నేడు కర్నూలులో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన

 కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కర్నూలులో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరతారు. 10.30 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలకు చేరుకుని డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రథమ, ద్వితీయ దశల్లో చికిత్స చేయించుకున్న విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేస్తారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ హెల్త్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రధాన మంత్రి వందన యోజనను అమలు చేసినందుకు జాతీయ అవార్డులు పొందిన మెడికల్‌ అధికారులను సత్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి ఓర్వకల్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గన్నవరం వెళ్లి, తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత సీఎం తొలిసారి జిల్లా పర్యటనకు వస్తుండడంతో 25 వేల మందితో మానవహారం ద్వారా ఘన స్వాగతం పలకనున్నారు.   

నాడు–నేడులో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాలకు శంకుస్థాపన 
నాడు–నేడు కార్యక్రమం కింద గ్రామీణ స్థాయిలో ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్య ఉప కేంద్రాలను ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌’ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్‌ సెంటర్లు) భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కర్నూలులో శంకుస్థాపన చేస్తారు. సభా ప్రాంగణంలో నిర్మించిన మోడల్‌ ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌’ సెంటర్‌ను సందర్శిస్తారు. 
 

Back to Top