విశాఖ- బెంగుళూరు రైలును ప్రారంభించండి 

 రాజ్యసభలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 
 

ఢిల్లీ : విశాఖ-బెంగుళూరు మధ్య డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును ప్రారంభించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో  రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌కు విజ్ఞప్తిచేశారు. రాజ్యసభలో మంగళవారం రైల్వేల పనితీరుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు రోజువారీ నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసు కావాలన్నది ఎంతోకాలంగా విశాఖపట్నం ప్రజల కోరిక అని ఆయన చెప్పారు.  విశాఖ నుంచి బెంగుళూరుకు ప్రయాణించే ఐటీ నిపుణులకు  ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. అలాగే గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించిన విశాఖపట్నం-వారణాసి-అలహాబాద్‌ రైలు సర్వీసును కూడా త్వరగా ప్రారంభించాలని ఆయన కోరారు.  
  
ఇటీవల రెఫ్రిజిరేటెడ్‌ కంటైనర్లు కలిగిన రైలు ద్వారా రాయలసీమలోని తాడిపత్రి నుంచి ముంబైలోని పోర్టుకు అరటి పండ్ల రవాణా కోసం ప్రత్యేకంగా నడిపిన రైలు విజయవంతం అయిందని పేర్కొన్నారు. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన రాయలసీమ ప్రాంతం నుంచి ముంబైకు ఈ తరహా ప్రత్యేక రైళ్ళను మరిన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే మంత్రిని కోరారు. 
 

Back to Top