రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు, లోకేష్‌ తప్పుడు ప్రచారం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

చంద్ర‌బాబు, టీడీపీ అడాన్ కంపెనీపై దుష్ప్ర‌చారం 

మా కుటుంబానికి అడాన్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయ‌ని త‌ప్పుడు ప్ర‌చారం

చంద్ర‌బాబు నాకు బంధువు..అలా అయితే ఆయ‌న‌ ఆస్తులన్నీ నావే అవుతాయా?

తాడేపల్లి: రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ త‌న‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆధారాల‌తో క‌ట్ట‌క‌ట్టి మీ దుష్ప్ర‌చారాన్ని ప‌దింత‌లు చేసే సామ‌ర్ధ్యం త‌న‌కు ఉంద‌న్నారు. ఇంత‌వ‌ర‌కు నారా, నంద‌మూరి కుటుంబాల గురించి వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌లేద‌న్నారు. చంద్ర‌బాబు, లోకేష్ ప‌రిధి దాటొద్ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. అస‌భ్య‌ప‌ద‌జాలం వాడాలంటే మీ కంటే ప‌దింత‌లు ఉప‌యోగించాల్సి వ‌స్తుంది. వైయ‌స్ఆర్‌సీపీ చాలా ప‌ద్ధ‌తిగా, సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఉంటుంది. మా పార్టీపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్దు. ఎదుటివారిపై బుర‌ద జ‌ల్లి ఆనందించ‌డంలో చంద్ర‌బాబును మించిన వారు లేరన్నారు. విజయసాయిరెడ్డి శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. 

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అడాన్ పై బాబు దుష్ప్రచారం
            చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులంతా అడాన్‌ కంపెనీపై దుష్ప్రచారం చేస్తున్నారు. అడాన్‌ కంపెనీ మా కుటుంబానికి సంబంధించిందని, దానిలో షేర్లు ఉన్నాయంటూ పనికిమాలిన ప్రచారాన్ని కొద్దిరోజులుగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటంటే... చెప్పిన అబద్దాన్ని వందసార్లు చెబితే అదే నిజం అవుతుందనే సిద్ధాంతాన్ని నమ్మి, ఈరకంగా మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.

- అడాన్‌ కంపెనీలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నాడని, అతడు సంవత్సర కాలం కింద కాకినాడ ఎస్‌ఈజెడ్‌ కంపెనీలో కూడా డైరెక్టర్‌గా ఉన్నాడని, శ్రీనివాస్‌ కామన్‌ డైరెక్టర్‌ కాబట్టి షేర్‌ హోల్డ్‌తో నిమిత్తం లేకుండా విజయసాయి రెడ్డి అల్లుడు కంపెనీకి చెందినవాడు. ఇవన్నీ విజయసాయిరెడ్డి కంపెనీలే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ  దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకుని కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ప్రవర్తిస్తుందో.. అలా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్‌ నాయుడు, ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని అడాన్‌ కంపెనీతో సంబంధాలు ఉన్నాయంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. 

-అడాన్‌ అంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆ రికార్డులు తెప్పించుకుని చూశాను. టీడీపీలో ప్రతిరోజు పైనుంచి కింద వరకూ అడాన్‌ గురించి మాట్లాడుతున్నారు. సుమారు 50 కంపెనీలు ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కు మద్యం సప్లయ్‌ చేస్తున్నాయి. మొత్తం సప్లయ్‌లో వీరు మూడు శాతం సప్లయ్‌ చేస్తున్నారు. దానిలో శ్రీనివాస్‌తో పాటు మరొకరు డైరెక్టర్‌గా ఉన్నాడు. వాళ్లెవరకూ కూడా మాకు తెలియదు. అయినా మా కుటుంబానికి ముడిపెడుతున్నారు.

- వీటికి సంబంధించి ఆధారాలు అన్నీ రిజిస్టార్‌ ఆఫ్ కంపెనీల నుంచి తీసుకోవడం జరిగింది.  శ్రీనివాస్‌ అనే వ్యక్తికి అడాన్‌ కంపెనీలో 50శాతం షేర్‌తో పెట్టుబడి పెట్టాడు. అతను ఎవరో మాకు సంబంధం లేదు. 

- ఈ విషయాలన్నింటి మీద ఒక స్పష్టత ఇవ్వాలనే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ‘నేను ఒక లాజిక్‌ చెబుతాను. సపోజ్‌ ఆ లాజిక్‌ మీరు కరెక్ట్‌ అనుకుంటే దాని ప్రకారం నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి, ఆ తర్వాతే మీరు మాపై అసత్యాలు ప్రచారం చేయాల్సిందిగా చంద్రబాబుకు విజ‍్ఞప్తి చేస్తున్నా...’. 

