పులివెందుల : అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణాన్ని దేశానికే ఆదర్శనీయం.. అని సగర్వంగా తెలుపుకుంటున్నానని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. మొదటి రోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ. 64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. ముందుగా అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన పలు నిర్మాణాల వివరాలు.. 1) భాకరాపురం రింగురోడ్డు సర్కిల్ లో 4 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.54 కోట్ల వ్యయంతో నూతనంగా, అద్భుతంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను అందించగా, వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు. 2) రూ.9.96 కోట్ల పాడా నిధులతో ఏపీ కార్ల్ నందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అగ్రికల్చర్ కళాశాలలో ...60 సీట్లు బీఎస్సీ (Hon) అగ్రికల్చర్, హార్టికల్చర్ కు సంభంధించి బీఎస్సీ (Hon) హార్టికల్చర్ 61 సీట్లతో కోర్సులను అందిస్తున్నాయి. 3)ఏపీ కార్ల్ నందు రూ. 11 కోట్ల వ్యయం నిర్మించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లాబొరేటరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పాలు , పాల ఉత్పత్తుల కల్తీని తనిఖీ చేయడం, నాణ్యతా పరీక్ష డయాగ్నస్టిక్ సేవలు, నిర్దిష్ట వ్యాధికారక క్రిములను ఉత్పత్తులను పరీక్షించడం , టెక్నో కమర్షియల్ మార్గాల్లో అమలు చేయడం, ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు పప్పుల నమూనాలను , ఫార్మా అప్లికేషన్ పరీక్షల నిర్వహణకై దీన్ని ఏర్పాటు చేశారు. 4)పులివెందుల వాసులకు అత్యంత ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ..మొత్తం 38 ఎకరాలలో రూ .14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామం నందు ఫేస్ లిఫ్టింగ్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 28 ఎకరాల్లో శిల్పారామం కాగా 10 ఎకరాల్లో ఫంక్షన్ హాల్ . మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ విత్ గ్యాలరీ, హిల్ టాప్ టవర్ విత్ 16.5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్ .రాజశేఖర్ రెడ్డి విగ్రహం, హిల్ టాప్ పార్టీ జోన్, జిప్ లైన్ (రోప్ వే), బోటింగ్ ఐలాండ్ పార్టీ జోన్, చైల్డ్ ప్లే జోన్ ,వాటర్ ఫాల్, ఫుడ్ కోర్ట్, ఆర్టిసన్స్ స్టాల్ల్స్ తో పాటు 5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్ .రాజశేఖర్ రెడ్డి కూర్చున్న విగ్రహం తో ఆకట్టుకునే ఎంట్రీ ప్లాజా, సిసి రోడ్లు, పార్కింగ్ ఏరియా, ఆహ్లాదకరమైన గ్రీనరీ ఈ శిల్పారామం ప్రత్యేకతలు. శిల్పారామంలో ఆకట్టుకున్న ప్రదర్శనలు సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి శిల్పారామం వద్దకు రాగానే సంప్రదాయ వాయిద్యాలైన సన్నాయి, డోలు బృందంతో ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో శిల్పారామంలోకి ఘన స్వాగతం పలికారు. అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సంప్రదాయ సంగీత వాయిద్యాలైన బూర వాయిద్యాలు , డప్పు కళాకారుల దరువు , మోరగల్లు ప్రదర్శనలు, తోలు బొమ్మలాట , చెక్క భజనలు, జానపద నృత్యాల నడుమ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పల్లెసీమ ఉట్టి పడేలా ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి కొద్ది దూరంలోనే చేతి వృత్తుల తయారీ అయిన జూట్ బ్యాగ్‌లు, కలంకారి పెయింటింగ్, మిల్లెట్స్ , కలంకారీ చీరలు, ఆకట్టుకునే సంపద్రాయ ఆభరణాలు కళ్లకు మిరుమిట్లు గొలిపేలా ప్రదర్శించారు. అక్కడే బోటింగ్ వద్ద పెద్ద స్క్రీన్ పై క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాలను ప్రదర్శించారు. అక్కడికి సమీపంలోనే ఎంబీ థియేటర్ వద్ద పులివెందుల ఉమెన్స్ డిగ్రీ కాలేజీ విద్యార్థినుల చేత సాంస్కృతిక ప్రదర్శనలు కనులపండువగా నిర్వహించారు.అక్కడి నుంచి హిల్ టాప్ పైకి వెళ్లగానే ముందుగా కీలుగుర్రాలు, ఎద్దు వేషాలు డప్పు దరువుల మధ్య సాదర స్వాగతం ఆకట్టుకుంది.అనంతరం హిల్ టాప్ పైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచే శిల్పారామం వ్యూ పాయింట్ ను పరిశీలించారు. దిగువన మ్యూజిక్ వాటర్ ఫౌంటెన్ ను ప్రదర్శించగా సీఎం వీక్షించారు.అనంతరం సీఎం అధికారులతో గ్రూప్ ఫోటో దిగి ఉత్సాహంగా శిల్పారామం కలియతిరిగారు . 5) శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంఖుస్థాపన రూ. 60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. మొదటిదశలో రూ.25 కోట్లు, రెండవ దశలో రూ.35 కోట్లు ఈ పాఠశాల నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. ఇందులో కేజి నుండి 12 వ తరగతి వరకు ఉండగా, వసతి గృహం, ఇండోర్ ఔట్ డోర్ క్రీడా మైదానాలు, డైనింగ్ హాల్, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్, మాథ్స్ లాబ్స్, ఆక్టివిటీ రూమ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్ , ఓపెన్ ఎయిర్ థియేటర్ తదితర నిర్మాణాలు చేయనున్నారు. 6) ఆదిత్య బిర్లా యూనిట్ ను సందర్శించిన సీఎం :* ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ను సందర్శించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇందులో లో దాదాపు 500 మంది పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలతో సీఎం కాసేపు ముచ్చటించారు. అలాగే సిబ్బందితో గార్మెంట్స్ ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న మహిళలు , సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించి ఆశీ బిర్వదించారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్,, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, ఆర్డీవోల పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చక్కగా సాగాయి. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లతో పాటు.. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి దనుంజయ రెడ్డి, పులివెందుల ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.