అణుశక్తి రంగంలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం

రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా అణుశక్తి రంగంలో ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన సంస్కరణల గురించి రాజ్యసభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు పీఎం కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ బదులిచ్చారు. ప్రజా సంక్షేమానికి వినియోగించే సంకల్పంతో అణుశక్తి రంగంలో ప్రభుత్వం అనేక వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. క్యాన్సర్‌తోపాటు ఇతర రోగాలకు చికిత్సను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మెడికల్‌ ఐసోటోప్స్‌ ఉత్పాదన కోసం పీపీపీ పద్ధ్దతిలో రీసెర్చ్‌ రియాక్టర్లను నెలకొల్పడం సంస్కరణలో భాగంగా చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

అలాగే ఇ్రరేడియేషన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఆహార పదార్థాలు పాడవకుండా పరిరక్షించేందుకు పీపీపీ పద్ధతిలో అందుకు తగిన సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు. అణుశక్తి రంగంలో రీసెర్చ్, టెక్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ మధ్య గట్టి సంబంధ బాంధవ్యాలను నెలకొల్పి స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గడ్డల్లో మొలకల నిరోధానికి, తృణ ధాన్యాలు, కాయ ధాన్యాలు పురుగు పట్టకుండా నిరోధించేందుకు గామా ఇ్రరేడియేషన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. తద్వారా ఆహార పదార్థాలు పాడవకుండా సుదీర్ఘకాలం మన్నుతాయన్నారు. ఈ టెక్నాలజీని ఇప్పటికే అనేక ప్రైవేట్‌ సంస్థలకు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో 26 గామా రేడియేషన్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లు పని చేస్తున్నట్లు కేంద్రమంత్రి వివరించారు. ఇ్రరేడియేషన్‌ సదుపాయాలను పీపీపీ పద్ధతిలో నెలకొల్పడం ద్వారా దిగుబడి అనంతరం వ్యవసాయోత్పత్తుల నిల్వలో జరిగే అపార నష్టాన్ని నివారించగలమని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.

మిడ్‌ డే మీల్‌ పథకం కింద ఏపీలో 19వేల కిచెన్లు రెడీ
మధ్యాహ్న భోజన పథకం (మిడ్‌ డే మీల్‌) కింద ఆంధ్రప్రదేశ్‌లో 19 వేల కిచెన్‌ కమ్‌ స్టోర్స్‌ నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. రాజ్యసభలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ పథకం కింద కిచెన్‌ కమ్‌ స్టోర్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. 2006–07 నుంచి 2019–20 మధ్య కాలంలో కేంద్ర ఆంధ్రప్రదేశ్‌కు 44,316 కిచెన్‌ కమ్‌ స్టోర్‌లను మంజూరు చేసిందన్నారు. ఒక్క కిచెన్‌ కమ్‌ స్టోర్‌ నిర్మాణానికి 60 వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈ మొత్తం ఏమూలకు సరిపోవడం లేదంటూ ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు వీటి నిర్మాణానికి ఆసక్తి చూపకపోవడంతో 2009 డిసెంబర్‌ నుంచి కిచెన్‌ కమ్‌ స్టోర్స్‌ నిర్మాణ వ్యయాన్ని సవరించడం జరిగిందన్నారు. యూనిట్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చుకు బదులుగా వాటిని నిర్మించే ప్లింత్‌ ఏరియాను బట్టి చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. సవరించిన నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన కిచెన్‌ కమ్‌ స్టోర్స్‌ను నిర్మించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు నిర్మించినవి కాకుండా కొత్తగా చేపట్టే వాటిని నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా సొంత నిధులతో నిర్మిస్తామని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపినట్లు కేంద్రమంత్రి చెప్పారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top