ఐదేళ్ల‌లో ఐస్ బ్రేక‌ర్‌ నౌక సిద్ధం చేస్తాం

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి రిజుజు జవాబు

న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్ల‌లో భారత్‌లో పోలార్‌ రీసెర్చ్‌ నౌకను సిద్ధం చేస్తామని భూవిజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ప్రకటించారు. ఆర్కిటిక్‌, ఆంటార్కిటిక్‌ ప్రాంతంలో భారత్‌ మూడు శాస్త్ర  పరిశోధన కేంద్రాలను నెలకొల్పినప్పటికీ పదేళ్లుగా పోలార్‌ రీసెర్చ్‌ నౌక (ఐస్‌ బ్రేకర్‌ నౌక) నిర్మాణంలో ఎందుకు విఫలమయ్యామని వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబిస్తూ.. ఐస్‌ బ్రేకర్‌ నౌక నిర్మాణంలో ఎదురైన ఆటంకాలు, అవాంతరాలను సుదీర్ఘంగా వివరించారు. భారతి, మైత్రి, హిమాద్రి పేరిట ఉత్తర, దక్షిణ ధృవాలలో భారత్‌ మూడు శాస్త్ర పరిశోధ కేంద్రాలను నెలకొల్పింది. ఈ కేంద్రాలకు నిరంతర రాకపోకలు సాగించడానికి ఐస్‌ బ్రేకర్‌ నౌక చాలా అవసరం. ఉత్తర, దక్షిణ ధృవాలలో నెలకొల్పిన ఈ రీసెర్చ్‌ స్టేషన్లు వాతావరణ మార్పులపై విస్త్రత శాస్త్ర పరిశోధనలు జరుపుతున్న నేపథ్యంలో పలు కారణాలరీత్యా ఐస్‌ బ్రేకర్‌ నౌకను సమకూర్చుకోవడం కీలకంగా మారిందని కేంద్ర‌మంత్రి చెప్పారు. ఈ నౌకను సకాలంలో సమకూర్చుకోలేకపోవడం తనకూ బాధాకరంగా ఉందని అన్నారు.

రూ.1051 కోట్ల వ్యయంతో పోలార్‌ రీసెర్చ్‌ నౌక (ఐస్‌ బ్రేకర్‌ నౌక)ను సమకూర్చుకోవడానికి 2014లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర‌మంత్రి చెప్పారు. ఐస్‌ బ్రేకర్‌ నౌక నిర్మాణం కోసం టెండర్‌ పిలిచి ఒక కంపెనీకి పని అప్పగించడం జరిగింది. అయితే టెండర్‌లో పేర్కొన్న కొన్ని నిబంధనలపై ఆ కంపెనీ అభ్యంతరాలు లేవనెత్తడంతో నౌక నిర్మాణం నిలిచిపోయిందని కేంద్ర‌మంత్రి వివరించారు. 2600 కోట్లతో ఐస్‌ బ్రేకర్‌ షిప్‌ను నిర్మించడానికి తాజాగా ఈఎఫ్‌సీ ప్రతిపాదనలు ఇచ్చింది. నౌక నిర్మాణ వ్యయం అమాంతంగా రెండు రెట్లు పెరిగినందున ఈ ప్రతిపాదనను చాలా నిశితంగా పరిశీలించడం జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీనిపై తుది అంచనా వ్యయాన్ని రూపొందించి మంత్రివర్గం ఆమోదం పొందే ప్రయత్నం చేస్తున్నాం. మరో ఐదేళ్ల‌లో పోలార్‌ రీసెర్చ్‌ నౌక సిద్ధం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరహా నౌకల తయారీలో ఆపార నైపుణ్యం కలిగిన రష్యా వంటి దేశాలతో షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు.

Back to Top