డాక్టర్‌ సుధాకర్‌ చేసింది ముమ్మాటికీ తప్పే

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మేరుగ, టీజేఆర్‌  

 
తాడేపల్లి: డాక్టర్‌ సుధాకర్‌ చేసింది ముమ్మాటికీ తప్పు.. దీనికీ, కులానికీ ఎలాంటి సంబంధమూ లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, టీజేఆర్‌ సుధాకర్‌బాబు పేర్కొన్నారు. గుర్తు పట్టలేని స్థితిలో, గుండు చేయించుకుని ఉన్న డాక్టర్‌ సుధాకర్‌ తాగుబోతుగా పట్టుబడి.. పోలీసుల్ని, సీఎంని, మంత్రుల్ని పచ్చి బూతులు తిట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అలాంటి వ్యక్తిని ప్రశ్నించరా? అతన్ని చంద్రబాబు, లోకేష్, నారాయణ ఏ మొహం పెట్టుకొని సమర్థిస్తున్నారని నిలదీశారు.  వీరు కూడా సుధాకర్‌ తరహా మానసిక స్థితిలో ఉన్నారని భావించాల్సి వస్తుందన్నారు. విశాఖలో సుధాకర్‌ ప్రవర్తనను వెనకేసుకొస్తూ సమర్థించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  

► సిగరెట్‌ విసిరేయడం, పోలీసులపై దాడికి ప్రయత్నించడం, రోడ్డుపై న్యూసెన్స్‌ చేయడం వంటివి చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు వీరోచిత కార్యక్రమాలుగా కనిపిస్తున్నాయా?  
► ఈ దుర్మార్గాన్ని కులం పేరుతో సమర్థించడానికి వీరందరికీ నోళ్లు ఎలా వచ్చాయి? అమరావతిలో 55 వేల దళిత కుటుంబాలకు భూములు ఇస్తామని ప్రభుత్వం ముందుకు వస్తే అడ్డుపడిన నీచ చరిత్ర చంద్రబాబుది. 
► ఇలాంటి వ్యక్తి 150వ రోజు నిరసన అంటూ.. లేని భావోద్వేగాలను ఉన్నట్టు చూపిస్తున్నారు. దళితులపై ఐదేళ్ల పాటు దాడులు జరుగుతున్నప్పుడు ఈ భావోద్వేగాలు ఏమయ్యాయి? ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని అన్న ఆయనకు ఇప్పుడు దళితులు గుర్తుకొచ్చారా?
► డాక్టర్‌ సుధాకర్‌ చేసింది ముమ్మాటికీ తప్పు. దీనికీ, కులానికీ ఎలాంటి సంబంధమూ లేదు.  

Back to Top