పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం

మాచ‌ర్ల స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోత ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన  

ఈ ప్రాజెక్ట్‌ను దశలవారీగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం

రూ.2లక్షల 40వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి 

చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్దాలే 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదు 

కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా? 

రాష్ట్రంలోని గ్రామగ్రామాన సచివాలయ వాలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చాం

చంద్రబాబు మానవత్వంలేని మనిషి

చంద్రబాబు తన మాటలు ఎవరూ నమ్మరని.. మరో నలుగురిని వెంటబెట్టుకుని వస్తున్నారు 
 
చంద్రబాబులాగా పొత్తులు పెట్టుకోవడం మాకు తెలియదు 

నాకు ఎల్లో మీడియా సపోర్ట్‌ లేదు. కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను

మీకు మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం మాది 

అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నాం 

ప‌ల్నాడు: పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని తెలిపారు. పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు  శంకుస్థాపన చేశామ‌ని పేర్కొన్నారు.  ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామ‌ని తెలిపారు. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాల‌ని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నామ‌న్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళా సాధికారితకు కృషి చేశాం. రూ.2 లక్షల 40 వేల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. డీబీటీ నాన్‌డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించాం. కోవిడ్‌ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించామ‌ని సీఎం చెప్పారు.

మాచ‌ర్ల స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే.. 

మంచి కార్యక్రమానికి శ్రీకారం.
ఈరోజు ఇంతటి చిక్కటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, చిరునవ్వుల మధ్య దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం.
ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

దశాబ్దాల నీటి ఎద్దడికి నివారణ– వరికపూడిశెల.
ఈ మాచర్ల నియోజకవర్గంలో పక్కనే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఉన్నా కూడా సాగునీటికి, తాగునీటికి దశాబ్దాలుగా ఎద్దడి మన కళ్లెదుటనే కనిపిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఈరోజు పుట్టిన బిడ్డకు అందని తల్లిపాలమాదిరిగానే సముద్రంలో ప్రయాణిస్తున్నవారికి దక్కని గుక్కెడు మంచినీటి మాదిరిగానే ఇన్ని దశాబ్దాలు పాటు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా నది నీరు దక్కని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది.

దశాబ్ధాలుగా ఈ పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ మారుస్తూ.. ఈ ప్రాంతానికి సంబంధించిన రూపురేఖలన్నింటినీ కూడా మార్చాలన్న తపన, తాపత్రయంతో ఇవాళ రూ.340 కోట్లతో వరికపూడిశెల ఎత్తిపోతల ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ నీరు అందించడం జరుగుతుందని గర్వంగా చెబుతున్నాను.

గతంలో టెంకాయ కొట్టి మోసం...
గతంలో మీరు గమనించే ఉంటారు. ఇదే పథకానికి గతంలో ఎన్నికలకు కేవలం నెల ముందు... గత పాలకులు 2019 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా.. ఈప్రాజెక్టుకు సంబంధించిన భూమి... ఏమాత్రం ప్రొక్యూర్‌ చేయకుండానే, మనందరినీ మోసం చేసేందుకు టెంకాయ కొట్టారు. ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని చెప్పి మనందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. నిస్సిగ్గుగా మోసం చేశారు. ఆలోచన చేయండి. 

నేడు అన్ని అనుమతులతో పనులు ప్రారంభం...
ఇదే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెల 6వ తేదీన అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. అలాగే అభయారణ్యం కావడం వల్ల నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ నుంచి కూడా ఈ ఏదాది మే నెలలో అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూములను కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మన హయాంలోనే ప్రొక్యూర్‌ చేశాం. అవన్నీ లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అనుమతులు లేకుండానే.. భూమి ప్రొక్యూర్‌ చేయకుండానే మరి ఏ రకంగా 2019 ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు గత పాలకులు, ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడకువచ్చి టెంకాయ కొట్టారు  అని మీ అందరి తరపును నేను అడుగుతున్నాను.
ఏ కార్యక్రమం చేసినా అందులో చిత్తశుద్ధి ఉండాలి. నోటిలో నుంచి మాట వస్తే అందులో నిజాయితీ ఉండాలి. ప్రజలను, రైతులను, అక్కచెల్లెమ్మలను, చదవుకుంటున్న పిల్లలను మోసం చేయాలని... మోసం తోనే అడుగులు వేస్తే... ఏం జరగబోతుందన్నది ప్రజలే 2019లోనే గట్టిగా చెప్పారు. 175 నియోజకవర్గాలను గానూ.. గతంలో పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని కేవలం 23 స్ధానాలకే పరిమితం చేస్తూ ప్రజలు గట్టిగా తీర్పునిచ్చారు. అబద్దాలను నమ్మం, మోసాలకు ఓటు వేయం అని ప్రజలు గట్టిగా తీర్పునిచ్చిన పరిస్తితులను మనం చూశాం. 

