మా పార్టీపై ద్వేషాన్ని కలియుగ దైవానికి ఆపాదించొద్దు

తిరుమల కొండ గురించి దుష్ప్రచారం చేయొద్దు

తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలకు టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి

తిరుమల కొండను రాజకీయాల్లోకి లాగొద్దు

స్వామివారికి సేవ చేసేందుకు మాత్రమే మేమున్నది

టీటీడీ ఆస్తులు విక్రయించాలని నిర్ణయించింది గత ప్రభుత్వమే

2016 జనవరి 30న గత టీటీడీ బోర్డు తీర్మానం కూడా చేసింది

పాత బోర్డు చేసిన తీర్మానంపై సమీక్ష మాత్ర‌మే చేశాం 

1974 నుంచి టీటీడీ భూములు అమ్ముతున్నారు

తాడేపల్లి: మా పార్టీపై ఉన్న ద్వేషాన్ని కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామికి ఆపాదించవద్దని తెలుగుదేశం పార్టీ, ఎల్లోమీడియాకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి రెండు చేతులు జోడించి నమస్కరించి కోరారు. రాజకీయంగా ఏమైనా ఉంటే మాపై ఆరోపణలు వేయండి.. సమర్థవంతంగా ఎదుర్కొంటాం.. కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా పేరుగాంచిన తిరుమల కొండను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఆస్తులు వేలం వేస్తున్నట్లు పచ్చ పత్రికలు ప్రచారం చేస్తున్నాయని, తిరుమల కొండ గురించి ఆస్తులు రాసేటప్పుడు దయచేసి రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు మానేయాలని కోరారు. టీటీడీ ఆస్తులు ఆస్తులు అమ్ముతున్నామంటూ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు కాబడిన టీటీడీ బోర్డు ఆస్తుల అమ్మకంపై చేసిన తీర్మానంపై సమీక్ష మాత్రమే చేశామన్నారు. 

తిరుమల తిరుపతి ఆస్తుల వేలం అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు చేస్తున్న దుష్ప్రచారాన్ని టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. 

టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఏం మాట్లాడారంటే..

వేలానికి వెంకన్న భూములు, టీటీడీ ఆస్తుల వేలం. ప్రపంచ అత్యంత ధనవంతుడైన వెంకన్న ఆస్తులు అమ్మకానికి అంటూ తెలుగుదేశం అనుకూల పత్రికలు, ఎల్లోమీడియా ప్రచారం చేసిన వార్తలకు సంబంధించిన కొన్ని విషయాలను రెండ్రోజుల కిందట స్టేట్‌మెంట్‌ కూడా విడుదల చేశాను. 

టీటీడీ బోర్డుకు, ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించే విధంగా ప్రచారం సాగుతోంది. ఇది ఆ పత్రికలకు, ప్రతిపక్ష పార్టీలకు కొత్తేమీ కాదు. కానీ వ్యక్తిగతంగా మమ్మల్ని, మా పార్టీని ఎన్ని అన్నా భరిస్తాం. నిందలు కొత్తేమీ కాదు. కానీ, తిరుమల కొండకు సేవకులుగా వెళ్లాం. ఇలాంటి సేవలు చేసేవారిపై ఎలాంటి నిందలు వేసినా తట్టుకునే శక్తి ఆ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఇస్తారు. దేవుడి దగ్గర కొలువులో ఉంటాం.. కానీ, మాపై ఉన్న రాజకీయ వ్యతిరేకతతో, పార్టీపై ఉన్న ద్వేషంతో ఇలాంటి వార్తలు ఆపాదించవద్దని, సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామికి ఆపాదించవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నా..

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలు దేవుడిని కొలుస్తారో.. లేదో తెలియదు కానీ, గత రెండ్రోజుల నుంచి ప్రచురణ చేసిన అంశాలపై బాధేసి చెబుతున్నా.. 

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ, అత్యంత ఎక్కువమంది భక్తులు సందర్శించే తిరుమల కొండపై వార్తలు రాసేటప్పుడు దయచేసి రాజకీయాలు మానేయండి. రాజకీయ ప్రయోజనాలు మానేయండి. ఆస్తులు వేలం వేస్తే వాటి విలువ కేవలం రూ.1.53 కోట్లు అని రాశారు. నిజంగా టీటీడీ ఆస్తులు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా బోర్డు అమ్మదలుచుకుంటే.. కేవలం రూ.1.53 కోట్ల విలువ గల భూములనే అమ్మాలా..? అది కూడా తమిళనాడు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలోని భూములను అమ్మాలా..? గతంలో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌ నడిబొడ్డున 450 ఎకరాలు అప్పనంగా ఐఎమ్‌జీకి కట్టబెట్టారు. అలాంటి కార్యక్రమాలు మేము చేశామా..? కేవలం రూ.1.53 కోట్ల ఆస్తులు నిరుపయోగంగా ఉన్నవాటిని ఎక్కువగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ఆస్తులు గుర్తించి అమ్మడానికి కమిటీ వేసిన వారేనా.. మాపై నిందలు వేసేది. 

