ట్రయల్‌ రన్‌ పూర్తయ్యాక భక్తులకు శ్రీవారి దర్శనం

ఈనెల 8 నుంచి మూడ్రోజుల పాటు టీటీడీ ఉద్యోగులతో ట్రయల్‌ రన్‌

ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొని దర్శనానికి రావాలి

అవగాహన లేని వారి కోసం అలిపిరి వద్ద ప్రత్యేక కౌంటర్‌

టెస్టు చేసిన తరువాతే భక్తులకు దర్శనానికి అనుమతి 

మాస్కులు, శానిటైజర్‌ తప్పకవాడాలి.. భౌతికదూరం పాటించాలి

ప్రతి 50 అడుగులకు ఆటోమెటిక్‌ శానిటైజర్‌ ఏర్పాటు చేశాం

తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తాడేపల్లి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్‌ సడలింపుల మేరకు భక్తులకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా, ఈ నెల 8వ తేదీ నుంచి స్వామివారి దర్శనానికి సంబంధించిన టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది, పాలక మండలి సభ్యులతో మూడు రోజుల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. క్యూలైన్‌లలో భౌతికదూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశామని, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తూ భక్తులకు అనుమతి ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 20వ తేదీ నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన లాక్‌డౌన్‌ సడలింపుల మేరకు నిబంధనలు పాటిస్తూ ఈ నెల 8వ తేదీ నుంచి భక్తులకు తిరులమ శ్రీవారి దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇంతకు ముందు రోజుకు సుమారు 80 వేల నుంచి లక్ష మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడున్న అలాంటి పరిస్థితులు లేవన్నారు. 

అసలు ఎంత మంది భక్తులకు ఒక్కరోజులో దర్శనం చేయించగలం అనేదానిపై ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ట్రయల్‌ రన్‌ నడపనున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ట్రయల్‌ రన్‌లో ప్రధానంగా టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది, సెక్యూరిటీ, పూజారులు, పాలక మండలి సభ్యులు పాల్గొని ఇంకా మెరుగ్గా స్వామివారి దర్శనానికి ఎంత మందిని చేయించగలం అని నిర్దారణ చేసుకున్న తరువాత సామాన్య భక్తులను అనుమతించడం జరుగుతుందన్నారు.  

సర్వదర్శనం లేదా టికెట్‌ కొనుక్కొని దర్శనానికి వచ్చేవారు ఎవరైనా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొని మాత్రమే రావాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌పై అవగాహన లేని ప్రజలు, దూరప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అలిపిరి గేట్‌ దగ్గర రిజిస్ట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలిపిరి వద్ద టెస్టులు చేసి పంపిస్తామన్నారు. భక్తులందరూ నియమాలు పాటించాలని, మాస్కు ధరించాలని, శానిటైజర్‌ వాడాలని పదే పదే చెబుతున్నామన్నారు. వాహనాల్లో వచ్చే వారికి అలిపిరి వద్దే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అక్కడే అలిపిరి వద్ద టెస్టు చేస్తారు. ప్రతి భక్తుడిని, ఉద్యోగస్తుడిని కూడా టెస్టింగ్‌ చేస్తామన్నారు.  

ఆధారం ఉంటేనే నిలబడే వాళ్లు మాత్రమే రాడ్స్, రోప్స్‌ పట్టుకోవాలిలని, కనీసం ఆరు అడుగుల దూరం పాటించేలా నిబంధనలు పెడుతున్నామన్నారు. క్యూలైన్‌లో మార్పులు చేపట్టామన్నారు. ఆటోమెటిక్‌ శానిటైజర్‌ ప్రతి 50 అడుగులకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కంటైన్‌మెంట్‌ జోన్ల ప్రజలు కొన్నాళ్లు దర్శనానికి ఆగాలని విజ్ఞప్తి చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు కోనేటిలో స్థానాలు చేయడం ఉండదు. సపరేట్‌గా ట్యాప్‌లు ఏర్పాటు చేశాం. అదే విధంగా అన్నప్రసాదాల దగ్గర కూడా భౌతికదూరం పాటించాలన్నారు. సేవా కార్యక్రమాలకు భక్తులకు అనుమతి లేదని చెప్పారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top