సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో గిరిజ‌న ఎమ్మెల్యేలు భేటీ

అభివృద్ది పనులు, స్థానిక సమస్యలను సీఎంకు వివ‌రించిన ఎమ్మెల్యేలు 

సమస్యలన్నింటిని వెంటనే పరిష్కారించాల‌ని సీఎంవో అధికారుల‌కు ముఖ్య‌మంత్రి ఆదేశం

తాడేప‌ల్లి: గిరిజన ప్రాంతాల అభివృద్దికి అవసరమైన అన్ని చర్యలు వెంటనే తీసుకోవాలని సీఎంవో అధికారులను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ను డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి,  చెట్టి ఫాల్గున, కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, నాగులాపల్లి ధనలక్ష్మి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గిరిజన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు, స్ధానిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం (ఉపాధి హమీ పనుల ద్వారా నిర్ధేశించిన రోడ్లను పూర్తి చేయడం), ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను మెషిన్స్‌ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్ళేందుకు అవసరమైన రైస్‌ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్‌ సౌకర్యం వంటి పలు అంశాలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు గిరిజన ఎమ్మెల్యేలు వివ‌రించారు. జీవో నంబర్‌ 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చడం కొరకు రానున్న అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సీఎం వెల్ల‌డించారు. గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటికి వెంటనే పరిష్కారం లభించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. 

Back to Top