ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోస్టల్‌ శాఖతో కలిసి పోస్ట్‌ ఆఫీసు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు 2017లోనే ప్రకటించినట్లు విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ‌ సభ్యులు  విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో ప్రస్తుతం మొత్తం 521 పాస్‌పోర్ట్‌ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 93 పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు, 428 పోస్ట్‌ ఆఫీసు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు ఉన్నాయని కేంద్ర‌మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 24 పార్లమెంటరీ నియోజకవర్గాలకు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు లేదా పోస్ట్‌ ఆఫీసు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలో తిరుపతి, విజయవాడలోను, విశాఖపట్నం రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలో విశాఖపట్నం, భీమవరంలో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు పని చేస్తున్నట్లు కేంద్ర‌మంత్రి తెలిపారు. 

లేబర్ కోడ్స్‌పై పలు రాష్ట్రాలు నోటిఫికేషన్‌
పార్లమెంట్‌లో చట్టబద్దత కల్పించిన నాలుగు లేబర్‌ కోడ్స్‌పై ఇప్పటికే అనేక రాష్ట్రాలు నియమ, నిబంధనలను నోటిఫై చేసినట్లు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. కోడ్‌ ఆన్‌ వేజెస్‌ 2019కి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు 28 రాష్ట్రాలు నియమ నిబంధనలను నోటిఫై చేశాయి. ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ కోడ్‌కు సంబంధించి 23 రాష్ట్రాలు, సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌కు సంబంధించి 22 రాష్ట్రాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం కోడ్‌కు సంబంధించి 18 రాష్ట్రాలు ఇప్పటి వరకు నియమ నిబంధనలను నోటిఫై చేసినట్లు కేంద్ర‌మంత్రి చెప్పారు.

లేబర్‌ కోడ్స్‌పై ఆయా రాష్ట్రాలు రూల్స్‌ను నోటిఫై చేసేందుకు గడువు విధించే అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీనలో ఉందా అన్న మరో ప్రశ్నకు కేంద్ర‌మంత్రి సమాధానం ఇస్తూ.. కార్మిక శాఖ అనేది రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంశం. కార్మికులకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అందువలన కేంద్రం లేబర్‌ కోడ్స్‌పై చట్టం చేసిన తర్వాత వాటికి సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించేందుకు ఆయా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు.

Back to Top