శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న సేవ‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

మాడ వీధులు, గ్యాలరీల‌ను ప‌రిశీలించిన టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌: శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి సాల‌క‌ట్ల‌ బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా శ‌నివారం గరుడ వాహనసేవను పురస్కరించుకుని శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో భక్తులకు క‌ల్పించిన స‌దుపాయాల‌ను టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప‌రిశీలించారు. వాహ‌న మండ‌పం, గ్యాల‌రీల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. పలువురు భక్తులతో మాట్లాడి టీటీడీ అందిస్తున్న ఆహారం, పాలు, టీ, కాఫీ, తాగునీరు అంద‌రికీ అందుతున్నాయా అని ఆరా తీశారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌, భద్రతా సిబ్బందికి సూచించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులంద‌రికీ అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, పాలు అందేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఎక్కువ మంది భ‌క్తుల‌కు గ‌రుడ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు వీలుగా టీటీడీ చ‌రిత్ర‌లో తొలిసారి కొన్ని గ్యాల‌రీల్లో భ‌క్తుల రీఫిల్లింగ్ ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలిపారు. దీనివ‌ల్ల అద‌నంగా సుమారు 50 వేల మందికి గ‌రుడ వాహ‌న సేవ ద‌ర్శ‌నం క‌ల్పించే అవ‌కాశం క‌లుగుతుంద‌ని చెప్పారు. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వెంట ఆల‌య ఈవో ధ‌ర్మారెడ్డి ఉన్నారు.

Back to Top