శ్రీవారిపై దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం

వారణాసి, జమ్మూకశ్మీర్‌లో టీటీడీ దేవాలయాల నిర్మించాలని తీర్మాణం

శ్రీవారు, తిరుమల దేవస్థానంపై తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్‌ కేసులు

స్వామివారిపై దుష్ప్రచారం చేసిన ఓ పత్రికపై రూ.100 కోట్ల పరువునష్టం దావా

రమణదీక్షితులను గౌరవ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ బోర్డు నిర్ణయం

మరమ్మత్తులు, సౌకర్యాలకు నిధుల మంజూరు

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశమై పలు కీలక నిర్ణయాలపై తీర్మానాలు చేసింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి ఆ వివరాలను మీడియాకు తెలియజేసారు. విలేకరుల సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ఏం మాట్లారంటే.. టీటీడీ బడ్జెట్‌ను అంచనాల ప్రకారం రూ.3243.19 కోట్లకు సవరించడం జరిగింది. శ్రీవారి హుండీ ఆదాయం నుంచి రూ.1231 కోట్లు అంచనా వేస్తే.. ఇప్పుడు రూ.1285 కోట్లుగా సమీకరించడం జరిగింది. ప్రసాదాలకు రూ.270 కోట్లు ఉంటే దాన్ని రూ.330 కోట్లు వస్తుందని అంచనా వేయడం జరిగింది. తిరుమల తిరుపతిలోని పద్మావతి శ్రీనివాస మండపంలో సెంట్రలైజ్డ్‌ఏసీ ఏర్పాటుకు రూ.3 కోట్ల పైచిలుకు మంజూరు చేయడం జరిగింది. పరిపాలన భవనాలకు మరమ్మతులకు రూ. 14.5 కోట్లు మంజూరు, కొంతమంది టీటీడీ అకౌంటింగ్‌డిపార్టుమెంట్‌లో రిక్రూట్‌చేసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. అనుమతి వచ్చినా కొంతమందిని రిక్రూట్‌ చేయలేదు. ఆ రిక్రూట్‌మెంట్‌ కూడా పూర్తిచేయాలని తీర్మానం చేయడం జరిగింది. 

టీటీడీ తరుఫున ముంబైలో దేవాలయం నిర్మించేందుకు రూ. 30 కోట్లు కేటాయించాం. ఉత్తర భారతదేశంలో జమ్మూకశ్మీర్‌లో కూడా వెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని, దానికి ల్యాండ్‌అలాట్‌చేయాలని ఆ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించాం. అదే విధంగా ప్రధాని నరేంద్రమోడీ నియోజకవర్గం వారణాసిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించడానికి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. యూపీ గవర్నమెంట్‌కు భూ కేటాయింపుకు లేఖ రాయనున్నాం. తిరుమలలోని వరహా స్వామి ఆలయానికి రాగి రేకులు, బంగారు పనులు చేపట్టేందుకు రూ.14 కోట్లతో టీటీడీ ఖజానా నుంచి బంగారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. 

తిరుమల తిరుపతి ఘాట్‌రోడ్డు మరమ్మతుల విషయంలో రెండు, మూడు రకాల ప్రతిపాదనలు వచ్చాయి. కొన్ని పర్మినెంట్‌ రోడ్లు వేయాలని, భక్తుల ప్రయాణానికి భద్రత ఉండాలని రెండు రోడ్లను బీటీతో రిపేర్‌ చేయడానికి రూ. 10 కోట్లు మంజూరు చేశాం. పర్మినెంట్‌గా సీసీ రోడ్లా.. బీటీ రోడ్లు వేయాలా.. అనేది ఎక్స్‌పర్ట్‌కమిటీ ఎన్‌హెచ్‌డివిజన్‌ లేదా ఐఐటీ చెన్నై లేదా జేఎన్టీయూ నుంచి ఒక కమిటీ వేసి రిపోర్టు తీసుకోనున్నాం. ఒకసారి రోడ్డు వేస్తే పర్మినెంట్‌గా ఉండాలి. భక్తులు ప్రయాణించేటప్పుడు స్కిడ్‌ కాకుండా ఉండేందుకు ఎక్స్‌పర్ట్‌ కమిటీతో రిపోర్టు తెప్పించాలని నిర్ణయించాం. 