వరికపూడిశెల– 25 వేల ఎకరాలకు సాగు, తాగునీరు..
ఈ రోజు అందుకు భిన్నంగా.. అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాత పనులను ప్రారంభిస్తున్నాం. ఈ లిఫ్ట్‌ను నాలుగు పంపులతో నాగార్జున సాగర్‌కు 40 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తున్నాం. వరికెపూడిశెల వాగునుంచి రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున మొదటిదశ కింద 1.57 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 25వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లిఫ్ట్‌ ద్వారా  20వేల మంది జనాభాకు తాగునీరందించే మంచి జరుగుతుంది. దాదాపు రూ.340 కోట్ల వ్యయంతో ఈప్రాంతానికి నీటిని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది.

పల్నాడు గుండె చప్పుడు విన్న వ్యక్తిగా...
ఇంకా కొన్ని విషయాలు ఈ అందరితో పంచుకుంటున్నాను. ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఎంత ఔషధమో పూర్తిగా తెలిసిన వ్యక్తులలో నేను ఒకరిని. మీ అందరి గుండె చప్పుడు విన్న వ్యక్తులలో నేను ఒకరిని. కాబట్టి ఈ ప్రాజెక్టును దశలవారీగా మాచర్ల నియోజకవర్గం ఆ తర్వాత వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, ఆ తర్వాత ఎర్రగొండపాలెం వరకు తీసుకునిపోయే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన అటవీ, పర్యావరణశాఖ అనుతులన్నీ కూడా ఇఫ్పటికే తీసుకునిరాగలిగామని సంతోషంగా చెబుతున్నాను. దేవుడి దయతో దశలవారీగా  ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే దశలవారీగా పూర్తవుతుందో... 1.25 లక్షల ఎకరాలకు సాగునీరందించే కార్యక్రమం పూర్తవుతుంది. దాదాపుగా 1లక్ష మందికి తాగునీరు అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది.

పౌరషాల గడ్డ నుంచి అభివృద్ధి గడ్డగా...
ఈ రోజు ఈ ప్రాజెక్టే కాకుండా..ఈ పల్నాడను, ఈ పౌరుషాల గడ్డను, అభివృద్ధి గడ్డగా మార్చడానికి, స్వతంత్య్రం వచ్చిన తర్వాత ఏడు దశాబ్ధాలుగా ఎవరూ సాహసం కూడా చేయని విధంగా... ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి మీద మీ బిడ్డ ప్రభుత్వం గత 53 నెలలుగా ప్రతి అడుగు వేస్తూ వచ్చాం. 

పల్నాడును ప్రత్యేక జిల్లా చేయడమే కాకుండా.... ఇక్కడ ఈ ప్రాంతానికి వేగంగా ఇప్పటికే పనులు జరుగుతున్న మెడికల్‌ కాలేజీని కూడా మన ప్రభుత్వమే తీసుకువచ్చింది. 

