దోషులకు కఠిన శిక్ష తప్పదు

చిన్నారుల మీద జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం

మహిళా కమిషన్‌ సభ్యురాలు  జయశ్రీ 

విశాఖ‌: విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం కడపాలెంలో చిన్నారుల మీద జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని మహిళా కమిషన్‌ సభ్యురాలు జయశ్రీ అన్నారు. బాధిత చిన్నారుల్ని ఆమె ఈ రోజు కేజీహెచ్‌లో కలిసి సంఘటన వివరాలు తెలుసుకున్నారు.  ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌గారు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించిన విషయాన్ని జయశ్రీ ప్రస్తావించారు. బాధిత బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్‌ అండగా ఉంటుందని;  ఇప్పటికే ఈ ఘోర సంఘటనమీద హోం మంత్రిగారు, మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ స్పందించటం జరిగిందని, దోషులకు కఠిన శిక్ష తప్పదని ఆమె అన్నారు. 

బాలికలమీద ఘోరానికి పాల్పడిన తండ్రీ కొడుకుల్ని ఇప్పటికే అరెస్టు చేయటం జరిగిందని, త్వరలోనే వారికి శిక్షలు పడతాయని నమ్ముతున్నామని జయశ్రీ అన్నారు. బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని, వారు కోలుకునేలా అందరూ సహకరించాలని, ఇలాంటి దుర్మార్గాలకు సంబంధించి రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేయవద్దని ఆమె అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ విషయంలోగానీ, లా అండ్‌ ఆర్డర్‌ గానీ చాలా గట్టిగా వ్యవహరిస్తోందని, జగన్‌గారి ప్రభుత్వం ఇంతవరకు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సాధికారితలో ముందడుగులు వేస్తోందనటానికి ఏకంగా 51 లక్షల మహిళలు ఇప్పటికే దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటం ఒక ఉదాహరణ అని ఆమె అన్నారు.  దిశ యాప్‌ ద్వారా మన రాష్ట్ర మహిళ ఢిల్లీలో రక్షణ పొందిన విషయాన్ని పత్రికల్లో అంతా చూశారని... ప్రతి ఒక్క బాలిక, ప్రతి ఒక్క మహిళ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్న ముఖ్యమంత్రిగారి పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని ఆమె అన్నారు. జయశ్రీతో పాటు, మహిళా శిశు సంక్షేమ అధికారులు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ మహిళా నేతలు బాధిత బాలికల పరామర్శ సందర్భంగా పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top