సైబర్‌సెక్యూరిటీ విభాగాన్ని పూర్తిస్థాయిలో తిరుపతిలో, తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని, దానికి సపరేట్‌ అధికారిని నియమించాలని, సోషల్‌మీడియా సైబర్‌సెక్యూరిటీ వింగ్‌ కంట్రోల్‌ చేయలేకపోతే దుష్ప్రచారానికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. లోగడ జరిగిన కొన్ని దుష్ప్రచారాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎవరన్నా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే, పేపర్లలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే ఎలా కంట్రోల్ చేయాలి, అలా చేసిన వారిని వెంటనే ఎలా గుర్తించాలి, వారిపై ఎలా చర్యలు తీసుకోవాలి వీటన్నిటినీ మన సైబర్ వింగ్ పెట్టి దానికి ఒక హెడ్ గా ఒక డిఎస్పీ స్థాయి అధికారిని అపాయింట్ చేసి, ఆయన కూడా టెక్నాలజీవైజ్ సపోర్టు కోసం ఇన్ఫోటెక్, టీసీఎస్ నుంచి అడ్వైజులు తీసుకుని ఈ డిపార్టుమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఓ పత్రిక ఏసయ్య అంటూ టీటీడీపై చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన వార్తా ప్రచురణపై డిఫ్లమేషన్ కేసు వేస్తున్నాం. కోర్టులో కేసు వేయాలని బోర్డు తీర్మానం చేసింది. 

వాళ్లు ఎవరైనా మనను వ్యక్తిగతంగా దూషిస్తే పర్వాలేదు కానీ వాళ్లు సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామిపైనే నింద మోపే విధంగా వారు పబ్లిష్ చేసారు కనుక వారిపై 100 కోట్లకుపైగా వాళ్లపై డిఫ్లమేషన్ కేసు వేయాలని చెప్పి బోర్డు నిర్ణయం తీసుకుంది. మా బోర్డు సభ్యులు కొందరు 1000 కోట్లకు కేసు వేసినా తప్పులేదంటున్నారు. రమణదీక్షుతులు గారిని గౌరవ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. ఆర్డర్స్‌లో ఆయనకు ఇచ్చే రోల్‌గురించి వివరాలు ఇస్తాము. ఇది పూర్తిగా సలహాదారు పదవి మాత్రమే. కొన్ని సేవలు రద్దు చేస్తారని చేస్తున్న ప్రచారం అవాస్తవం. అలాంటి నిర్ణయాలేవీ బోర్డు తీసుకోలేదు. సంప్రదాయం ప్రకారం ఇప్పటిదాకా జరుగుతున్న విధంగానే పూజా, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలాంటి మార్పులూ జరగలేదు. 

వైకుంఠ ఏకాదశి రోజు కూడా గతంలో విఐపీలకు ఇచ్చిన దర్శన సమయానికి అరగంట తక్కువే ఇస్తూ, సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే సీఎం జగన్‌గారి ఉత్తర్వులను పాటిస్తున్నాం. వైకుంఠ ఏకాదశికి ఉత్తరద్వార దర్శనం ద్వాదశి రోజు కూడా తెరచిఉంచే అదే సాంప్రదాయం ఈ ఏడాదీ కొనసాగుతుంది. శ్రీరంగంలో ఉన్నట్టుగా పూర్తిగా ఉత్తరద్వారాన్ని తెరిచి ఉంచాలనే భక్తుల విన్నపం గురించి వచ్చే ఏడాది కొద్ది ముందుగా ఈ అంశంపై విస్తృతంగా చర్చపెట్టి, స్వామీజీలను, అర్చకులను, పీఠాధిపతులను, ఆగమ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడికక్కడ కాంట్రాక్టు బేసిస్ మీద ఉద్యోగులను తీసుకుని సంవత్సరాల తరబడి పని చేసుకుంటూ పోతున్నారు. దీనిపై ఒక హెచ్‌.ఆర్‌పాలసీ తీసుకొస్తున్నాం. ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను పరిగణలోకి తీసుకుంటూ, అవసరమైతే కొత్తవారిని చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తాం. తిరుపతి బర్డ్‌ఆసుపత్రికి చెన్నై అపోలో పనిచేస్తున్న మదన మోహన రెడ్డిగారిని ఇంఛార్జ్ డైరెక్టర్ గా నియమిస్తున్నాం. ఆయన దేవస్థానం నుంచి ఒక్క రూపాయి కూడా జీతం పుచ్చుకోవడం లేదు. త్వరలో వచ్చి ఛార్జ్ తీసుకుంటారు. పేదలకు, అర్హులైన వారికి, వికలాంగులకూ ఆపరేషన్లు చేసి ఈ ఇనిస్టిట్యూట్‌ను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో దాన్ని సద్వినియోగం చేసేలా పనిచేస్తాం. అర్చకుల ఉద్యోగ విరమణ విషయంలో ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ ప్రకారమే వెళ్తున్నాం.

Back to Top