ఒక్క పల్నాడే కాదు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా ప్రజల్ని ప్రధానంగా పేద వర్గాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలను నా నిరుపేద వర్గాలందరికీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, మహిళా సాధికారతను ఇవ్వడానికి 53 నెలలుగా మనందరి ప్రభుత్వం ప్రతి నిమిషం, ప్రతి రూపాయి ఖర్చు చేసింది. 
అత్యధిక ప్రాధాన్యతను పేద వర్గాల సాధికారతకు ఇచ్చాం కాబట్టే... మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా రూ. 2.40 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతుంది. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేదు. 
ఇక నాన్‌ డీబీటీ ద్వారా అంటే ఇళ్ల స్థలాలు, సంపూర్ణ పోషణ లాంటి కార్యక్రమాల ద్వారా రూ. 1.70 లక్షల కోట్లు.. వెరసి మొత్తం  53 నెలల కాలంలో అక్షరాలా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ ప్రభుత్వంలో రూ.4.10 లక్షల కోట్ల పైచిలుకు మేలు చేసింది. లంచాలు అడిగేవాడు లేడు. ఎక్కడా వివక్ష చూపే కార్యక్రమం జరగడం లేదు. ప్రతి అక్కచెల్లమ్మల కుటుంబాల వద్దకు వచ్చి... నీకు ఏం అవసరం ఉందని ప్రతి ఇంటికి వచ్చి అడిగి మరీ తెలుసుకుని మంచి చేసే కార్యక్రమం మీ బిడ్డ పాలనేలో జరుగుతుంది. 

కోవిడ్‌ ఉన్నా ఆగని సంక్షేమం....
మీ  బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌ వచ్చింది. వరుసగా రెండేళ్లు మన  రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు. కోవిడ్‌ సమస్యులున్నా... ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, ఆదాయాలు తగ్గినా, కోవిడ్‌ ఖర్చుల పెరిగినా, బాబు చేసిన అప్పుల కుంపటి ఎంతగా ఇబ్బంది పెట్టినా ఎవరిమీదా నేరం మోపలేదు. సాకులు వెతకలేదు, చెప్పలేదు.

మీ అవసరాలు మీ కష్టాలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవసరాలు ఖర్చులకన్నా మిన్నగా భావించి... ప్రతి ఒక్కరికీ మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా నిలబడగలిగింది. ఎంతటి కష్టకాలంలో కూడా సంక్షేమం ఆపలేదు. అభివృద్ధి ఆపలేదు. మరోవైపు చంద్రబాబు గారి గత పాలన ఎలా జరిగింది. ఎందుకంటే రాబోయో రోజుల్లో మహా సంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఆ మహాసంగ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ? గతంలో పాలన ఎలా జరిగింది ? అందులో ఆ పెద్దలు, పాలకులు ఎలా పని చేశారు? మనకు మంచి చేయగలుగుతారా? లేదా అన్నది ఆలోచన చేయాలి. 

గతానికీ– నేటికీ తేడా చూడండి.
గత పాలనకు, మీ బిడ్డ పాలనకు బేరీజు వేయాల్సిన సమయం వచ్చింది. మరోవైపు మన ప్రతిపక్ష నాయకుడ్ని చూడండి. రైతులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు మంచి చేస్తూ కనీసం ఒక్క పథకమైనా పెట్టిన చరిత్ర గతంతో చంద్రబాబుకు ఉందా? 

గతం మోసాల చరిత్ర....
గతంలో మనం ఏం చూశామంటే... మోసాల చరిత్రను చూశాం. వెన్నుపోట్ల చరిత్రను చూశాం. అబద్ధాల చరిత్రే మనకు చంద్రబాబు పాలనలో కనిపించింది.  ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కనీసం ఒక మంచి చేశానని గానీ, కనీసం ఒక మంచి స్కీమ్‌ తీసుకొచ్చానని గానీ, కనీసం ఒక మంచి కార్యక్రమం అమలు చేశానని కానీ ఈ పెద్దమనిషి ఓటు అడగడు. కారణం ఈ పెద్దమనిషి చేసిందేం లేదు కాబట్టి. కానీ ఈయన ఎన్నికలు రాగానే అది చేస్తాను, ఇది చేస్తానని చెబుతాడు. మాయ మాటలతో ఓట్లు అడుగుతాడు.

ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగితేనే మీరు అండగా నిలబడాలని మీ బిడ్డ అడుగుతున్నాడు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. ఫలానా మంచి చేశాను, నాకు ఓటు వేయండి అని అడగడం లేదు. మంచి చేసానని ఓటు అడగడం లేదు... మోసం చేసేందుకు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచేందుకు.. మీకు కేజీ బంగారం ఇస్తాను, మీ ఇంటికి బెంజ్‌ కారు కొనిస్తాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చంద్రబాబు చెబుతున్నాడు. 

