వైయస్‌ఆర్‌ స్మృతిలో తెలుగు ప్రజలు 

తెలుగు రాష్ట్రాల్లో మహానేతకు ఘన నివాళి 
 

 అమరావతి : దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఉదయం ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించారు.  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో పాటు వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతి, వైయస్‌ షర్మిల నివాళులర్పించారు.  తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లకాల్వ వద్ద గల వైయస్‌ఆర్‌ స్మృతివనంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు వర్ధంతి కార్యక్రమం నిర్వహించి మహానేతకు నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. 
విశాఖలో..
విశాఖ బీచ్ రోడ్ పార్క్ హోటల్ సర్కిల్ వద్ద ఉన్న దివగంత నేత స్వర్గీయ డాక్టర్‌ వైయస్‌రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.  మంత్రి అవంతి శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ ఎంవీవీ  సత్యనారాయణ, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణం శ్రీనివాస్, విశాఖ ఎమ్మెల్యేలు , విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ తదితరులు వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

వైయస్‌ఆర్‌ కలలను సాకారం చేస్తాం:ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
నెల్లూరు: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులో మహానేత వైయస్‌ఆర్‌ పదో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కలలను సాకారం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ పథకాలకు మళ్లీ ప్రాణం పోస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఆయన పాలన సాగిందని, తండ్రి బాటలోనే సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన సాగుతుందన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top