ఇదీ బాబు గారి కుటుంబ కంపెనీల జాతకం...
        
     రిజస్టర్ ఆఫ్ కంపెనీస్ వెబ్ సైట్ నుంచి ఈరోజు మొత్తం లిస్ట్‌ తీస్తే.. నారా ఫ్యామిలీకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి?, ఎన్ని కంపెనీలకు వారు డైరెక్టర్లుగా ఉన్నారు? వారికి ఎన్ని బినామీ కంపెనీలు ఉన్నాయి? ఎన్ని వీళ్ల పేరుతో ఉన్నాయనే దానిపై ఒక జాబితాను తయారు చేయడం జరిగింది. ఆ వివరాలన్నింటినీ మీడియాకు అందించాం. ఒక కంపెనీలో ఉన్న డైరెక్టర్‌.. వేరే వేరే కంపెనీల్లో కూడా డైరెక్టర్‌గా ఉండవచ్చు. వేరే కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నంతమాత్రాన,  ఆ డైరెక్టర్లు ఒకటైనంత మాత్రాన, ఆ కంపెనీలన్నీ ఒకరివే అనటానికి వీల్లేదు. అక్కడా, ఇక్కడా డైరెక్టర్లుగా ఉన్నంతమాత్రాన అన్ని కంపెనీలకు ముడిపెట్టలేం. 

చంద్రబాబు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు..?
    1-  విహాన్‌ ఆటో వెంచర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో వడ్లమూడి నాగరాజు డైరెక్టర్‌. ఇతడు చంద్రబాబు నాయుడుకు బినామీ అని అందరికీ తెలుసు. చంద్రబాబు చాలా ఆస్తులు నాగరాజు పేరు మీద ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు హయాంలో విహాన్‌ ఆటో వెంచర్స్‌కు హైదరాబాద్‌లో కియా మోటార్స్‌లో సర్వీస్‌ సెంటర్‌ ఇప్పించాడు. కియా మోటర్స్‌కు డీలర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదే నాగరాజు హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్, హెరిటేజ్‌ ఆగ్రో మెరైన్‌ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్‌ ఇంటర్నేషనల్‌లలో డైరెక్టర్‌గా కూడా ఉన్నాడు. హెరిటేజ్‌ గ్రూప్స్‌ కంపెనీల్లో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి... ఇద్దరూ కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వడ్లమూడి నాగరాజు కామన్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు.  

- శ్రీనివాస్‌కు ఏ లాజిక్‌ అయితే అప్లయ్‌ అవుతుందో అదే లాజిక్‌ చంద్రబాబు కుటుంబానికి వర్తించదా? దీనిపై చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి.  చంద్రబాబు చెప్పే లాజిక్‌ ప్రకారం విహాన్‌ కంపెనీ కూడా బ్రాహ్మణిదేనా..? 

    2-  కార్పొరేట్‌ రంగంలో చంద్రబాబుకు ఉన్న చరిత్ర మరెవ్వరికీ లేదు. వేలకోట్ల రూపాయిలు బ్యాంకులకు ఎగ్గొట్టి సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న కార్వీ  ప్రమోటర్స్‌ ఎవరు? వీళ్ళెవరో చంద్రబాబుకు, లోకేష్‌ నాయుడుకు బాగా తెలుసు. వాళ్లు చంద్రబాబు పార్టనర్స్‌ కాదా?.   కార్వీ ప్రమోటర్స్‌ తో కలిసి నారా ఫ్యామిలీ మెగా బిడ్ ఫైనాన్స్‌ సంస్థను ఏర్పాటు చేయలేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా.

    3- మీ కంపెనీలో డైరెక్టరుగా ఉన్న విష్ణు సిమెంట్స్‌కు చెందిన నంద్యాల విష్ణురాజు చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. బాబు దావోస్‌ పర్యటనలకు వెళితే ఆయన వెంటే విష్ణురాజు కూడా ఉంటాడు.  హెరిటేజ్‌ ఫుడ్స్‌లో కూడా విష్ణురాజు డైరెక్టర్‌. ఆయన అమర్‌రాజా బ్యాటరీస్‌లో కూడా డైరెక్టరే. 

