శ్రీవారి ఆశీస్సులతో త్వరలోనే కరోనాపై విజయం సాధిస్తాం

స్వామివారి కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి

ఎస్వీబీసీ చానల్‌ ద్వారా ఉదయం 7 నుంచి ధన్వంతరి పారాయణం ప్రసారం

టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి రోజు 1.20 లక్షల ఆహార ప్యాకెట్లు పంచుతున్నాం

పశువులకు గ్రాసాన్ని కూడా అందిస్తున్నాం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తాడేపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వెంకటేశ్వరస్వామి దర్శనాలను నిలిపివేయడం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దేశ ప్రజలు ఎంతో విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. చాలా వరకు కరోనా వ్యాధిని నియంత్రించగలుగుతున్నామన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో త్వరలోనే కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తామని భావిస్తున్నాను. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూడా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతున్నాయన్నారు.

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. "ప్రపంచం అంతా కరోనా పంజా విసురుతోంది. మానవాళికి పెనుసవాలు ఏర్పడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ వ్యాప్తంగా ఉండే భక్తులు, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని, కరోనా వ్యాధిని త్వరగా బయటపడాలని, వ్యాధిని త్వరగా నశింపజేయాలని దేవదేవుడు వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ మార్చి 27 నుంచి 29వ తేదీ మూడు రోజుల పాటు ధన్వంతరి యాగం చేపట్టాం. అంతకంటే ముందే మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులతో వేద ధన్వంతరి వేద పారాయణ యాగం కూడా నిర్వహించాం. మళ్లీ ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ధన్వంతరి వేద పారాయణ ప్రత్యక్షప్రసారం ప్రతి రోజు ఉదయం 7 నుంచి 7:45 నిమిషాల వరకు ఎస్వీబీసీ చానల్‌ ద్వారా ప్రసారం చేస్తున్నాం. భక్తులు పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేశాం. ఆ కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

1892లో రెండ్రోజులు తిరుమల దేవాలయం మూసివేయడం జరిగిందని పెద్దలు చెబితే నేను విన్నాను. గత వంద సంవత్సరాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేయడం ఇదే మొదటిసారి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మార్చి 19వ తేదీ నుంచి దర్శనాలు నిలిపివేశాం. ఇప్పటి 45 రోజులు అవుతుంది.

రాబోయే బ్రహ్మోత్సవాల్లో కూడా భక్తులు అధికంగా పాల్గొనే ఏర్పాట్లు చేయలేకపోవచ్చు కానీ, కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుతాం. ఏ మేరకు భక్తులను అనుమతించాలో.. ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నాం.

తిరుమలకు ప్రతి రోజు 80 వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తుంటారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తరువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ మేరకు మార్పులు చేయాలని అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కాంప్లెక్స్‌లో భౌతిక దూరం పాటించేలా క్యూ కాంప్లెక్స్‌లు మార్చే ఏర్పాట్లు చేస్తున్నాం.

తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వలస కూలీలు, నిరాశ్రయులు, వేరే ప్రాంతాల్లోంచి వచ్చి ఇక్కడే ఉండిపోయిన వారు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు గత మార్చి నెల 25వ తేదీ నుంచి ఈ రోజు వరకు సుమారు రోజుకు 60 వేల మందికి రెండు పూటలా అంటే 1.20 లక్షల ప్యాకెట్లు అందిస్తున్నాం. ఈ రోజు నుంచి కొన్ని సడలింపులు ఇచ్చారు కాబట్టి ఈ మేరకు అవసరమో సేవా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చాం.

పశువులకు గ్రాసానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి గోశాల నుంచి చుట్టుపక్కల ఉండే ఆవులు, గేదెలకు గ్రాసం అందిస్తున్నాం. స్టే డాగ్స్‌కు కూడా ఆహార పొట్లాలు ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా కరోనా నియంత్రణకు వేద పారాయణాలు, ధన్వంతరియాగం, హోమాలే కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నివారణకు స్విమ్స్‌, బర్డ్‌, పద్మావతి మెడికల్‌ కాలేజీ అన్నింటిలోనే కాకుండా విశ్రాంతి భవనాలు శ్రీనివాసం, మాధవ్‌లలో 5 వేల రూములు రెడీ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. వేద పాఠశాల ఎప్పుడు రీ ఓపెన్‌ చేస్తాం.. అడ్మీషన్స్‌ ఎప్పటినుంచి అనేది లాక్‌డౌన్‌ పూర్తయిన తరువాత నిర్ణయం తీసుకుంటాం' అని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top