నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే

తాడేప‌ల్లి: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.

 
ఏరియల్‌ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్‌ సర్వేకు బయలుదేరే ముందు సీఎం వైయ‌స్‌ జగన్‌.. ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.

వరద సాయంలో ఉదారంగా ఉండండి: ఏపీ సీఎం 
భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంపు బాధితులను ఆదుకునే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.రెండు వేల చొప్పున ఇవ్వాలని, ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని సూచించారు. అలాగే.. భారీ వర్షాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వీలైనంత త్వరగా రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా ఆయన సూచించారు.

బాధితులను ఆదుకోవడంలో మొక్కుబడిగా కాకుండా మానవతా ధృక్పథంతో వ్యవహరించాల న్నారు.   కాగా, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్రం పూర్తి అండగా ఉంటుందని, ఏ సహాయం కావాలన్నా కోరాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎం వైయ‌స్ జగన్‌కు భరోసా ఇచ్చారు.   

సీఎం వైయ‌స్ జగన్‌ సత్వర స్పందన..  
  అనంతపురం: ఏపీ సర్కార్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించింది. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సకాలంలో స్పందించటంతో అనంతపురం జిల్లాలో చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం చిత్రావతి నదిలో రాప్తాడు నియోజకవర్గంలో ని చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది వద్ద కారు గల్లంతైంది. వారిని రక్షించేందుకు స్థానికులు, ఫైర్ సిబ్బంది వెళ్లారు. అంతా కలిసి 10 మంది చిత్రావతి నదిలోని జేసీబీ పై ఉండిపోయారు. అనంతపురం జిల్లా యంత్రాంగం వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 
 

విషయాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ చొరవతో ఇండియన్ నేవీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆగమేఘాలపై ప్రత్యేక హెలికాప్టర్ అనంతపురం వచ్చింది. సహాయక బృందాలు చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా కాపాడాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. సీఎం సత్వర స్పందనపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మాకిది పునర్జన్మ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సకాలంలో స్పందించి ప్రత్యేక హెలికాప్టర్ పంపటం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని చిత్రావతి నదిలో చిక్కుకుని సురక్షితంగా బయపడిన బాధితులు చెప్పారు. సీఎం జగన్ చొరవ వల్ల తమకు పునర్జన్మ లభించిందని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.  ఘటన జరిగిన వెంటనే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం.. ప్రత్యేక హెలికాప్టర్ వచ్చి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టడం చకచకా జరిగిపోయాయని అన్నారు.

Back to Top