వైయస్‌ జగన్‌ మగధీరుడు

చంద్రబాబు వల్ల రాష్ట్రం బాగుపడదు

దళితుడిననే చంద్రబాబు కించపరిచేలా వ్యవహరించారు

ప్యాకేజీని మగపిల్లాడిగా చేసి ప్రజలను మోసం చేశారు

పోలవరం, రాజధాని గ్రాఫిక్స్‌తో మభ్యపెట్టే ప్రయత్నం

ప్రత్యేక హోదా, దళితుల అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యం

వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన ఎంపీ రవీంద్రబాబు

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక మగధీరుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని టీడీపీకి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన ఎంపీ రవీంద్రబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక అనంతరం ఎంపీ రవీంద్రబాబు లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌లో అనర్గళంగా మాట్లాడేవాడిని, రైల్వే లైన్, రూ. 100 కోట్ల నిధులు సాధించి పనులు చేయించినా దళితుడిననే ఒకే ఒక్క కారణంతో నా పేరు కూడా పేపర్లలో రాయకుండా చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడడం కోసం, ప్రత్యేక హోదా సాధన కోసం, దళితుల సంక్షేమం వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమని నమ్మి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరానని చెప్పారు. 

ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పది సంవత్సరాల ఉమ్మడి హైదరాబాద్‌పై హక్కు లేకుండా అమరావతికి పారిపోయి వచ్చారన్నారు. దాదాపు రూ. 3 వందల కోట్లు ఖర్చు చేసి భవనాలకు మరమ్మతులు చేయించుకొని సంవత్సరంలోనే పారిపోయి వచ్చారన్నారు. విభజన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒక్క శాతం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుంటుపడిందని, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, హోదా సాధన వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమన్నారు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని, ప్యాకేజీని మగ పిల్లాడిలా చేసి ప్రజలను చంద్రబాబు తప్పుదోవపట్టించారన్నారు. హోదాను చంద్రబాబు తుంగలో తొక్కారు. ప్యాకేజీని కూడా చంద్రబాబు సాధించలేకపోయారన్నారు. బీజేపీతో నాలుగున్నరేళ్లు సంసారం చేసి.. తరువాత వ్యభిచారం అని తెగదెంపులు చేసుకొని బీజేపీ నాయకులు దుర్మార్గులు, ద్రోహులు అని మాట్లాడుతున్నాడన్నారు. 

ప్రత్యేక హోదా కోసం ఎంపీలందరితో రాజీనామాలు చేయించండి కేంద్రం దిగి వస్తుంది. మనకు రావాల్సిన హామీలన్నీ నెరవేరుతాయని వైయస్‌ జగన్‌ చెప్పినా చంద్రబాబు పెడచెవినపెట్టాడని ఎంపీ రవీంద్రబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి దీక్ష చేస్తే దాన్ని చంద్రబాబు హాస్యాస్పదంగా చిత్రీకరించాడని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌కు జనాల్లో ఆదరణ పెరిగిపోతుందని నల్ల చొక్కా వేసుకొని మేము చేసిందే కరెక్ట్‌ అని మాట్లాడుతున్నాడన్నారు. బీజేపీ ఒడిలో కూర్చొని నవ నిర్మాణ దీక్ష, కాంగ్రెస్‌ ఒడిలో కూర్చొని ధర్మపోరాట దీక్ష అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్‌ మన రాష్ట్రానికి చేసిన అన్యాయం అందరికీ తెలుసని, తెలంగాణలో కాంగ్రెస్‌తో పోటీ చేసిన చంద్రబాబుకు భంగపాటు ఎదురైందన్నారు. 

చంద్రబాబు రాష్ట్రానికి సరిపడే ముఖ్యమంత్రి కాదు.. చంద్రబాబు వల్ల రాష్ట్రం బాగుపడదు. హోదా రాదు.. ప్యాకేజీ రాదు. మట్టి నీరు తప్ప ఏమీ రావని ఎంపీ రవీంద్రబాబు అన్నారు. ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ఒకే ఒక్క సామాజిక వర్గానికి చంద్రబాబు సర్కార్‌ ఉపయోగపడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు మేలు జరగడం లేదన్నారు. విద్య, వైద్యం, ఎంప్లయిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేకుండా పర్సనల్‌ ఎజెండా పట్టుకొని అమరావతి, పోలవరం అని గ్రాఫిక్స్‌ క్రియేషన్‌ చేసి బస్టాండ్, ఎయిర్‌పోర్టుల్లో, ఢిల్లీలో బస్టాండ్‌లలో కూడా పెట్టి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. వైయస్‌ జగన్‌తో కలిసి నడవాలని ఇప్పటి వరకు తెలిసి రాలేదా..? అని అడగొచ్చు. కానీ, మనకు కావాల్సినవన్నీ వస్తాయి. కాంగ్రెస్, బీజేపీ, 23 పార్టీల మెడలు వంచానని చంద్రబాబు అబద్ధాలు చెప్పారన్నారు. 

ఆంధ్ర రాష్ట్రానికి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో మేలు చేశారన్నారు. అదే బాటలో పయనించాలని వైయస్‌ జగన్‌ పోరాడుతున్నారని, దళితులు, బీసీలు, మైనార్టీల గురించి వైయస్‌ జగన్‌ స్పీచ్‌లు వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయన్నారు. రాష్ట్రానికి మోక్షం కలగాలంటే, పేదరికం పోవాలంటే వైయస్‌ జగన్‌ అధికారంలోకి రావాలన్నారు. వైయస్‌ జగన్‌ను బలవంతుడిని చేద్దామనే ఉద్దేశంతో వైయస్‌ఆర్‌ సీపీలో చేరానన్నారు. 

Back to Top