చంద్రబాబును నమ్ముగలమా ?
ఇదే పెద్దమనిషి చంద్రబాబు చివరికి సొంత నియోజకవర్గం అయిన కుప్పానికి కూడా 34 ఎమ్మెల్యేగా ఉన్నా ... అక్కడ కూడా నీరిచ్చిన చరిత్ర లేదు. కుప్పానికే నీళ్లు ఇవ్వని చంద్రబాబు.. మన మాచర్లకు, మన పల్నాడుకు లేదా మరో ప్రాంతానికి ఈ పెద్దమనిషి నీరు ఇస్తానని చెబితే నమ్మగలమా?  నమ్మగలుగుతామా? 
కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తానని ఒకడు అన్నాడట. ఈ పెద్దమనిషి చంద్రబాబు మాటలు చూస్తే అవే కదా గుర్తుకొస్తాయి.

కుప్పానికేం చేయలేని బాబు...
14 యేళ్లు సీఎంగా ఉండి కూడా సొంత నియోజకవర్గం కుప్పానికి రెవెన్యూ డివిజన్‌ కూడా ఏర్పాటు చేసుకోలేపోయాడు. అలాంటి ఈ పెద్ద మనిషి... ఇక మన పల్నాడుకు గానీ, మరోప్రాంతానికి గానీ, మన గ్రామానికి గానీ, మన కుటుంబాలకు గానీ, మన 
సామాజిక వర్గాలకు గానీ మంచి చేస్తాడని నమ్మగలమా? 

చివరికి కుప్పానికి నీళ్లు కావాలన్నా ? చివరికి కుప్పానికి రెవెన్యూ డివిజన్‌ కావాలన్నా ?  చేసేది మీ బిడ్డే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 
పొదుపు సంఘాల రుణాల్ని మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని ఈ పెద్ద మనిషి చెప్పాడు. చివరికి పొదుపు సంఘాల రుణాలు మాఫీ కాకపోగా ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌ సంఘాలుగా ఉన్న నా అక్కచెల్లెమ్మల సీ గ్రేడ్‌ గా, డీ గ్రేడ్‌ గా వారి పరపతి దిగజారిన పరిస్థితులు చూశాం.

చివరకు నా అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేసిన ఇలాంటి బాబు.. ఒక జగనన్న అమ్మ ఒడిగానీ, జగనన్న వైయస్సార్‌ ఆసరా గానీ, వైయస్సార్‌ చేయూత గానీ, సున్నా వడ్డీ గానీ, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కానీ ఏనాడైనా చేయగలిగాడా?   చేస్తానంటే నమ్మగలమా? 

బాబు విజన్‌ – ప్రజల్లో చెవిలో పువ్వులు...
ఈయన్ను చూస్తే ఒక సామెత గుర్తుకు వస్తుంది. ఒకాయన ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటాడట. ఎప్పుడూ లేస్తే మనిషిని కాదంటాడట. కానీ మంచంలోంచి లేవడు. 
చంద్రబాబు పరిస్థితి కూడా ఇంతే. తాను చేసిన మంచి ఏమిటనేది ఎప్పుడూ చెప్పడు. ఆయన 2000 సంవత్సరంలో ఉంటే 2047 గురించి చెబుతాడు. 2000 సంవత్సరంలో నువ్వు ఉన్నావ్‌.. ఇప్పుడేం చేస్తావంటే చెప్పడు.  50 ఏళ్ల విజన్‌ అంటాడు. 50 ఏళ్ల తర్వా ఏం జరగబోతోందనేది చెబుతాడు. 
ఎందుకంటే  50 ఏళ్ల తర్వాత ఎవడుంటాడో ? ఎవడు పోతాడో ? ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్‌ పెట్టడం ఈజీ కదా అని ఆలోచిస్తాడు. 

