నేడు అనంతపురంలో సమర శంఖారావం

అనంతపురం: ఏపీ ప్రతిపక్ష నేత,వైయస్‌ఆర్‌సీపీ పార్టీ అ«ధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు అనంతపురం జిల్లాలో జరుగనున్న ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొంటారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో రూపకల్పన చేసిన ఈ సమర శంఖారావం కార్యక్రమాల్లో ఆయన ఇప్పటికే రెండు జిల్లాలు పూర్తిచేశారు. ఈనెల 6న చిత్తూరు (తిరుపతి),7న వైయస్‌ఆర్‌ జిల్లాల్లో జరిగిన సభలో పాల్గొని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. నేడు అనంతపురం వేదికగా శంఖారావం పూరిస్తారు. ఉదయం 11 గంటలకు అనంతపురం నగరానికి చేరుకుంటారు. అక్కడ శ్రీ 7 కన్వెన్షన్‌ హాలుకు చేరుకుని వివిధ రంగాల్లో పనిచేస్తున్న తటస్థులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటలకు బెంగళూరు రోడ్డులో ఉన్న అశోక్‌ లేల్యాండ్‌ షోరూంకు ఎదురుగా ఉన్న స్థలంలో అనంతపురం జిల్లా  వైయస్‌ఆర్‌సీపీ పార్టీ బూత్‌ కమిటీ సభ్యులు,కన్వీనర్లతో ‘సమర శంఖారావం’ సభలో పాల్గొంటారు. 

 

Back to Top