    4- హెరిటేజ్ లో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న నంద్యాల శ్రీ విష్ణురాజు అమర్‌రాజా బ్యాటరీస్‌ లో కూడా డైరెక్టర్ గా ఉన్నారు. మరి అమర్ రాజా కూడా చంద్రబాబు నాయుడు బినామీదే అని నేను అనవచ్చా? అమర్‌రాజా నారా  బ్రాహ్మణి సంస్థ అని అంటే ఆయన ఏమని సమాధానం ఇస్తాడు? బాబు నోరు మూయించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి  ఇవన్నీ మాట్లాడాల్సి వస్తోంది. 

    5- లివ్‌ లైఫ్స్‌ హాస్పటల్‌లో రత్నా దుక్కిపాటి డైరెక్టర్‌ వ్యవహరిస్తున్నారు.  ఆమె ఎక్స్‌ఎల్‌ మార్కెటింగ్‌ కన్సల్టింగ్‌ కంపెనీకి కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే గతంలో ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన సాంబశివరావు హెరిటేజ్‌ ఫుడ్స్‌లో కీలకంగా వ్యవహరించేవారు. ఆయన ఎక్స్‌ఎల్‌ మార్కెటింగ్‌ కన్సల్టింగ్‌ కంపెనీకి కూడా డైరెక్టర్‌. సాంబశివరావు హెరిటేజ్‌ ఫుడ్స్‌, హెరిటేజ్‌ న్యూట్రివిట్‌, హెరిటేజ్‌ కాంప్రోలో డైరెక్టర్‌గా ఉన్నారు. కామన్‌ డైరెక్టర్‌గా దుక్కిపాటి రత్న, సాంబశివరావు ఉన్నారు కాబట్టి.. లివ్‌ లైఫ్స్‌ హాస్పటల్స్‌ కూడా నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, బ్రాహ్మాణి, నారా లోకేష్‌లవే అని, అలాగే ఎక్స్‌ఎల్‌ మార్కెటింగ్‌  కన్సల్టింగ్‌ కంపెనీ కూడా నారా కుటుంబానికే చెందినవని మేము అనవచ్చా? 

    6- మీ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న ముత్తురాజు పరవసరాజు  విజయ్‌కుమార్‌కు సత్యం కంపెనీతో సంబంధం లేదా? ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన సత్యం కంపెనీలతో సంబంధం ఉన్న విజయ్ కుమార్ మీ కంపెనీల్లో ఎందుకు డైరెక్టర్ గా ఉన్నాడు..? ఆయన ఈరోజుకీ సిఫీ టెక్నాలజీలో డైరెక్టరే కదా? సిఫీ టెక్నాలజీస్ కు - సత్యం కంపెనీకి సంబంధం లేదు అని నారా లోకేష్‌ చెప్పగలడా?

    7-అలాగే హెరిటేజ్‌ కంపెనీలో ఎవరెవరు డైరెక్టర్లుగా ఉన్నారో.. లివ్‌ లైఫ్‌ హాస్పటల్స్‌లో వారే డైరెక్టర్స్‌గా ఉన్నారు. మెగా బిడ్ ఫైనాన్స్‌ కంపెనీకి సంబంధించిన వివరాలు చూస్తే... హెరిటేజ్‌ ఫుడ్స్‌లో ఎవరెవరు డైరెక్టర్లుగా ఉన్నారో... వాళ్ళంతా ఉన్నారు.  ఆ తర్వాత, చంద్రబాబు భాగస్వామి మేకా యుగంధర్‌, తదితరులంతా రాజీనామా చేయటం, ఇప్పుడు మీ  కుటుంబం అంతా అందులో  డైరెక్టర్లుగా ఉండి ఆ సంస్థను నారా కుటుంబ సంస్థగా మార్చింది వాస్తవం కాదా? మీరు చేసింది మోసం కాదా?. 

బ్రాహ్మణి, భువనేశ్వరిలు డైరెక్టర్లుగా ఉన్న అన్ని కంపెనీల అడ్రస్ ఒక్కటే
    ఇక నారా బ్రాహ్మణి దాదాపుగా 16 కంపెనీలకు కామన్‌ డైరెక్టర్‌. నారా భువనేశ్వరి 17,18 కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. 

- 16 కంపెనీల నుంచి 18 కంపెనీలకు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి డైరెక్టర్స్‌గా ఉంటే వాటన్నింటికి రిజిస్టర్‌ ఆఫీసు అడ్రస్‌ ఒక్కటే. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కాలనీలోని కార్యాలయం నుంచే ఆ కంపెనీలన్నీ ఆపరేట్‌ చేస్తున్నారు. బోగస్‌ కంపెనీలు, జన్యూన్‌ కంపెనీలు, కామన్‌ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలన్నీ ఒకే అడ్రస్‌లో ఉన్న కార్యాలయం నుంచే పని చేస్తున్నాయి. కామన్‌ డైరెక్టర్‌గా ఉంటే ఆ కంపెనీ మనది అయిపోతుందా? అనే దానిపై పాత్రికేయ మిత్రులే ఆలోచించాలి.