మీ బిడ్డ 53 నెలల పాలనలో...
అదే మీ బిడ్డ పాలనలో  53 నెలల కాలంలో పల్నాడును జిల్లా చేసింది మనందరి ప్రభుత్వం.  పల్నాడుకు రెవెన్యూ డివిజన్‌ ఇచ్చింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం. 
పల్నాడులోగానీ, రాష్ట్రంలో ఏ జిల్లా అయినా, గ్రామ గ్రామాన సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం.  గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. విలేజ్‌ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికీ జల్లెడ పట్టి ఆరోగ్య సురక్ష జరుగుతోంది.
ఇంగ్లీష్‌ మీడియం బడులొచ్చాయి. గ్రామ గ్రామాన రూపురేఖలు మారుతున్నాయి.  జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది కూడా మనం, మనందరి ప్రభుత్వమే.  అది కూడా ఈ 53 నెలల కాలంలోనే చేశాం.

వెన్ను పోటు వీరుడు....
కుటుంబంలో సొంత కూతురును ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, ఇక రాష్ట్రంలోని కోటీ 50 లక్షల కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా?  భవిష్యత్‌ లో ఆయన నేను మారాను అంటే మనం నమ్మగలమా? అని అడుగుతున్నాను.
సొంత కూతురుని ఇచ్చిన మామ... ఎన్టీ రామారావు పరిస్థితే అది అయితే, నువ్వు, నీలాంటోడు, నాలాంటోడి పరిస్థితి ఏంటి?

ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానని చెప్పి అహంకారంతో మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ముస్లింలకు, ఎస్టీలకు కనీసం మంత్రి పదవి ఇవ్వని మనిషి ఈ పెద్దమనిషి. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఏ వర్గానికైనా ఏనాడైనా న్యాయం చేశాడా? మరి ఇలాంటి వ్యక్తి భవిష్యత్‌ లో నేను మారాను అంటే నమ్మగలమా?  తన కొడుకు, తన మనవడు.. వీళ్లు వెళ్లే బడులు మాత్రం ఇంగ్లీషు మీడియమే. ఆ కొడుక్కు తెలుగు మాట్లాడటం కూడా సరిగా రాదు. పోనీ ఇంగ్లీష్‌ అన్నా వస్తుందంటే అదీ రాదు. అది వేరే విషయం. కానీ తన కొడుకు, మనవడు వీళ్లను చదివించింది ఇంగ్లీష్‌ మీడియంలోనే. 

మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనార్టీలు, మన బీసీలు, మన నిరుపేద వర్గాలు వెళ్లే మన గవర్నమెంట్‌ బడులు మాత్రం ఇంగ్లీష్‌ మీడియంకు మారకూడదట. అవి తెలుగుమీడియంలోనే ఉండాలట.  ఒకవేళ అవి ఇంగ్లిషు మీడియం కింద మారితే తెలుగు ఏమైపోతుందని ఈ పెద్ద మనిషి బాధపడిపోతాడు.

మరి ఇలాంటి పెద్ద మనిషి హయాంలో ఏ పేదవాడికైనా కూడా, ఏ సామాజిక వర్గానికైనా కూడా భవిష్యత్‌ మారుతుందనే నమ్మకం ఉందా? అని అడుగుతున్నాను.
ఇలాంటి పెద్ద మనిషి రేపు మీ దగ్గరకి వచ్చి.. నేను మారాను అంటే నమ్మగలమా? 

గతంలో ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ 2 వేల నిరుద్యోగ భృతి.. ఈ మాటలన్నీ గుర్తున్నాయా ?   జాబు రావాలంటే బాబు రావాలి అని ఊదరగొట్టి మోసం చేసాడు. 

స్వతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి దాకా మన ప్రభుత్వం వచ్చిన దాకా గవర్నమెంట్‌ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే మరో 2 లక్షల 7 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత మనందరి, మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగితే...   ఈ పెద్ద మనిషి చంద్రబాబును 
– చంద్రబాబును నమ్ముకుంటే ఇలా 2.07 లక్షల  ఉద్యోగాలు ఇవ్వగలడా?  రేప్పొద్దున మీ దగ్గరకు వచ్చి నేను మారాను అంటే నమ్మగలమా? 

