పండుగలా ‘వైయ‌స్ఆర్‌ ఆసరా’ వారోత్సవాలు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఫొటోలకు మహిళలు పాలాభిషేకాలు

4 రోజులుగా 350 మండలాల్లో 3.94 లక్షల సంఘాలకు రూ. 3,249.19 కోట్లు పంపిణీ

లబ్ధిదారులతో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ముఖాముఖి

ముఖ్యమంత్రికి పొదుపు సంఘాల మహిళలు కృతజ్ఞతలు 

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్ ఆసరా వారోత్సవాలు పండుగ వాతావరణంలో కొన‌సాగుతున్నాయి. మహిళలు ఊరూరా సభలు పెట్టి సీఎం వైయ‌స్‌ జగన్‌ ఫొటోలకు పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళల పేరుతో ఉన్న బ్యాంకు అప్పును ప్రభుత్వమే భరిస్తూ, ఆ మొత్తాన్ని వైయ‌స్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. రెండో విడతకు సంబంధించి ఈ నెల ఏడో తేదీ నుంచి పది రోజులపాటు సంబంధిత సంఘాల ఖాతాలకు ప్రభుత్వం డబ్బులు జమచేస్తుంది. 

78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు అందజేయడానికి సర్కారు ఏర్పాట్లుచేయగా.. బద్వేలు ఉప ఎన్నికల కారణంగా వైయ‌స్ఆర్ జిల్లాలో పంపిణీ వాయిదా పడింది. మిగిలిన 12 జిల్లాల పరిధిలో 7.55 లక్షల సంఘాలకు సంబంధించి 74.81 లక్షల మంది మహిళలకు రూ.6,099 కోట్లు అందిస్తున్నారు. ఇది ఈ నెల 18 వరకు కొనసాగుతుంది. గత నాలుగు రోజులుగా 12 జిల్లాల పరిధిలోని పొదుపు మహిళలకు రూ.3,249.19 కోట్లు పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. 

ప్రజాప్రతినిధులతో మహిళల ముఖాముఖి
ఇక పంపిణీ పూర్తయిన మండలాల్లో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మన్, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో లబ్ధిదారుల ముఖాముఖీ జరిగాయి. 7న 63 మండలాల్లో, 8న 83 మండలాలు, 9న 77 మండలాలు, 10న 63 మండలాల్లో.. 11న 64 మండలాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆయన మోసం చేసిన తీరు.. ఇప్పుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న వైనంపై ఈ ముఖాముఖిలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top