మేము కేవలం దేవుడి సేవలో ఉన్నాం. మాకు చేతనైతే దేవుడికి ఎంతో కొంత కానుకలు సమర్పించే కార్యక్రమం చేస్తామే గానీ, ఈ పదవిలో ఉన్నా.. లేకపోయినా దేవుడి సొమ్ము ఏ రోజూ ఆశించే ప్రసక్తే లేదు. గతంలో కూడా టీటీడీ బోర్డు చైర్మన్‌గా బాధ్యత తీసుకున్న సమయంలో క్రైస్తవుడినని నిందలు వేశారు. వాటన్నింటికీ సమాధానాలు చెప్పాం. ఆ తరువాత ఎప్పుడు ఏం అంశం దొరుకుతుందా.. ప్రభుత్వంపై బురదజల్లేందుకు అని వెతుకుతూ మళ్లీ ఈ ప్రచారం మొదలు పెట్టారు. 

చంద్రబాబు హయాంలో సదావర్తి భూములు ఏ విధంగా కొట్టేయాలని చూశారో.. ప్రజలంతా చూశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ భూములు కొన్ని కొట్టేయాలని చూశారు. సింహాచలం దేవస్థానం భూములు ఆక్రమణలకు గురికాబడ్డాయి. మా ప్రభుత్వం వచ్చిన తరువాత అటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేసేదే లేదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సదావర్తి భూములు, మిగతా ఆలయ భూములను కూడా కోర్టులకు వెళ్లి కాపాడాం. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులు వెంకటేశ్వరస్వామికి సంబంధించిన ప్రతి పైసా ఏ విధంగా కాపాడాలనే దానిపై ఒక్కపైసా కూడా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకున్నాం. 

గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులు వెచ్చించి తిరుపతి పట్టణంలో గరుడ వారధి పేరుతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకొని టీటీడీ నిధుల నుంచి దాదాపు రూ.460 కోట్లు విడుదల చేసింది. మున్సిపాలిటీ చేయాల్సిన పనికి తిరుమల నిధులు ఇవ్వడం ఏంటీ..? తిరుపతి పట్టణంలోని ఆవిలాల చెరువు సుందరీకరణకు టీటీడీ నిధులు రూ.180 కోట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. వాటన్నింటిపై మేము వచ్చాక రివ్యూ చేశాం. దేవస్థానానికి సంబంధించిన ప్రతి పైసా ఏ విధంగా కాపాడాలనే దానిపైనే దృష్టిపెడుతున్నాం. 

టీటీడీలో అన్యాక్రాంతంగా, నిరుపయోగంగా ఉన్న ఆస్తులు అమ్మడం ఇప్పుడు కొత్తేమీ కాదు. 1974 నుంచి 2014 వరకు సుమారు 129 ఆస్తులు అమ్మారు. 1995 నుంచి 2003 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు 15 నుంచి 20 ఆస్తులు అమ్మారు. 

ఆస్తుల వేలం అనేది మేము ప్రారంభించిన కార్యక్రమంలా రాజకీయ నిందలు వేస్తున్నారు. టీటీడీ ఆస్తులు కాపాడేదాంట్లో భాగంగానే సమీక్ష జరిపాం. 2016 జనవరి 30వ తేదీన టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి ఉన్నప్పుడు తీర్మానం నంబర్‌ 253 ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో టీటీడీ బోర్డు గుర్తించిన 50 నిరర్థక ఆస్తులు బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు చదలవాడ అధ్యక్షతన గల పాలకమండలి తీర్మానం చేసింది. వేరే రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఆస్తులు మినహా.. మిగతావన్నీ తిరుపతికి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి.. అవి కూడా చిన్న చిన్న ఆస్తులు కాబట్టి వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ చేయడం ఆర్థికంగా ఏమాత్రం సరికాదని సబ్‌ కమిటీ (టీటీడీ బోర్డులో ఆరుగురి సభ్యులు) తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఆస్తులను అమ్మి టీటీడీ కార్పస్‌ ఫండ్‌కు జమ చేయాలని సబ్‌ కమిటీ తీర్మానం చేసింది. 

మొత్తం 53 ఆస్తులు గుర్తిస్తే.. వాటిల్లో ఐటమ్‌ నంబర్‌ 18, 28, 44 నంబర్‌లు మినహా మిగతా 50 ఆస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదట అమ్మాలో.. వద్దో నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెప్పింది. ఆ నిర్ణయాల మీద చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన 2016 జనవరి 30న సంతకం చేయడం కూడా జరిగింది. 

