విజయవాడ: దేశంలోనే మొదటిసారిగా హోం క్వారంటైన్ యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో పర్యవేక్షించినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. 22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజులపాటు నిఘా ఏర్పాటు చేశామని, జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. 28 రోజుల హోం క్వారంటెన్ పూర్తి కావడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలను తొలగిస్తున్నట్లు చెప్పారు. యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టామన్నారు. డీజీపీ శుక్రవారం విజయవాడలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాల వారిపై నిఘా కోసం సాంకేతికత పరిజ్ఞానంతో మరో మొబైలు యాప్ సిద్ధం చేస్తున్నామని డీజీపీ వివరించారు.
రుణపడి ఉంటాం:
కరోనా కట్టడికి సహకరించిన వారికి సర్వదా రుణపడి ఉంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు పోలీస్ శాఖకు సహకరించడం వారి దేశ భక్తికి నిదర్శనని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక బృందాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిపై నిఘా కోసం అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినట్లు డీజీపీ వెల్లడించారు.