శ్రీ‌వారిని సేవ‌లో అమిత్‌షా, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ 

తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద‌ర్శించుకున్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యేందుకు తిరుపతికి విచ్చేసిన అమిత్‌షాతో పాటు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ప్రత్యేక కాన్వాయ్‌లలో రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం నుంచి సంప్రదాయ పంచకట్టుతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పద్మావతి అతిథి గృహానికి వచ్చారు. అనంతరం కేంద్ర‌మంత్రి అమిత్‌షా, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇద్దరూ కలిసి ఒకే కారులో ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి, వేద పండితులు మహద్వారం వద్ద వారికి స్వాగతం పలికారు. తిరుమ‌ల శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకున్న కేంద్ర‌మంత్రి అమిత్‌షా, సీఎం వైయ‌స్ జ‌గ‌న్.. విమాన వేంకటేశ్వరస్వామికి కానుకలు సమర్పించి.. భాష్యకార్లను, శ్రీ యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవోలు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు, 2022 డైరీ, క్యాలెండర్, టీటీడీ అగరబత్తులను అందజేశారు. 

అమిత్‌ షాకు ఘన స్వాగతం
తిరుపతి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రేణిగుంట విమానాశ్రాయానికి చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు. ప్రోటోకాల్‌ నిబంధనల ప్రకారం పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందించారు. కాగా, హోం మంత్రి రాకకు అరగంట ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, గౌతమ్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top