల కోసం ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ మీ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వలంటీర్‌గా నియమిస్తాం. ఆ గ్రామ వలంటీర్‌కు రూ. 5 వేల గౌరవ వేతనం ఇస్తాం. సేవా దృక్పథం ఉన్నవారు గ్రామ వలంటీర్‌గా వచ్చి చేరుతారు. మెరుగైన ఉద్యోగం వచ్చేవరకు వలంటీర్‌గా సేవలు అందిస్తారు. గ్రామ వలంటీర్‌ గ్రామ సెక్రటేరియట్‌కు అనుసంధానంగా పనిచేస్తూ 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి గవర్నమెంట్‌ సంక్షేమ పథకం రేషన్‌ బియ్యం నుంచి పెన్షన్, ఇల్లు, ఫీజురియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, రైతు భరోసా, వైయస్‌ఆర్‌ చేయూత ప్రతి పథకం 50 ఇళ్ల పరిధిలో ఉన్న ఆ గ్రామ వలంటీర్‌ ప్రతి ఇంటికి తానే వెళ్లి డోర్‌ డెలవరీ చేస్తాడని హామీ ఇస్తున్నా.. ఎవరూ ఎవడికి లంచం ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడమని చెబుతున్నా. ప్రతి పేదవాడికి మంచి చేసే కార్యక్రమం చేస్తానని హామీ ఇస్తున్నా. 

ఉద్యోగాలు ఇచ్చే విషయంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తాం. గవర్నమెంట్‌లో కాంట్రాక్టులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులను గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ తీసుకుంటుంది. ఈ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం జేసీ బ్రదర్స్, కేశినేని ట్రావెల్స్‌కు ఇస్తుంది. ఈ పరిస్థితులు మార్చేస్తాం. గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌లు అన్నీ బస్సులు, కార్లు అద్దెకు తీసుకోవడం ఇలా అనేకం ఉంటాయి. అవన్నీ నిరుద్యోగ యువతీయువకులు ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇవ్వడమే కాదు.. ఒక కారు గవర్నమెంట్‌కు అవసరం ఉంటే నిరుద్యోగ యువకుడు ఆ పెట్టాలనుకుంటే ఆ కారు కొనేదానికి సబ్సిడీ కూడా ఇస్తాం. ప్రతి గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌లన్నీ కూడా నిరుద్యోగులకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ కాంట్రాక్ట్‌లన్నీంటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం ఇస్తామని హామీ ఇస్తున్నా. 

ప్రత్యేక హోదాను సాధిద్దాం. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో హోదాను సాధించుకుంటే పరిశ్రమలు, ఆస్పత్రులు వస్తాయి. హోదా ఉంటే ఇన్‌కం ట్యాక్స్, జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు. అప్పుడు ఆస్పత్రులు, పరిశ్రమలు, హోటళ్లు వస్తాయి. దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో 25 ఎంపీ స్థానాలు మన పార్టీని గెలిపించుకుంటే కేంద్రంలో అధికారంలోకి ఎవరైనా రాని ప్రత్యేక హోదా ఇస్తామని సంతకం పెడితేనే మద్దతు ఇచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్తాం. ప్రత్యేక హోదాను కూడా సాధించి రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. 

దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపు మన ప్రభుత్వం రావడం కోసం మీరంతా ప్రతి గ్రామంలోకి వెళ్లాలి. చంద్రబాబు చేయబోతున్న జిమ్మిక్కుల గురించి చెప్పాలి. చంద్రబాబు నాయుడు 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి రోజుకో అబద్ధం ఆడుతాడు.. రోజుకో మోసం చేస్తాడు. 20 రోజుల్లో చెప్పని అబద్ధం, చేయని మోసం ఉండదు. చూపని సినిమా కూడా ఉండదని మీఅందరికీ చెబుతున్నా.. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. చంద్రబాబు ఒక్కరితోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో, అమ్ముడుపోయిన అనేక టీవీ చానళ్లతో యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో కుట్రలు, మోసాలు, అబద్ధాలు ఉన్నాయి. చివరకు ఎన్నికల నాటికి వచ్చే సరికి చంద్రబాబు ఏం చేస్తాడంటే.. ప్రతి గ్రామానికి మూటల్లో డబ్బులు పంపించి రూ. 3 వేలు ప్రతి చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. మీరంతా అప్రమత్తంగా ఉండండి. మీ గ్రామాలు, వార్డుల్లో ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అన్నను, ప్రతి అవ్వాతాతను కలవండి. ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టు అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను బడులకు పంపిస్తే చాలు సంవత్సరానికి అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మన పిల్లలను ఇవాళ ఇంజనీరింగ్, డాక్టర్‌ చదివించగలుగుతున్నామా.. ఒకసారి ఆలోచన చేయండి అక్క అని చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టు అక్క అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు. పెద్ద పెద్ద చదువులు చదివిస్తాడని చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క దగ్గరకు వెళ్లి చెప్పండి. ప్రతి చెల్లెమ్మ దగ్గరకు వెళ్లి చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. పొదుపు సంఘాల్లో ఉన్నాం.. రుణమాఫీ చేస్తానని మోసం చేశాడక్కా.. సున్నావడ్డీ అనే పథకం ఎగరగొట్టాడు. అక్కా మోసపోవద్దు.. అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మల రుణాలు మొత్తం నాలుగు దఫాల్లో చేతుల్లో పెడతాడని చెప్పండి. అన్న మన చేతుల్లో డబ్బులు పెట్టడమే కాదు.. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాడక్కా.. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే అది జగనన్నతోనే సాధ్యమని ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 

పేదరికంలో ఉండి అవస్థలు పడుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. 45 నుంచి 65 సంవత్సరాల వయస్సులో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి అక్కకు వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొస్తాడు. ప్రతి అక్కకు అన్న రూ. 75 వేలు ఇస్తాడు నాలుగు దఫాలుగా అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను అన్న లక్షాధికారులను చేస్తాడని చెప్పండి. 

ప్రతి రైతన్న దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అన్నా.. చంద్రబాబు నాయుడిని నమ్మాం. రుణమాఫీ చేస్తానని చెప్పి వడ్డీలకు కూడా సరిపోని విధంగా చేశాడు. రైతులకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి అన్నా.. సున్నావడ్డీ కూడా ఎగరగొట్టాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అన్నా.. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రైతన్న కోసం పెట్టుబడి ఖర్చుకు ఏటా రూ. 12,500 ఇస్తాడని చెప్పండి. అన్న గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తానన్నాడని చెప్పండి. 

ప్రతి అవ్వ దగ్గరకు వెళ్లండి. ప్రతి తాత దగ్గరకు వెళ్లండి. ఆ అవ్వాతాతలను అడగండి. ఇవాళ ఎన్నికలు వచ్చాయి.. మూడు నెలల కింద మీకు పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి... వెయ్యి మాత్రమే అని, రావడం లేదని చెబుతారు. అవ్వా ఒక్కసారి ఆలోచన చేయండి.. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తాను అని చెప్పకపోయి ఉంటే చంద్రబాబు రూ. 2 వేలు ఎన్నికలు ముందు ఇచ్చేవాడా అని అడగండి. ఆ అవ్వకు చెప్పండి. ఆ తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు చేసే మోసాలను నమ్మొద్దు. 20 రోజులు ఓపిక పట్టు అవ్వా.. మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ముఖ్యమంత్రి అయిన తరువాత రూ. 3 వేలకు పెన్షన్‌ పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి ఇంటికి చేర్చండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడవచ్చని, ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం చూడవచ్చని నమ్ముతున్నా.. మీ అందరికీ నవరత్నాలను అమలు చేస్తానని హామీ ఇస్తున్నా.. చెడిపోయిన పాలన మారాలి. విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. ఈ చెడిపోయిన పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ.. మన పార్టీ తరుఫున మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రక్షణనిధి అన్నను నిలబెడుతున్నాం.. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు. మీ చల్లని దీవెనలు ఉంచి గెలిపించాలని కోరుతున్నా.. అదేరకంగా పొట్లూరి వరప్రసాద్‌ యువకుడు, ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న పీవీపీని గెలిపించాలని కోరుతున్నా.. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ మర్చిపోవద్దని కోరుతున్నా.. 

 

Back to Top