అమరావతి: రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే..(వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమంలో ఇప్పటి దాకా ‘మేము సైతం..’ అంటూ 4,23,821 కుటుంబాలు భాగస్వామ్యమయ్యాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మధ్యలో దీపావళి కారణంగా మూడు రోజులు విరామం ఏర్పడింది. 9న 664 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో, 10న మరో 689 సచివాలయాల పరిధిలో, 14న 647 సచివాలయాల పరిధిలో, 15న మరో 504 సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గృహసారథులు, వైయస్ఆర్‌సీపీ అభిమానులు, వలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో కార్యక్రమం ప్రారంభమైన రోజునే.. ఏ సచివాలయం పరిధిలో ఎంత మందికి ఏయే పథకాల ద్వారా లబ్ధి కలిగిందన్న వివరాలతో కూడిన సంక్షేమ, అభివృద్ధి బోర్డులను స్థానిక ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. బుధవారం వరకు ఇలా 2,504 సచివాలయాల వద్ద సంక్షేమ, అభివృద్ధి బోర్డులను ఆవిష్కరించారు. వీటి ఆవిష్కరణ జరిగిన తర్వాత రోజు నుంచే ఆయా సచివాలయాల పరిధిలో రోజుకు 15 ఇళ్ల చొప్పున కలుస్తున్నారు. ఇప్పటి వరకు (మధ్యలో 3 రోజులు సెలవులు పోను) 16,169 మంది 4,23,821 కుటుంబాల వద్దకు వెళ్లి.. ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి కలిగిన ప్రయోజనం, ఆ ఊరు మొత్తానికి కలిగిన ప్రయోజనాన్ని వివరించి చెప్పారు.