మన అదృష్టం కొద్దీ ఈయన దిగాడు గానీ, దిగకపోయి ఉంటే ఆర్టీసీ ఉండేది కాదు, కరెంటు కంపెనీలు ఉండేవి కాదు. ప్రభుత్వ రంగంలో ఏ కంపెనీలు ఉండేవి కావు. అన్నీ కూడా నీట్‌ గా అమ్మేసి గవర్నమెంట్‌ ను మూసేసేవాడు. ప్రభుత్వ రంగంలో హాస్పిటళ్లు కూడా ఉండేవి కాదు. 
దేవుడి దయతో ఆయన పోయాడు కాబట్టి వీటికి కొత్తరూపు వచ్చింది. ఆస్పత్రులు స్కూళ్లు మారాయి. ఆర్టీసీని కూడా గవర్నమెంట్‌ లో కలిసి రూపురేఖలు మారిన పరిస్థితులు మన ప్రభుత్వంలో వచ్చాయి.

ఈ పెద్ద మనిషి తనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా హైదరాబాద్‌ కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్న ఈ పెద్దమనిషి వైద్య ఆరోగ్య రంగంలో... మనందరి ప్రభుత్వంలో... విప్లవాన్ని తీసుకురావాలని ఏనాడైనా అడుగు వేశాడా? 
పేదవాడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపుతాను అని భవిష్యత్‌ లో ఈ పెద్దమనిషి అంటే నమ్మగలమా? ఆలోచన చేయండి.

రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయన్న ఈ పెద్దమనిషి...  ఉచిత విద్యుత్‌ కోసం రైతులు ధర్నాలు చేస్తే ఆ రైతుల గుండెల మీద కాల్చి చంపిన ఈ పెద్దమనిషి, రుణాల మాఫీ దగ్గర నుంచి రైతన్నకిచ్చిన ఏ హామీ అయినా ఏనాడైనా నిలబెట్టుకున్నాడా? 
 అలా రైతును మోసం చేసి గాలికి వదిలేసిన ఈ బాబు ఇప్పుడు రైతులకు ఏదేదో చేస్తానంటాడు. 

రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ మొదటి సంతకంతో చేస్తానన్న పెద్దమనిషి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని టీవీల్లో అడ్వరై్డజ్‌మెంట్లు ఊదరగొట్టిన ఈ పెద్దమనిషి.. అధికారంలోకి వచ్చాక రైతులను అడ్డగోలుగా మోసం చేసిన ఈ పెద్ద మనిషి ఈరోజు మైకు పట్టుకొని అది చేస్తా ఇది చేస్తాఅంటే నమ్మగలమా ? 

చంద్రబాబు వాలకం ఎలా ఉంటుందంటే...  నరమాంసం రుచి మరిగిన పులి బంగారం కడియాన్ని చూపుతూ ఫ్రీ  గిఫ్ట్‌  ఇస్తా అని ఆశ పెడితే, ఎవరైనా ఆ బంగారు కడియం కోసం పులి దగ్గరకు వెళ్లే ధైర్యం చేయగలుగుతారా? ఈపెద్ద మనిషి చంద్రబాబు మాటలు నమ్మితే కూడా అదే మాదిరిగా ఉంటుంది. 

తన బినామీ భూములు బాగా పెరగాలన్న దుర్భుద్ధితో ఈ పెద్దమనిషి అమరావతిని ఒక రాజధానిగా భ్రమ కల్పించాడు. 
మరి ఇలాంటి వ్యక్తి  మూడు ప్రాంతాలకు ఏనాడైనా సమన్యాయం చేశాడా?   ఈ పెద్దమనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే సమన్యాయం జరుగుతుందని ఎవరికైనా నమ్మకం ఉందా? 
ఈ మనిషి భవిష్యత్తులో నేను మారాను అని అంటే  నమ్మగలమా? 

తన హయాంలో చంద్రబాబు పేదలకు కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. తన హయాంలో పేదలకు సెంటు స్ధలం కూడా ఇవ్వకపోగా... మనం 31 లక్షల ఇంటి స్థలాలను నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపేందుకు కేసులు వేశారు. అంతే కాకుండా...  కులాల మధ్య సముతుల్యం దెబ్బతింటుందని, ఏకంగా ఎదురు దాడి చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇటువంటి వ్యక్తి హయాంలో ఏ పేదవాడికైనా మంచి జరుగుతుందా?  ఇలాంటి వ్యక్తి నేను మారాను, భవిష్యత్‌ లో ఇవన్నీ చేస్తానంటే నమ్మగలమా?

