అంగన్వాడీలకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రాల్లో ఏపీ

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ జవాబు

న్యూఢిల్లీ: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు అత్యధిక గౌరవ వేతనం అందించే ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ తెలిపారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంగన్వాడీలకు సగటున 7 వేల రూపాయల చొప్పున అత్యధిక నెలసరి వేతనం చెల్లిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక ఉన్నట్లు ఆమె గణాంకాలతో సహా వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైయ‌స్ఆర్ సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు నెలకు రూ.7000, హెల్పర్లకు రూ.4,750 చొప్పున అదనపు గౌరవ వేతనం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అత్యధిక గౌరవ వేతనం చెల్లిస్తున్న రాష్ట్రాల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో తెలంగాణ, హర్యానా ఉండగా ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో అంగన్వాడీ వర్కర్లకు రూ.7వేల అదనపు గౌరవ వేతనం అందిస్తున్నప్పటికీ, అక్కడ హెల్పర్లకు కేవలం రూ.3500 మాత్రమే చెల్లిస్తున్నట్లు  తెలిపారు. అంగన్వాడీ హెల్పర్లకు అత్యధిక గౌరవ వేతనం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్  రెండవ స్థానంలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు అందిస్తున్న గౌరవ వేతనం 2018, అక్టోబర్ 1 నుంచి పెంచినట్లు మంత్రి తెలిపారు. అంగన్వాడీ వర్కర్లకు రూ. 3 వేలు నుంచి రూ. 4500 వరకు, మిని సెంటర్ల అంగన్వాడీ వర్కర్లకు రూ.2250 నుంచి రూ.3500 వరకు, అలాగే అంగన్వాడీ హెల్పర్లకు రూ.1500 నుండి రూ.2250 వరకు పెంచినట్లు తెలిపారు. ప్రతిభ ఆధారిత ప్రోత్సాహం కింద హెల్పర్లకు నెలకు రూ. 250, వర్కర్లకు రూ.500 అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్వాడీ సేవలను ప్రోత్సహిస్తూ తమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సాక్షం అంగన్వాడీ, పోషన్ 2.0 మార్గదర్శకాల ప్రకారం 50 శాతం సూపర్వైజర్ పోస్టులు   5 సంవత్సరాలు అనుభవం కలిగిన వర్కర్లతో అలాగే 50 శాతం అంగన్వాడీ వర్కర్ల పోస్టులు 5 సంవత్సరాలు అనుభవం కలిగిన హెల్పర్లతో భర్తీ చేస్తూ అంగన్వాడీలకు ఉద్యోగోన్నతి కల్పిస్తున్నట్లు శ్రీమతి ఇరానీ తెలిపారు.

అంగన్వాడీలకు 20 రోజులు వార్షిక సెలవులకు అదనంగా 180 రోజులు మెటర్నిటీ, 40 రోజులు అబార్షన్/ మిస్ క్యారేజ్  పెయిడ్ లీవ్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. సామాజిక భద్రత బీమా పథకాల కింద వారికి జీవిత బీమా, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మన్ ధన్ యోజన పథకం కింద వాలంటరీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంకు అర్హులైన అంగన్వాడీలను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కోరినట్టు మంత్రి తెలిపారు. డిజిటల్ సేవలు, పారదర్శకత ప్రోత్సహించేలా అంగన్వాడీలకు ట్యాబ్‌లు అందించి ఇంటర్నెట్ సౌకర్యం కోసం ఏడాదికి రూ.2 వేలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  

దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ 31 నాటికి 13,48,135 అంగన్వాడీ వర్కర్లు, 10,23,068 హెల్పర్లు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 55188  అంగన్వాడీ వర్కర్లు, 42097 హెల్పర్లు ఉన్నట్లు మంత్రి తెలిపారు.  అంగన్వాడీ సేవలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం అయినప్పటికీ పథకం అమలు చేసే బాధ్యత ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలదే.  అలాగే మినీ అంగన్వాడీ సెంటర్లు ప్రధాన అంగన్వాడీ సెంటర్లుగా ఉన్నతీకరిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే 2024-25 మధ్యంతర బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ స్కీం కింద అంగన్వాడీలను చేరుస్తూ రూ. 5లక్షలు ఫ్యామిలీ హెల్త్ కవరేజ్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

తిరుపతి ఐఐటీకి 1091 కోట్లు విడుదల
తిరుపతి ఐఐటీ క్యాంపస్ శాశ్వత భవనం నిర్మాణానికి సంబంధించిన సివిల్ వర్క్స్, ఎక్విప్‌మెంట్‌, ఫర్నిచర్ కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1091.75 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ పేర్కొన్నారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికరింగ్, నాన్ రికరింగ్ ఖర్చుల కోసం ఇప్పటివరకు రూ.190.17 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే ఐఐటీ తిరుపతి క్యాంపస్ తొలిదశ కింద చేపట్టిన శాశ్వత భవనాల నిర్మాణం పూర్తి చేసి యాజమాన్యానికి అప్పగించినట్లు మంత్రి తెలిపారు.

Back to Top