పోలవరం పనుల చెల్లింపుల్లో జాప్యం లేదు

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పనులకు వెచ్చిస్తున్న సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం వైయ‌స్ఆర్ సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌ మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం 15 వేల కోట్ల 970 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తంలో ఆమోదయోగ్యమైనవిగా గుర్తించిన బిల్లులకు  13 వేల కోట్ల 226 కోట్ల రూపాయల చెల్లింపు జరిగింది.

పోలవరం ప్రాజెక్ట్‌ పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తనిఖీ చేసి వాటి చెల్లింపుల కోసం సిఫార్సు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని వివరించారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ ద్వారా నిధులు మంజూరు చేయాలని 2016 సెప్టెంబర్ 30న ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర‌మంత్రి తెలిపారు. అయితే ఆఫీసు మెమోరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి  కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ కింద అయిన ఖర్చు మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఆ ఖర్చును సమయానుసారం భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇథనాల్ స్టాకు పెంపు నిరంతర ప్రక్రియ
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం చేయవలసిన  ఆవశ్యకత దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇథనాల్ నిల్వల సామర్ధ్యం పెంపు అనేది  ఒక నిరంతరం ప్రక్రియ అని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి  రామేశ్వర్ తేలి వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైయ‌స్ఆర్ సీపీ స‌భ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 2020-21లో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ మిశ్రమం చేసినట్లు చెప్పారు. ఆయిల్ రిఫైనరీలు, టెర్మినల్స్, సప్లయర్ల వద్ద ఇథనాల్‌ను నిల్వ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఇథనాల్ నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాటు చేసినట్లు కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు.

Back to Top