ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కోత ముప్పు ఎదుర్కొంటున్న తీర ప్రాంతం 20 శాతం పైనే ఉన్నట్లుగా ఇంకాయిస్‌ (ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సర్వీసెస్‌) అధ్యయనంలో తేలినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.  రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఓ మోస్తరు కోత ముప్పు ఉన్నట్లుగా ఇన్‌కాయిస్‌ అధ్యయనం పేర్కొనట్లు తెలిపారు. కోత ముప్పు అతి తీవ్రస్థాయిలో ఉన్న ప్రాంతం 0.55 శాతం ఉన్నట్లు కేంద్ర‌మంత్రి చెప్పారు.

సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్)కి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర‌మంత్రి తెలిపారు. దీనికి అదనంగా తీరప్రాంత కోత వలన నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరో వేయి కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. జాతీయ స్థాయిలో నేషనల్ డిసాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ సంస్థను నెలకొల్పి 2021-22 నుంచి 2025-26 కాలానికి ఈ సంస్థకు 68 వేల 463 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర‌మంత్రి తెలిపారు. 

ఈ నిధిని ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఎంఎఫ్‌ సంస్థలకు 80-20 నిష్పత్తిలో విభజించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఎన్‌డీఎంఎఫ్‌ను నెలకొల్పింది. ఇలాంటి సంస్థలనే ఎస్‌డీఎంఎఫ్‌ పేరిట ఏర్పాటు చేయవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సలహా మేరకు ఇప్పటికి 21 రాష్ట్రాలు ఎస్‌డీఎంఎఫ్‌లను ఏర్పాటు చేశాయని కేంద్ర‌మంత్రి వివరించారు. సముద్ర కోతల వలన తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందిస్తూ సాంకేతికపరమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయని కేంద్ర‌మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top