బాబు– లంచాల పాలన...
తన పాలనలో పేదలకు పెన్షన్‌ కావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, రేషన్‌ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా, లంచాలు ఇస్తూ జన్మభూమి కమిటీల చుట్టూ, గవర్నమెంట్‌ కార్యాలయాల చుట్టూ తిప్పిన ఈ పెద్దమనిషి మనసు మారాలంటే, గుండె కరగాలంటే ఇలా మానవత్వపు ఇంజెక్షన్లు, గుండె కరిగే ఇంజెక్షన్లు ఎన్ని ఇస్తే ఈ పెద్ద మనిషిలో మానవత్వం వస్తుందో ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తి ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి కాబట్టి ఒకడే చెబితే నమ్మరని, తనకు తోడు ఇంకో నలుగురిని కలుపుకుంటున్నాడు. 
వాళ్లు అందరూ.. ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు, కేజీ బంగారం ఇస్తామంటున్నారు. మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో నువ్వు 5 హామీలు చెబితే... నేను దత్తపుత్రుడుని కలిశాను కాబట్టి మరో 6 హామీలు ఇస్తున్నాము. మొత్తం 11 హామీలిస్తున్నామంటున్నారు 

బాబు– దత్త పుత్రుడి మోసం...
 2014లో ఇదే దత్తపుత్రుడు చంద్రబాబుతో కలిసే పోటీ చేశాడు. 
ఇదే చంద్రబాబుతో కలిసే మేనిఫెస్టో రిలీజ్‌ చేశాడు. ఆ మేనిఫెస్టోకు నేను పూచీ అన్నాడు. వీళ్లద్దరూ అయితే సరిపోరని వీరికి తోడు మోదీ  వీళ్లిద్దరికి తోడు మోడీ గారి పేరు కూడా తెచ్చుకున్నారు. ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది గత చరిత్ర. అలాంటి గత చరిత్ర ఉన్నవాళ్లు ఇవాళ మాట్లాడుతున్న మాటలు చూస్తే.. 5 హామీలు ఒకరు, 6 హామీలు ఇంకొకరు కలిసి 11 హామీల మేనిఫెస్టో ఇది. ఇది రిహార్సల్‌ అట, మేనిఫెస్టో ఇంకా ఎక్కువ ఇస్తారట. నిజంగా వీళ్లు మనుషులేనా? వీళ్లకు సిగ్గుందా? 

అయినా ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితులు మన కళ్లెదుటే కనిపిస్తున్నా... ఇటువంటి దారుణాలను సమర్థించేందుకు చంద్రబాబుకు ఒక వర్గం ఉంది. ఒక ఎల్లో మీడియా ఉంది. ఒక దొంగల ముఠా తోడుంది. వీళ్లందరిదీ ఒక పెద్ద లాబీ.

బాబు నేరాలను కప్పిపెట్టడానికి, విచారణ జరగకుండా అడ్డుకొనేందుకు, వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి బాబు తరపున పనిచేయడానికి అనేక వ్యవస్థల్లో ఆయన మనుషులు, అనేక పార్టీల్లో తన కోవర్టులు కూడా ఉన్నారు. మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు.  ఇలాంటి వాళ్లను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది? ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారు? ఏ పేద వాడి కోసం చేస్తున్నారు? 
కేవలం ప్రజల్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం కోసం దొంగల ముఠాగా ఏర్పడి రాజకీయాలు చేస్తున్న పరిస్థితి చూస్తే రాజకీయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. 

ఇలాంటి రాజకీయాలు చేయడం మీ బిడ్డకు చేత కాదు. ఇలాంటి పొత్తులు పెట్టుకోవడం మీ బిడ్డ చేతకాదు. ఒక వైయస్సార్‌కు గానీ, ఒక జగన్‌కు గానీ తెలిసిందల్లా ఒక్కటే. ప్రజల్లో నడవటం, ప్రజల గుండె చప్పుడు వినడం. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఒక్కటే ఒక్కటి చెబుతాను. 

