సంక్షేమాన్ని అడ్డుకునేందుకే బాబు కుట్ర

వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర  జాయింట్‌ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి

 ప్రభుత్వం అమ్ముతున్న లిక్కర్ బ్రాండ్లు నాటు సారా కానే కాదు

 బాలకృష్ణ కోసం లెజెండ్... పవన్ కల్యాణ్ కోసం 999 పవర్ స్టార్ బ్రాండ్లు తెచ్చింది చంద్రబాబే.

 బాబు హయాంలో అయినా.. జగన్ గారి పాలనలో అయినా మద్యం తయారీ విధానం ఒకటే

 టీడీపీ ప్రచారం చేస్తున్న బ్రాండులన్నీ బాబు గారి బ్రాండ్లే..

 "నారావారు" సారా గురించి మాట్లాడటమా..?

 సాయంత్రానికి పెగ్గు వేయకపోతే ఎలా తమ్ముళ్ళూ.. అంటూ చంద్రబాబు ప్రచారం చేయడం సిగ్గు.. సిగ్గు..

 రాజకీయ పార్టీలు మద్యం హానికరం అని చెప్పాలిగానీ.. మద్యం తాగండి, ఇంటింటికీ సరఫరా చేయండని చెప్పడమేంటి..?

 రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయన్ని తగ్గించటానికి, సంక్షేమ పథకాలను నిలిపేయాలనే టీటీపీ దుష్ప్రచారం

 ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్లను చీప్ లిక్కర్, నాటు సారా మాదిరిగా ముద్ర వేసే ప్రయత్నం

  తాడేప‌ల్లి:  రాష్ట్రంలో సంక్షేమాన్ని అడ్డుకునేందుకే ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర  జాయింట్‌ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి విమ‌ర్శించారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక.. లిక్కర్ తయారీకి సంబంధించిన విధానంలో.. 2019 తర్వాత జగన్ గారి ప్రభుత్వం ఎటువంటి మార్పులూ చేయలేదు. టీడీపీ, చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న బ్రాండ్‌లు ఏమైతే ఉన్నాయో... అవన్నీ బాబుగారి బ్రాండ్‌లు. చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేస్తున్న, కింగ్‌ లూయిస్‌ ఫ్రెంచ్‌ బ్రాందీ, బూమ్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ బీర్‌, బూమ్‌ బూమ్‌ బీర్‌ గురించి కానీ,  ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ రిజ్వర్‌ అనే బ్రాండ్లు అన్నీ, ఆయన హయాంలో అనుమతి ఇచ్చినవే. ఈ బ్రాండ్‌లు అన్నీ నాటు సారా, చీప్‌ లిక్కర్‌ అని చంద్రబాబుతో పాటు ఆయనకు ఒత్తాసు పలికే మీడియాతో పాటు, బాబు పార్టనర్‌గా ఉన్న పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేస్తున్నారు. మద్యం పాలసీకి సంబంధించిన పాలసీలో మార్పులు ఉంటాయో తప్ప, మద్యం తయారీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవు. లిక్కర్‌ గానీ, బీర్‌లుగానీ కావచ్చు... అనుమతించిన ఆల్కహాల్‌ శాతంతో తయారు అవుతాయని చంద్రబాబుకు తెలిసి కూడా, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.  తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

    1- 2019 తర్వాత ఒక్క డిస్టలరీకిగానీ, ఒక బ్రూవరీకిగానీ జగన్ గారి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 
    2- లిక్కర్ తయారీకి సంబంధించిన విధానంలో.. 2019 తర్వాత జగన్ గారి ప్రభుత్వం ఎటువంటి మార్పులూ చేయలేదు. 
    3- ఫలానా బ్రాండుకు అనుకూలంగాగానీ, ఫలానా బ్రాండుకు వ్యతిరేకంగా గానీ ఎటువంటి విధానమూ అనుసరించలేదు. అంటే, ఒకరిని ఎత్తేందుకు, ఒకరిని తొక్కేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. 
    4- సప్లయర్లు వారి రేట్ కాంట్రాక్టు అగ్రిమెంట్లను పొడిగించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. 
    5- ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న జె-బ్రాండ్లు అంటున్నవి నిజానికి, బాబు బ్రాండ్లు కాబట్టి బీ- బ్రాండ్లు అనో, లేదా చంద్రబాబు బ్రాండ్లు కాబట్టి, సీ- బ్రాండు అనో వాటిని అనాలి. 