రెండ్రోజుల నుంచి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు కన్నాలక్ష్మీనారాయణ, ఐవైఆర్‌ కృష్ణారావు విచారించి వాస్తవాలు కనుక్కుంటే బాగుండేది. గత ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. టీటీడీ బోర్డులో కూడా బీజేపీ సభ్యులు ఉన్నారు. సబ్‌ కమిటీలో బీజేపీ సభ్యులుగా ఉన్నారు. భానుప్రకాష్‌రెడ్డి, డీపీ అనంత, ఏ.శేఖర్, సుచిత్ర ఎల్లా (ఈనాడు పత్రిక యజమానికి దగ్గర బంధువు), సండ్ర వెంకట వీరయ్య ఈ సభ్యులు ఇచ్చిన రిపోర్టుకు బోర్డు ఆమోదం తెలిపి తీర్మానం చేసింది. 

ఇప్పుడు ఏమీ జరగకపోయినా జరిగినట్లుగా బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. రాజకీయం చేయాలనుకుంటే బోర్డు తీర్మానం మా దృష్టికి వచ్చినప్పుడే టీడీపీ స్వామివారి ఆస్తులను విక్రయించేందుకు కుట్ర చేసిందని దుమారం లేపి ఉండొచ్చు. ఆ కార్యక్రమం మేము చేయలేదు. ఆ తీర్మానాన్ని మళ్లీ సమీక్షించడం జరిగింది. ఆ సమీక్షలో కూడా ఆ తీర్మానం కాపీని చదివి.. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ ఆస్తులను మనం మేనేజ్‌ చేయలేమని, చాలా కారణాలు చెప్పారు. ఒక వేళ వేలం వేయాలంటే ఏ విధంగా వేయాలి.. వేలం వేసే నిర్ణయం కూడా పూర్తిస్థాయిలో తీసుకోలేదు. టీమ్‌ను పంపించి అక్కడి భూముల ధరలు.. వాటిని ఎవరైనా ఆక్రమిస్తే ఏ విధంగా అక్కడి అధికారులతో మాట్లాడాలని చర్చించాం. 

వీటిల్లో ఎక్కవ భాగం తమిళనాడు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోనివి. వెల్లూరు, కాంచీపురం, చిరుత్తుని ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే అన్నీ కూడా ఒక సెంట్, రెండు సెంట్లు, మూడు సెంట్లు, ఐదు సెంట్లు ఉన్నాయి. అదే వ్యవసాయ భూమి అయితే ఎకరం, ఎకరన్నర ఉన్నాయి. ఇలాంటి వాటిని స్వామివారికి కానుకగా ఇచ్చిన భక్తుడి మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా చేయాలని ఆలోచన చేశాం. మారుమూల గ్రామాల ఆస్తులను టీటీడీ కాపాడటం కష్టం.. అలా వదిలేస్తే.. ఎవరైనా ఆక్రమణకు గురిచేస్తే కానుకగా ఇచ్చిన భక్తుడి ఫలితం నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంటుందని భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని చర్చించాం. పాత బోర్డు తీర్మానం చేసింది.. దీనిపై మనం వేలం వేయాలంటే అక్కడి పరిస్థితి ఏంటని టీమ్స్‌ వేసి రూట్‌ మ్యాప్‌ తయారు చేయాలనే సమీక్షలో నిర్ణయం తీసుకున్నాం. మీటింగ్‌ అనంతరం ప్రొసీడింగ్స్‌లో చెప్పడం జరిగింది. 

టీటీడీ తరుఫున టీమ్స్‌ వేశాం. ఆ టీమ్స్‌ వేలం వేయాలంటే ఎక్కడ, ఎట్లా వేయాలి.. ధరలు ఏ విధంగా ఉన్నాయి.. ఆ డీటెయిల్స్‌ అంతా కనుక్కొని రిపోర్టు ఇవ్వమని అడిగాం. దీనికి ఇంత రాద్ధాంతం చేస్తూ.. రాజకీయ కోణంలో బురదజల్లే కార్యక్రమం చేయడం మంచిది కాదు.. దుమారం చేయాల్సిన విషయం కాదు. వేలం వేస్తున్నామని ప్రకటించలేదు. పాత బోర్డు చేసిన తీర్మానంపై మా బోర్డు సమీక్ష చేసింది. మళ్లీ మా బోర్డు మీటింగ్‌లో సమీక్ష చేయాలని నిర్ణయించాం. ఆస్తులను ఏ విధంగా కాపాడాలి.. ఒక వేళ ఆ పరిస్థితి లేనప్పుడు ఆస్తుల అమ్మకం కాకుండా.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఏ ఆస్తులను కాపాడేందుకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చ జరుపుతాం. ధార్మిక పెద్దలను, నిపుణులను సలహాలు ఇవ్వమని కోరుతున్నాం. భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదనేది మా ఆలోచన. దానిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలని స్వామీజీలు, ధార్మిక పెద్దల సలహాలు తీసుకుంటాం. 
 

Back to Top