ప‌రిమిత సంఖ్య‌లోనే స్వామివారి ద‌ర్శ‌నాలు 

కల్యాణ కట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు

8, 9, 10 తేదీల్లో మరోసారి ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తాం

టీటీడీ తీసుకున్న చర్యలకు భక్తులకు సహకరించాలి

తిరుమల తిరుపతి దేవస్థాన పాల‌క మండ‌లి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు టీటీడీ తీసుకున్న చర్యలకు సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థాన పాల‌క మండ‌లి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల కొండపై శ్రీవారి దర్శనానికి సంబంధించి వంద మంది టీటీడీ ఉద్యోగులతో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. క్యూలైన్‌ కదళికను పరిశీలించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌ సింఘాల్‌ గంటకు ఎంత మందికి దర్శనం కల్పించగలం అనే అంశంపై చర్చించారు. అంతేకాకుండా కొండపై నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. 

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 8, 9, 10 మూడు రోజుల పాటు టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో మరోసారి ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామన్నారు. రోజుకు 7 వేల మందికి దర్శనం కల్పించడానికి అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనలను భక్తులు తప్పకుండా పాటించాలని, మాస్కులు, శానిటైజర్‌ తప్పనిసరిగా వాడాలని కోరారు. టీటీడీ తీసుకున్న చర్యలకు భక్తులు సహకరించాలన్నారు. తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, కల్యాణ కట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. అన్నప్రసాద కేంద్రం వద్ద భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, తీర్థం, చఠారి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
 

Back to Top