    
బాలకృష్ణ లెజెండ్... పవన్ కల్యాణ్ 999 పవర్‌ స్టార్‌ సూపర్‌ ఫైన్‌ విస్కీ...
    చంద్రబాబు నాయుడు హయాంలో ఇంకొన్ని బ్రాండ్‌లను కూడా తీసుకువచ్చారు. పవన్‌ కల్యాణ్‌ మీద చంద్రబాబుకు విపరీతమైన ప్రేమతో ఆయన పేరు మీద 999 పవర్‌ స్టార్‌ సూపర్‌ ఫైన్‌ విస్కీ అనే బ్రాండ్‌ను తీసుకువచ్చారు. రష్యన్‌ రోమనోవా ఆల్ట్రా ప్రీమియర్‌ ఓడ్కా, ఏసీపీ ప్రెసిడెంట్‌ డీలర్స్‌ విస్కీ అట... 
- పవన్‌ కల్యాణ్‌ పేరు మీద అనుమతి ఇస్తే బాలకృష్ణగారు ఫీల్‌ అవుతారని.. ఆయన పేరు మీద కూడా 999 లెజెండ్‌ విస్కీ. గోల్డెన్‌ టచ్‌ 24 క్యారెట్‌ ఆల్ట్రా ప్రీమియర్‌ ఇండియన్‌ విస్కీ స్కాచ్‌ అట. ఇవన్నీ మీ హయాంలో తీసుకువచ్చి ఇప్పుడేదో మేము అనుమతి ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. 

బ్రాండ్ల పేర్లు చూడండి... లెజెండ్ లాంటి బ్రాండ్లు... 999 పవర్ స్టార్, రష్యన్ రోమనోవా.. ఏసీపీ, 999 లెజెండ్...

    - హై ఓల్టేజి గోల్డ్ బీరు, ఎస్ ఎన్ జే బీరు, బ్రిటీష్ ఎంపయర్ బీరు.. ఇవన్నీ రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసిందీ ఎప్పుడో తెలుసా..? 2017 జూన్ 7న. అదీ బాబు గారి తడాఖా. అలాగే, రాయల్ ప్యాలెస్ బ్రాండ్లు, లూహీ - 14 బ్రాండ్లు, సైనవుట్  బ్రాండ్లు రంగ ప్రవేశం చేసింది ఎప్పుడో తెలుసా..? 2018 నవంబరు 9న.

    - ప్రెసిడెంట్ మెడల్ అనేది ఎవరి బ్రాండో తెలుసా..? అది బాబు బ్రాండ్. దానికి అనుమతి లభించింది ఎప్పుడో తెలుసా..?- 2018 ఫిబ్రవరి 6న. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన అధికారం నుంచి దిగిపోయే సమయానికి 2019 ఏప్రిల్‌ 24న మళ్లీ రెన్యువల్‌ చేశారు కాబట్టి, ఇది టీడీపీ ప్రెసిడెంట్స్ మెడల్. ఈ మెడల్ బాబు మెడలోనే వేయాలి. ప్రెసిడెంట్స్ మెడల్ కు మేము అనుమతినిచ్చాం అంటున్నవాళ్ళు ఆ బాటిల్స్ తీసుకువెళ్ళి, దండ కట్టి చంద్రబాబు మెడలో వేయండి. 

    - ఇక గవర్నర్స్ రిజర్వ్.. రాష్ట్రపతినే కాదు, గవర్నర్ ను కూడా మేం అవమానించాం అన్నారు. దానికి ఎవరు అనుమతినిచ్చారో చూద్దాం. దానికి అనుమతి ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. దీనికి అనుమతి 2018 నవంబరు 5న ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి, గవర్నర్స్ రిజర్వ్ బ్రాండ్ కూడా గవర్నర్ గారి ఆఫీసు ముందు నిలబెట్టి, ఆ బాటిల్స్ అన్నీ దండకట్టి చంద్రబాబు మెడలోనే వేయాలి. 

    - గవర్నర్ రిజర్వ్ మాత్రమే కాకుండా, గవర్నర్ పేరు మీద ఉన్న ఇతరత్రా బ్రాండ్లు, నెపోలియన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు, ఓక్టన్ పేరు మీద  బ్రాండ్లు, సెవెన్త్ హెవెన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు... వీటన్నింటికీ సంబంధించి ఏపీ స్టేట్ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎప్పుడు అనుమతి ఇచ్చిందో తెలుసా..? 2018 అక్టోబరు 26న.  

    - రకరకాల బ్రాండ్ల గురించి మాట్లాడుతూ.. విరా, బ్లాండే, లాంటి బ్రాండ్లతోపాటు  బూమ్ బీరు తీసుకు వచ్చింది ఎవరో తెలుసా.. ? శ్రీమాన్ మద్య మహా చక్రవర్తి  చంద్రబాబు నాయుడు గారే. ఇందుకు అనుమతి ఇచ్చింది ఎప్పుడో తెలుసా..? ఇలా అధికారం నుంచి వెళ్ళిపోతున్నాడు అనగా, చివరి క్షణాల్లో  2019 మే 14న ఈ బూమ్ బాబు... బూమ్ బీరుకు అనుమతి ఇచ్చాడు. దానికి సంబంధించిన కాగితాలను కూడా బయట పెడుతున్నాం. 

