దారులన్నీ విజయవాడ వైపే

 వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి వేలాదిగా తరలివచ్చిన జనం

కిక్కిరిసిపోయిన బెజవాడ

విజయవాడ : మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జననేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వైయస్ఆర్ అభిమానులు, వైయస్ఆర్ సీపీ శ్రేణులు విజయవాడకు క్యూకట్టారు.  ఇప్పటికే వేలాది మంది వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వీలైనంత త్వరగా వెళ్లాలని అభిమానులు భావించడంతో ఉదయం నుంచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కిటకిటలాడుతోంది. స్టేడియం మొత్తం వైయస్ జగన్‌ నినాదాలతో మారుమోగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమకు కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకుంటున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావులతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. 

మరోవైపు తమ అభిమాన నాయకుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడటానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయవాడ రాలేని వారు టీవీల్లో ఈ వేడుకను చూసేందుకు సిద్దమవుతున్నారు. ఉదయం నుంచే సామాన్య ప్రజలు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు భారీగా చేరుకోవడంతో 8 గంటల వరకే గ్యాలరీలు నిండిపోయాయి. గ్యాలరీల్లో ఉన్నవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం బయట కూడా ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.

 

తాజా ఫోటోలు

Back to Top