చిన్న పరిశ్రమలకు రుణ సౌకర్యం మెరుగుపరచాలి

రాజ్యసభలో ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
 

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎమ్‌ఈ)కు రుణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచి, రుణాల చెల్లింపు కాలపరిమితిని 90 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలని, క్రెడిట్ లింక్డ్ కేపిటల్ సబ్సిడీ పథకం పునరుద్దరించాలని వైయ‌స్ఆర్‌సీపీ  సభ్యులు  విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతున్న ఈ తరుణంలోనే ఎంఎస్ఎంఈలకు రుణ సౌకర్యం పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఎంఎస్ఎంఈలు దేశ జీడీపీలో 27%, ఎగుమతుల్లో 45% వాటా కలిగి ఉండటంతోపాటు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామికీకరణ ఫలాలు వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాలకు అందించడంలో చిన్న పరిశ్రమలు కీలకపాత్ర పొషిస్తున్నాయని అన్నారు.
ఎంఎస్ఎంఈలు సమర్థవంతంగా నిర్వహించే విషయంలో రెండు అంశాలు అవరోధంగా మారాయని శ్రీ విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రుణాలు చెల్లింపునకు ప్రభుత్వం కేవలం 90 రోజుల కాలపరిమితి విధించడంతో ఎంఎస్ఎంఈలు ఆర్దికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. 90 రోజులు కాలపరిమితి సహేతుకంగా లేదని, ఎంఎస్ఎంఈల వర్కింగ్ కాపిటల్‌  సైకిల్ 90 రోజులకు మించి ఉండడంతో సకాలంలో రుణాలు తిరిగి చెల్లించలేని స్థితి ఉందని అన్నారు. కొనుగోలుదారుల నుంచి సకాలంలో చెల్లింపులు అందకపోవడం రుణాలు చెల్లింపులో జాప్యానికి ప్రధాన కారణం. దీంతో అనేక చిన్న పరిశ్రమలు డిఫాల్టర్ల జాబితాలో చేరుతున్నాయి. ఎంఎస్ఎంఈ రంగంలో  నిరర్ధక ఆస్తుల సంఖ్య  పెరిగిపోవడంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.
ఎంఎస్ఎంఈలు ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ఉపకరించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన క్రెడిట్ లింక్డ్ కేపిటల్ సబ్సిడీ పథకం నిలిపివేయడంతో సంస్థాగతమైన ఆర్థిక సహాయం పొందలేకపోతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. "ఎంఎస్ఎంఈ చాంపియన్స్" పేరుతో కొత్త పథకం అమలు చేస్తున్నప్పటికీ, అది ఎంఎస్ఎంఈ రంగంలో టెక్నాలజీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసింది కాదని ఆయన తెలిపారు.

Back to Top