- క్రూయిజ్‌ కంపెనీ నా కూతురికి సంబంధించిందంటూ విమర్శలు చేస్తున్నారు. ఆ కంపెనీ ఎవరిదో, ఏమిటో మా వియ్యంకుడి కుటుంబానికిగానీ, నాకుగానీ తెలియదు. కానీ చంద్రబాబు నాయుడికి మాత్రమే ఆ క్రూయిజ్‌ కంపెనీ మాదని తెలిసింది. పత్రికా ముఖంగా చెబుతున్నాను.  ఒకవేళ క్రూయిజ్‌ కంపెనీ మాదైతే బాబుకు ఫ్రీగా రాసిచ్చేస్తా, తీసుకోమని కోరుతున్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఎంత అబద్ధాలకోరు అనేది ప్రజలందరూ గమనించాలి.

- వీటన్నింటికి చంద్రబాబు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా.  ఇలా చెప్పుకుంటే చాలా చాలా ఉన్నాయి.

పరిధులు దాటొద్దు అంటూ వార్నింగ్..
        చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్‌ నాయుడు.. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.  మీరు ఏరకంగా అయితే దుష్ప్రచారం చేస్తున్నారో దానికి పదింతలు ఆధారాలతో సహా కట్టగట్టి దుష్ప్రచారం చేయగల సామర్థ్యం నాకు ఉంది. ఇప్పటివరకూ నేను నారా భువనేశ్వరి, బ్రాహ్మణిల గురించి మాట్లాడలేదు. వ్యాపారం చేసుకునేవారి గురించి నేను మాట్లాడలేదు. కేవలం రాజకీయ వేత్తల గురించి మాత్రమే మాట్లాడాను. 

- ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, లోకేష్‌ తమ పరిధిలు దాటవద్దని వార్నింగ్‌ ఇస్తున్నా. మీరు పరిధులు దాటి దుష్ప్రచారం చేస్తే... దానికన్నా నేను పదింతలు చేయాల్సి వస్తుంది. మీరు సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పదజాలం వాడిస్తున్నారు. నేను దానికి పదింతలు ఎక్కువగా అసభ్యపదజాలం వాడి మీ నోర్లు మూయించాల్సిన అవసరం వచ్చింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విలువలు ఉన్న పార్టీ. మీరు పరిధులు దాటి మా నాయకుడిని కానీ, మమ్మల్ని కానీ విమర్శించడం మానేస్తే మేము విమర్శలు మానేస్తామని స్పష్టం చేస్తున్నాం.

- మా పార్టీ మీద బురద చల్లాలనే ఆలోచన మానేస్తే టీడీపీకి మంచిది. ఆకాశం మీద ఉమ్ము వేస్తే అది మీ మీదే పడుతుందనేది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. ఎదుటివారి మీద బురద చల్లి ఆనందించడం అనేవి చంద్రబాబుకు ఉన్న కోతి చేష్టలు. ఇటువంటి వాటిల్లో చంద్రబాబుకు మించిన వ్యక్తి ఎవరూ ఉండరు.

అలా అయితే బాబు కూడా నాకు బంధువే.. హెరిటేజ్ కూడా నాదేనా..?
        బంధువులు అయితే చాలు.. అవన్నీ ఒకరి కంపెనీలే అని ఆరోపణలు చేస్తున్నారు. అలా అయితే హెరిటేజ్‌ కంపెనీ కూడా నాదేనా..? ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాకు నిజంగానే బంధువు అవుతాడు. చంద్రబాబు వరుసకు నాకు అన్న అవుతాడు. అది ఎలా అంటే.... ఎన్టీఆర్‌ గారి మనవడు తారకరత్న నా భార్య సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అంటే చంద్రబాబు నాకు అన్నే కదా?.  అలా బంధువు అయినంత మాత్రాన నా ఆస్తులు ఆయనవి, చంద్రబాబు ఆస్తులు నావి అయిపోతాయా? హెరిటేజ్‌, అరబిందో ఒకటైపోతుందా?  తర్కం లేకుండా చంద్రబాబు ఏదో ఒకరకంగా మాపైన బురద చల్లాలి, విమర్శలు చేయాలనే దుగ్ద ఎక్కువైంది. ఆయనకు తెలివి అనేది ఏ కోశానా లేదు. 

