విశాఖ‌లో క్యాట్ బెంచ్ ఏర్పాటు చేయాలి

న్యాయశాఖ మంత్రికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని నగరం అయిన విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్‌ను ఏర్పాటు చేయాల‌ని రాజ్యసభ జీరో అవర్‌లో మంగళవారం వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో తలెత్తే వివాదాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 323 (ఏ) కింద ప్రతి రాష్ట్రంలో  సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్స్‌ బెంచ్‌ ఏర్పాటు జరుగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో క్యాట్‌ ఏర్పాటు జరగలేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 50 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో 60 శాతం మంది విశాఖపట్నంలోనే పని చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో క్యాట్‌ బెంచ్‌ లేనందున పిటిషనర్లు తమ వివాదాల పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్‌కు ప్రయాణం చేయాల్సి వస్తోంది. వ్యయ ప్రయాసలతో కూడిన ప్రయాణాల వలన ఉద్యోగులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.   

విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌, షిప్‌ యార్డ్‌, కస్టమ్స్‌, పోర్టు, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, రైల్వేస్‌, ఎయిర్‌పోర్ట్‌, హెచ్‌పీసీఎల్‌, ఎల్‌ఐసీ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందువలన ఉద్యోగుల సౌలభ్యం కోసం చైర్మన్‌, సభ్యులతో కూడిన క్యాట్‌ బెంచ్‌ను విశాఖపట్నంలో నెలకొల్పవలసిందిగా విజయసాయి రెడ్డి న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top