డేటా చోరీకి పాల్పడటం సైబర్‌ క్రైమ్‌ కాదా?

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

డేటా చోరీపై గవర్నర్‌కు ఫిర్యాదు

డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలి

 హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్‌ క్రైమ్‌ కాదా?. అని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి వైఎస్‌ జగన్‌ బుధవారం సాయంత్రం 4.45 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని వైయ‌స్ జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దేశ చరిత్రలో ఇంత పెద్ద సైబర్‌ క్రైమ్‌ జరగలేదేమో అని, ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్‌ క్రైమ్‌ కాదా?. గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన పనిని వివరంగా ఇచ్చాం. దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సైబర్‌ క్రైమ్‌ జరగలేదు. ఒక పద్ధతి, పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు రెండేళ్ల నుంచే ప్రజల డేటాను చోరీ చేస్తున్నారు. ఆయన రెండేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియను మేనేజ్‌ చేస్తున్నారు.  ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదు. చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలి. 

సేవా మిత్ర టీడీపీకి సంబంధించిన యాప్‌. ఆ యాప్‌ను తయారు చేసింది ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ. ఆధార్‌ వివరాలు ప్రైవేట్‌ కంపెనీల వద్ద ఉండకూడదు. సేవా మిత్ర యాప్‌లో ఆధార్‌లో వివరాలు దొరకడం క్రైమ్‌ కాదా?. కలర్‌ ఫోటోతో ఉన్న ఓటర్ల జాబితా ఎలా బయటకు వచ్చింది. ఆ జాబితా ఐటీ గ్రిడ్స్‌ కంప్యూటర్లలో ఎలా కనబడతోంది. ఏపీ ప్రజల బ్యాంక్ ఖాతా వివరాలు సేవా మిత్ర యాప్‌లో ఎలా ఉన్నాయి. వ్యక‍్తిగత వివరాలు ప్రయివేట్‌ సంస్థల వద్ద ఉండనే ఉండకూడదు. ప్రభుత్వమే ఇంటింటికి పంపి సర్వేలు చేయించి ఆ డేటాను కూడా సేవా మిత్రలో పొందుపరిచారు.

రెండేళ్ల నుంచి పథకం ప్రకారం ఓట్లను తొలగిస్తున్నారు. టీడీపీకి ఓటు వేయరనే అనుమానం ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, అనుకూలంగా ఉన్నవారి డూప్లికేట్‌ ఓట్లను నమోదు చేస్తున్నారు. మేం ఎన్నికల కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుకు ఎందుకు భయం. రాబోయే రోజుల్లో సీఈసీని కూడా కలుస్తాం. ఒక ప్రయివేట్‌ కంపెనీలో డేటా దొరకడం సబబేనా?. ఇది నేరం కాదా?. ఓటర్ల డేటా, కలర్‌ ఫోటోలతో మాస‍్టర్‌ కాపీ ఎలా ఐటీ గ్రిడ్స్‌ కంప్యూటర్స్‌లో కనబడుతుంది. కేంద్ర, సీఈసీ, హోంశాఖ పరిధఙలోని డేటా ఎలా వచ్చింది. బ్యాంక్‌ ఖాతా వివరాలు ఎలా వచ‍్చాయి. వ‍్యక్తుల ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు, కలర్‌ ఫోటోలతో ఓటర్ల వివరాలు మీ దగ్గర ఉన్నాయి. దీనితో మీరు ఏమి చేసినా ప్రజలు నాశం అవ్వరా?.

ఇలాంటి సైబర్ క్రైం రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా జరిగి ఉండదేమో. ఐటి గ్రిడ్స్‌ అనే కంపెనిపై దాడులు జరిగినపుడు అనేక వివరాలు బయటకు వచ్చాయి. టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్. ఇది ఎవరు తయారు చేశారు అంటే ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్ధ. ఈ యాప్ వద్ద ఉండకూడని డేటా ఉంది. ప్రైవేటు వ్యక్తులు సంస్థల వద్ద ఉండకూడని సమాచారం ఏ రకంగా కనబడతున్నాయి. ఆధార్ వివరాలు ప్రైవేటు కంపెని కంప్యూటర్లలో దొరకడం సబబేనా?. ఇది క్రైమ్ కాదా?. ఆధార్ వివరాలు కాకుండా ఓటర్ ఐడీ, డేటా విత్ కలర్ ఫోటోస్...మాస్టర్ కాపీ అనేది ఎవరికి అందుబాటులో ఉండదు. ఏ రకంగా అది ఐటి గ్రిడ్స్‌ కంపెనీలో కనబడుతోంది. టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఏ రకంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్‌ ఖాతా వివరాలు కూడా వారి వద్ద లభించాయి. ఇవి ఏరకంగా ప్రత్యక్షం అవుతున్నాయి. సేవామిత్రాలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్‌ ఖాతా వివరాలు ఎలా వచ్చాయి. అంటే దీని అర్థం ఏమిటి?. 

గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి సర్వేలు చేయించారు. అవన్నీ కూడా సేవా మిత్రలో అనుసంధానం చేశారు. ఈ డేటాను టీడీపీ నేతలకు  పంపారు. ఆ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారు. ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారు. ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను ఓ పద్దతి ప్రకారం డిలీట్ చేయడం మొదలు పెట్టారు.  వారికి ఓటేస్తారని తెలిసినవారి ఓట్లు రెండుగా నమోదు చేయించారు. ఇదంతా పథకం ప్రకారం చేస్తా ఉన్నారు. ఇలా జరుగుతుందని 2018 సెప్టెంబర్‌లో ఎన్నికల కమిషన్‌కు  ఫిర్యాదు చేశాం. ఎందుకంటే గతంలో మేం కేవలం 1 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. మా స్టడీలో 59 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు కనిపించాయి.

 జనవరిలో ఎన్నికల కమిషన్‌ను కలసి 24 పెన్ డ్రైవ్‌లు ఇచ్చి 54 లక్షల ఓట్లకు సంబంధించి సమాచారం ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుందని ఫిర్యాదు చేసి వచ్చాం. దానిలో భాగంగా ఫారం-7 పూర్తి చేసి ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించమని విచారణ చేసి ఆ నిర్ణయం తీసుకోమన్నాం. మేం ఈ కార్యక్రమం చేస్తుంటే ఏపీ పోలీసులను పంపించి ఫారం-7 పెట్టిన వారిపై వేధింపులు ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. ఫారం 7 పూర్తి చేసి,1950 అనే నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే మీరు ఓటర్ అవునా కాదా అనే విషయం తెలుస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది ప్రతి పౌరుడి భాధ్యత. చంద్రబాబు నాయుడు దీనిపై విచారణ జరపకుండానే ఎల్లో మీడియాను ఉపయోగించి  చేయాల్సిందంతా చేస్తున్నారు. 

గత రెండేళ్లుగా చంద్రబాబు చేస్తున్న అక్రమాలను బయటపెట్టాల్సిన వారు ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రైవేటు సంస్దల వద్ద ఆధార్, కలర్ ఓటర్ జాబితాలు, బ్యాంక్ అకౌంట్‌లు ఉండటం నేరం. ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఏమాత్రం తప్పు చేస్తున్నామనే భావన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఓటర్లను తొలగించడం, అక్రమంగా నకిలీ ఓట్లు నమోదు చేయించడం నేరాలు. ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం దారుణం. ఈ విషయాలు అన్నీ గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లాం.

చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరూ కూడా చేసింది జైలుకు వెళ్లాల్సిన నేరాలు. ఆ టాపిక్‌ను డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఫారం 7 దరఖాస్తు చేయడం తప్పన్నట్లుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. ఐటి గ్రిడ్స్‌ చేయకూడని పనులు హైదరాబాద్‌లో చేస్తుంటే ఇక్కడే కేసు పెడతారు కదా. ఇదేదో ఆంధ్రాకు, తెలంగాణా రాష్ట్రాల మధ్య గొడవన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. తప్పుదోవ పట్టిస్తూ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అన్యాయం అండి. 59 లక్షల ఓట్లకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్‌కు అందించాం. వెరిపై చేసి దానిలో తప్పుంటే తీసేయండి అని కోరాం. ఫారం 7 అనేది రిక్వెస్ట్‌ ఫర్ ఎంక్వయిరీ. అలా చేయడం తప్పు కాదు, నేరం కాదు.’ అని అన్నారు.

వైఎస్‌ జగన్‌తో పాటు గవర్నర్‌ను కలిసినవారిలో వైఎస్సార్‌ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కొలుసు పార్థసారధి, రాజన్న దొర, ఆదిమూలపు సురేష్‌, కొడాలి నాని తదితరులు ఉన్నారు. 

Back to Top