- దివీస్‌ ల్యాబ్స్‌ కిరణ్‌ నాకు సన్నిహితుడు. అదే దివీస్‌ ల్యాబ్‌ కిరణ్‌ సోదరి నారా బ్రాహ్మణికి చాలా దగ్గర. వారు రోజు కలుసుకుంటారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు కూడా దగ్గరవాళ్లే. అంతమాత్రాన దివీస్‌ ల్యాబ్‌ నాది అయిపోతుందా? లేకుంటే దివీస్‌ ల్యాబ్‌ కిరణ్‌ది కాదు నారా ఫ్యామిలీది అని చెప్పుకోవచ్చా? వ్యక్తిగత సంబంధాలను బట్టి ఒక కంపెనీలో ఉన్న వ్యక్తి , వేరే కంపెనీలో డైరెక్టర్‌ అయినంత మాత్రాన దానికి ఇలాంటి ఆరోపణలు చేయడం అసంబద్ధమని చంద్రబాబుకు చాలా స్పష్టంగా చెబుతున్నాను.

 - మద్యంలో వాడకూడని పదార్థాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై..  శాంపిల్స్‌ తీసి, ల్యాబ్‌కు పంపించాం. ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా ఈ ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుంది. అదేవిధంగా హెరిటేజ్‌ పాలు‌... హ్యూమన్‌ కంజెంప్షన్ కు(మానవ వినియోగానికి) సరైంది కాదని తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు బ్యాన్‌ చేశాయి. ఆ పాలను కూడా పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపాం. వాటితోపాటు మద్యానికి సంబంధించిన టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించాం. చంద్రబాబు హయాంలోనే 20 డిస్టలరీలకు లైసెన్స్‌లు ఇచ్చాడు. 254 కొత్త బ్రాడ్స్‌కు అనుమతి ఇచ్చాడు. మద్యంలో ఆరితేరినవాడు చంద్రబాబే.  మేము కాదు.  ల్యాబ్‌ నివేదికలు వచ్చాక అందరికీ వెల్లడిస్తాం.

-మద్యం దుకాణాలను మళ్లీ ప్రయివేట్‌ వాళ్లకే అప్పగిస్తామంటూ చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు ఏమైనా కల వచ్చిందేమో.

- గ్రాఫ్ పడిపోయిందంటూ తప్పుడు సర్వేలు చేసిన వారి బండారం ఏమిటో.. ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్‌ను తయారు చేసింది రాబిన్‌ శర్మ. గతంలో ప్రశాంత్‌ కిషోర్‌ కంపెనీలో పనిచేసి, ఇప్పుడు చంద్రబాబు కోసం పనిచేస్తున్న వ్యక్తి.  చంద్రబాబు నాయుడు కోసం బోగస్‌ రిపోర్ట్‌ను తయారు చేసి, ఏదో ఒక కన్సల్టింగ్‌ పేరుతో ప్రజల్లోకి వదిలాడు. దానికి క్రెడిబులిటీ ఏముంటుంది. 

- వర్షాకాలంలో రహదారులు పాడవుతూనే ఉంటాయి. ఇప్పటికే రహదారుల మరమ్మత్తుల కోసం ముఖ్యమంత్రిగారు నిధులు కేటాయించడం జరిగింది. రోడ్ల విషయంలో నిర్లిప్తత, నిర్లక్ష్యం అనేది ఉండదు. మరమ్మతులు జరుగుతాయి. ఇది నిరంతర ప్రక్రియ. 

- అరబిందో ఫ్యామిలీకి ఏఏ కంపెనీలు ఉన్నాయో, నారా బ్రాహ్మణి, భువనేశ్వరిలకు ఏఏ కంపెనీలు ఉన్నాయో  రిజిస్టార్‌ ఆఫ్ కంపెనీస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఎవరైనా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన లిస్ట్‌ అంతా వస్తుంది. ఇదంతా ఓపెన్‌ డాక్యుమెంట్‌. దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలను కప్పిపెట్టి,  ప్రపంచంలో ఇటువంటి ఆరోపణలు చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబే. 

- నాకు అయితే ఏ వ్యాపారం లేదు. కేవలం రాజకీయం తప్ప. పార్లమెంట​ సభ్యుడిగా వేతనం వస్తుంది.

- ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై... మా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే,  మా నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మద్దతు ఇవ్వడం జరిగింది. దీనికి ఎన్డీయేకు లింక్‌ పెట్టడం సరికాదు. గతంలోనూ దళితుడు అయిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ఇచ్చాం.

Back to Top