నేను విన్నాను– ఉన్నాను.. మీ జగన్‌..
నేను విన్నాను, నేను ఉన్నానని మాత్రమే మీ బిడ్డ జగన్‌ చెబుతాడు. ఆ తర్వత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను, ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలను ఒక బైబిల్గా, ఖురాన్‌ గా, భగవద్గీతగా భావించి, అక్కచెల్లెమ్మల బతుకుల్లో మార్పు తీసుకురావడానికి తపిస్తూ అడుగులు వేశాడు మీ బిడ్డ. 
మీ బిడ్డ ఈ పొత్తుల్ని నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి తోడు లేదు. కారణం మీ బిడ్డ వీళ్లనెప్పుడూ నమ్ముకోలేదు.

పైనున్న దేవుడిని, కిందున్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ దళారులను పెట్టుకోలేదు. చేసిన మంచిని మాత్రమే మీ బిడ్డ నమ్ముతాడు. నా ధైర్యం ఇంటింటికీ, అన్ని సామాజిక వర్గాలకూ, అన్ని ప్రాంతాలకు చేసిన మంచి.  మనందరి ప్రభుత్వం ఇంటింటికీ అన్ని సామాజిక వర్గాలకు చేసిన మంచే నా ధైర్యం.  బటన్‌ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన రూ. 2.40 లక్షల కోట్లు నా ధైర్యం. ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టడం మీ బిడ్డకు మీరిచ్చిన ధైర్యం.
 
ఎన్నికల మేనిఫెస్టో చూపించి 99 శాతం వాగ్దానాలు అమలు చేసి ప్రతి అక్కచెల్లెమ్మ ఇంటికి వెళ్లి మేనిఫెస్టోను చూపి అక్కా.. మీ బిడ్డ ఇవన్నీ ఎన్నికలకు మందు చెప్పాడు. ఇవన్నీ జరిగాయా లేదా మీరే చూడండి.. జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని నిజాయితీ అడిగే చిత్తశుద్ధి.

నా  ధైర్యం...
నా ధైర్యం ప్రతి గ్రామంలోనూ.. మనందరి ప్రభుత్వం గ్రామాలను మారుస్తూ నిర్మించిన విలేజ్‌ క్లినిక్‌ లు. ఆగ్రామంలో మార్చిన  వ్యవసాయ తీరు ఆర్బీకే కేంద్రాలు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చి పౌర సేవలు లంచాలు వివక్ష లేకుండా ఇవ్వడం నా ధైర్యం.

నాడు నేడుతో బడులు రూపు రేఖలు మార్చడం నా ధైర్యం. 
మన అక్కచెల్లెమ్మలకు వైయస్సార్‌ ఆసరా ఇవ్వడం నా ధైర్యం. అమ్మ ఒడి ఇవ్వడం, వైయస్సార్‌ చేయూత ఇవ్వడం నా ధైర్యం. 

దిశ యాప్‌ ను డౌన్‌ లోడ్‌ చేయించి, అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ షేక్‌ చేసినా, ఎస్‌ వోఎస్‌ నొక్కినా 10 నిమిషాల్లో పోలీసు అన్నదమ్ములు వచ్చే వ్యవస్థను తీసుకురావడం నా ధైర్యం. 

నా పొత్తు ప్రజలతోనే..
ప్రజలతోనే నా పొత్తు. పేద ప్రజల కోసమే నా పార్టీ, మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టిందనే చిత్తశుద్ధి నా ధైర్యం. అందుకే దళారులతో పొత్తు పెట్టుకోలేదు.  రాబోయే రోజుల్లో ఎన్నికల సంగ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. 
మోసాలకు మోసపోవద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా ? అన్నదే కొలమానంగా తీసుకోండి.  మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. 
మంచి చేసే మనందరి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను.

చివరిగా.....
కాసేపటి క్రితం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి  ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి కొన్ని అభివృద్ధి పనులు అడిగాడు. ఇవాళ జరుగుతున్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులే కాకుండా.. మరికొన్ని పనులు అడిగాడు. అందులో ఒకటి ఇక్కడున్న సీహెచ్‌సిని 100 పడకల ఆసుపత్రి కింద మార్చే కార్యక్రమం చేయమన్నాడు. దాన్ని మంజూరు చేస్తున్నాను. వీటితో పాటు మిగిలినవన్నీ చేస్తాను అని హామీ ఇస్తూ...  సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

  •  
Back to Top