నేడు వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుద‌ల‌

క్యాంపు కార్యాల‌యం నుంచి బ‌ట‌న్ నొక్కి నిధులు విడుద‌ల చేయనున్న సీఎం వైయ‌స్ జగన్ 

2023 అక్టోబర్‌– డిసెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న జంటలకు కానుక

అర్హులైన 10,132 జంటలకు రూ.78.53 కోట్లు సాయం

తాడేప‌ల్లి: పేదల పిల్లల వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేలా వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు, వైయ‌స్ఆర్ షాదీ తోఫా సాయాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి అందిస్తున్న ఈ సాయాన్ని నేడు మరోసారి అమలు చేయనున్నారు. గత ఏడాది (2023) అక్టోబర్‌– డిసెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైయ‌స్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైయ‌స్‌ జగన్ నేడు తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ పిల్లలకు వైయ‌స్ఆర్ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడ పిల్లలకు వైయ‌స్ఆర్ షాదీ తోఫా ద్వారా సీఎం వైయ‌స్ జగన్‌ ఆర్థిక సాయం అందిస్తున్నారు.

పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న తపనతో ఈ పథకానికి పదో తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళు, వరునికి 21 ఏళ్ళుగా నిర్దేశించారు. చిన్నారులు పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ళ వయసు వస్తుంది. సీఎం వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం 1వ తరగతి నుండి ఏటా అందిస్తున్న రూ. 15,000 జగనన్న అమ్మ ఒడి సాయం ఇంటర్‌ వరకు ఇస్తున్నారు. ఈ సాయంతో 17 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి వారి ఇంటర్‌ చదువు కూడా పూర్తవుతుంది. జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, జగనన్న వసతి దీవెన ద్వారా ఏటా రూ. 20 వేల వరకు ఆర్థిక సాయం కూడా అందిస్తుండడంతో పాటు కళ్యాణమస్తు, షాదీ తోఫా ప్రోత్సాహకాలు కూడా ఉండడంతో పిల్లలు గ్రాడ్యుయేషన్‌లో చేరతారు. దీని ద్వారా వారు చదువు పూర్తి చేయడంతోపాటు బాల్య వివాహాలకు కూడా అడ్డుకట్ట పడుతుంది.

వైయ‌స్ఆర్ క‌ళ్యాణ‌మ‌స్తు, షాదీ తోఫా పథకం ప్రారంభించినప్పటి నుంచి ఏటా త్రైమాసికం పూర్తయిన వెంటనే సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.427.27 కోట్లు జమ చేశారు. గత చంద్రబాబు పాలనలో 17,709 మంది అర్హులకు రూ.68.68 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం ఈ సాయాన్ని దాదాపు రెండింతలు పెంచి క్రమం తప్పకుండా అందిస్తోంది. 

ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.40 వేలే. ఇప్పుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ అందిస్తున్న సాయం రూ.1,00,000. ఎస్సీల్లో కులాంతర వివాహం చేసుకున్న వారికి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.75 వేలే కాగా, ఇప్పుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ అంది­స్తున్న సాయం రూ.1,20,000. ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50 వేలు కాగా, సీఎం వైయ‌స్‌ జగన్‌ అందిస్తున్న సాయం రూ.1,00,000. ఎస్టీ కులాంతర వివాహాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.75 వేలే కాగా, సీఎం వైయ‌స్‌ జగన్‌ అందిస్తున్న సాయం రూ.1,20,000. బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.35 వేలు మాత్రమే. సీఎం వైయ‌స్ జగన్‌ అంది­స్తున్న సాయం రూ.50,000. బీసీల కులాంతర వివాహానికి గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50 వేలే కాగా, ఇప్పుడు సీఎం వైయ‌స్ జగన్‌ అందిస్తున్న సాయం రూ. 75,000.  మైనార్టీలు, దూదేకులు, నూర్‌ బాషాల పిల్ల­ల వివాహాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50 వేలు మాత్రమే. ఇప్పుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ దానిని రూ.1,00,000కు పెంచి అందిస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.1,00,000 కాగా, సీఎం వైయ‌స్ జగన్‌ అందిస్తున్న సాయం రూ.1,50,000. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.20,000 కాగా, సీ­ఎం వైయ‌స్ జగన్‌ అందిస్తున్న సాయం రూ.40,000. 

Back to Top