ఉత్త‌రాంధ్ర‌కు చంద్ర‌బాబు ఏం చేశారో చెప్పాలి 

 స్పీకర్ తమ్మినేని సీతారాం స‌వాల్‌
 

శ్రీ‌కాకుళం: ఉత్తరాంధ్రకు 14 ఏళ్లు పాలించిన చంద్ర‌బాబు ఏం చేశారో చెప్పాల‌ని స్పీక‌ర్‌, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే త‌మ్మినేని సీతారాం ప్ర‌శ్నించారు. గత మూడేళ్లలో తాము ఏం చేశామో చర్చకు సిద్ధమని  టీడీపీ అధినేత చంద్రబాబుకు  తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. ఈ చర్చకు అచ్చెన్నాయుడి లాంటి పానకంలో పుడకలు వద్దన్నారు. డైరెక్టుగా చంద్రబాబుకే సవాల్ విసురుతున్నట్లు తమ్మినేని తెలిపారు.బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..గుడ్డిగా విమర్శిస్తున్న వారికి అభివృద్ధి ఏం కనిపిస్తుందని సెటైర్లు వేశారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని.. ఎవరు ఎలాంటివారో అప్పుడు అచ్చెన్నాయుడికి దద్దమ్మలెవరో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు.  

పేర్లు మార్చిన ఘనత టీడీపీదే అని.. తన దగ్గర చాంతాండంత లిస్ట్ ఉందని త‌మ్మినేని అన్నారు. ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్‌గా మార్చలేదా.. అప్పుడే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆముదాలవలస నియోజకవర్గానికి సీఎం వైయ‌స్ జగన్ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కేటాయించారని ప్రశంసలు కురిపించారు. రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు , వెటర్నరీ పాలిటెక్నిక్, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీని వ్యవసాయ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఈ నెల 29న ప్రారంభిస్తున్న‌ట్లు త‌మ్మినేని వెల్లడించారు.

Back to Top