శ్రీవారి ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లో విక్రయించరాదని తీర్మానం

ఆస్తుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ వేశాం

టీటీడీపై దుష్ప్రచారం చేసిన వారిపై సమగ్ర విచారణకు తీర్మానం చేశాం

త్వరలో టీటీడీ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్‌ ఆస్పత్రి ఏర్పాటు

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన వెంటనే శ్రీవారి దర్శనానికి అనుమతి

తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

తిరుమల: శ్రీవారి ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లో విక్రయించేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా టీటీడీ పాలక మండలి తీర్మానం చేయడం జరిగిందని బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులు పలుచోట్ల నిరుపయోగంగా పడి ఉన్నాయని, అవి అన్యాక్రాంతం కాకుండా ఏ విధంగా పరిరక్షించాలని, ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై పాలకమండలిలో చర్చించి కమిటీ వేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కమిటీలో టీటీడీ బోర్డు సభ్యులు, స్వామీజీలు, నిపుణులను చేర్చాలని నిర్ణయించామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. గత వారం రోజుల నుంచి టీటీడీ ఆస్తుల వేలం అంటూ కొన్ని మీడియా చానళ్లు, రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై, దేవస్థాన పాలక మండలిపై దుష్ప్రచారం చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగిందన్నారు.  దేవుడి సేవలో ఉన్న పాలకమండలిపై మళ్లీ ఇటువంటి ఆరోపణలు చేయకుండా ఉండాలంటే సమగ్ర విచారణ జరిపించాలని తీర్మానం చేశామన్నారు. ఏ స్థాయి ఎంక్వైరీ అయినా వేసి కుట్ర నిగ్గుతేల్చాలని ప్రభుత్వాన్ని కోరనున్నామన్నారు.

అదే విధంగా కొన్ని పత్రికల్లో మేము గెస్ట్‌హౌస్‌లు అలాట్‌ చేస్తున్నామని రాస్తున్నారని, వాస్తవానికి ఎక్కడా గెస్ట్‌హౌస్‌ల అలాట్‌మెంట్‌ జరపలేదన్నారు. తిరుమలలో గెస్ట్‌హౌస్‌లు నిర్మించడానికి నామినేషన్‌పై ఇచ్చే సంప్రదాయం ఫస్ట్‌ నుంచి వస్తుందని, కానీ, ఎవరికైనా గెస్ట్‌హౌస్‌లు ఇవ్వాలన్నా.. పారదర్శకతతో అందరికీ భక్తులకు అవకాశం కల్పించే విధంగా ఉండాలని సీఎం సూచించారన్నారు. డొనేషన్‌ స్కీమ్‌ కింద పెట్టాలో.. దేనికింద పెట్టాలో ఒక మార్గదర్శకాలు నిర్దేశించమని అధికారులకు సూచిస్తూ బోర్డులో తీర్మానం చేయడం జరిగిందన్నారు. 

ఇవి కూడా కొత్తగా అలాట్‌ చేసే లాండ్‌ కాదని, పాత గెస్ట్‌హౌస్‌లలో వసతి సౌకర్యాలకు బాగాలేని పరిస్థితి వల్ల వాటిని పునర్‌నిర్మించాలని డొనేషన్‌ ఇచ్చిన భక్తులకు లేఖలు రాశామన్నారు. వారిలో ఇద్దరు ముగ్గురు మేమే పునర్‌నిర్మిస్తామని ముందుకు వచ్చారన్నారు. మిగతా 13 మంది ఇప్పుడు ఆర్థిక పరిస్థితిలో పునర్‌నిర్మాణం చేపట్టలేమని రిప్లయ్‌ ఇచ్చారన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఎవరికీ నామినేషన్‌ ఇవ్వకుండా.. డొనేషన్‌ స్కీమ్‌ కింద ఏ విధంగా ఇవ్వాలనే మార్గదర్శకాలు ఇవ్వాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. 

విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్‌లో నిలోఫర్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రి ఉండేదని, విభజన తరువాత ఏపీలో పిల్లల ఆస్పత్రి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సూచన మేరకు ఇంతకుముందే పద్మావతి ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో బర్డ్, స్విమ్స్‌లో ఎక్కడ అవకాశం ఉంటే .. అక్కడ తక్షణమే చిన్న పిల్లల ఆస్పత్రిని ప్రారంభించాలని సీఎం సూచించారన్నారు. ఈ అంశంపై కూడా తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. 

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన అనంతరం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భౌతికదూరం పాటిస్తూ ఏ విధంగా దర్శనం త్వరితగతిన కల్పించాలనే అంశంపై ట్రయల్‌ కూడా వేయడం జరిగిందని, అధికారులు చేసిన ఏర్పాట్లకు కొన్ని మార్పులు సూచించామన్నారు. ఈ నెల 31 తరువాత నిబంధనలు సడలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని తప్పకుండా భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 

Back to Top