చిత్తూరు: ప్రతీ గడపకూ వెళ్ళి ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించి తిరుపతి ఉప ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపిద్దామని వైయస్ఆర్‌సీపీ చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ నేతలకు సూచించారు. తిరుపతిలోని పి ఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైవీ సుబ్బారెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 21 నెలల పాలనలో చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేసిన విషయాన్ని, అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ప్రతీ ఒక్కరికీ అందజేసిన విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. ప్రతీ ఓటర్‌కు జరిగిన మంచి గుర్తుచేయడం, మీ దీవెనలు, ఆశీస్సులు కావాలని అడగాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలు పాటిస్తూ అందరం ఐకమత్యంతో గురుమూర్తి విజయానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో చరిత్ర సృష్టించి సీఎం వైయస్ జగన్‌కు కానుకగా ఇద్దామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, భూమన కరుణాకర్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, తదితరులు పాల్గొన్నారు.