- లిక్కర్ కు సంబంధించిన ఈ బ్రాండ్ లు అన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆమోదం పొందాయి... అంటే దాని అర్థం ఏమిటి? ఇవన్నీ నాటు సారా బ్రాండ్లు కాదు. ఇవన్నీ వందల కోట్ల వ్యయంతో పెట్టిన, ఇవన్నీ డిస్టలరీల్లో తయారు అయ్యే మద్యం బ్రాండ్లు. అది బీర్ కానివ్వండి, మరో లిక్కర్ బ్రాండ్ కానివ్వండి... ఇవన్నీ ఒక ప్రొసీజర్ లో అనుమతించిన ఆల్కహాల్ శాతంతో డిస్టలరీస్, బ్రూవరీస్ లో తయారు అవుతాయి. 

బాబు హయాంలో అయినా.. జగన్ గారి పాలనలో అయినా మద్యం తయారీకి ఒకే విధానం...
    ఐటీసీ వంటి కంపెనీలు తయారు చేసే సిగరెట్లు కూడా ఆరోగ్యానికి హానికరం అని వాటిమీద ముద్రిస్తారు. దీని అర్థం టొబొకోను అంత ప్రాసెస్ చేసిన తరవాత కూడా వాటిని తాగటం వల్ల నష్టం ఉంటుందని, అదే నేరుగా తాగే చుట్ట, బీడీల వల్ల అంతకు మించిన ప్రమాదం ఉంటుంది. 

- మద్యానికి సంబంధించి కూడా నాటు సారా చాలా ప్రమాదకరం. డిస్టలరీలు-బ్రూవరీల్లో తయారయ్యే మద్యం ఒక విధానం ప్రకారం, కొన్ని ప్రమాణాలను కచ్చితంగా పాటించి తయారు అవుతుంది. అది తక్కువ హానికరం. 

- చంద్రబాబు హయాంలో అయినా, జగన్ గారి పాలనలో అయినా బ్రాండ్ల మద్యం తయారీకి ఒకే విధానం ఉంటుంది. ఈ తయారీ విధానంలో మార్పులు ఉండవు. ఇలా తయారు అయిన తరవాత వాటికి లేబుల్స్, బ్రాండ్లు ఇవ్వటం ఉంటుంది. ఇంతకీ ఈ డిస్టలరీలు, బ్రూవరీలు ఎవరివి? నేరుగా తెలుగుదేశం వారివి కావా?

సంక్షేమాన్ని అడ్డుకునేందుకే..
- ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్లను చీప్ లిక్కర్, నాటు సారా మాదిరిగా ముద్ర వేసే ప్రయత్నం
     ఈ విషయాలన్నీ తెలిసి కూడా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఈ ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్లను చీప్ లిక్కర్ అంటూ.. దాన్ని నాటు సారా మాదిరిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. 
ఎందుకంటే.... 
కారణం-1) రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయన్ని తగ్గించటానికి దుష్ప్రచారం చేయాలన్నది. తద్వారా రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటినీ ఆపాలన్నది. 2) మహిళలకు ఈ ప్రభుత్వం వల్ల జరిగినంత మేలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి, మహిళల్లో ఇదేదో నాటు సారా అన్న తరహాలో అపోహలు సృష్టించాలన్నది టీడీపీ దుర్బుద్ధి. 
- అన్నిరంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు అమలు చేయడంలో గానీ, ప్రతి అంశంలో మహిళలకు అండగా నిలిచిన ప్రభుత్వం మాది. ఈ 74 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో మహిళలకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, నామినేటెడ్‌ పదవులు కావచ్చు, యాభై శాతం రిజర్వేషన్‌ కల్పించిన మొట్ట మొదటి ప్రభుత్వం జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వమే అని గర్వంగా చెప్పగలం. దీన్ని మీడియా మిత్రులు కూడా గమనించి, టీడీపీ దుష్ట కూటమి దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మాకు వ్యతిరేకంగా ఉన్న రెండు పత్రికలు కావచ్చు, మూడు మీడియ సంస్థలు కావచ్చు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయి. న్యూట్రల్‌గా ఉన్న పత్రికలు, టీవీ ఛానల్స్‌ వాస్తవాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

నాటుసారా ఇప్పుడే కొత్తగా వచ్చిందా..?
     ఇక నాటు సారా అన్నది ఇప్పుడు వచ్చినది కాదు. అది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా దాని తయారీ జరుగుతోంది. దాన్ని ఆపటానికి గట్టిగా ప్రయత్నించినది మా ప్రభుత్వం మాత్రమే. ఎస్ఈబీ పెట్టినది దీని కోసమే.
- మద్యానికి సంబంధించి కూడా నాటు సారా అత్యంత ప్రమాదకరమైంది. అయితే మద్యం అనేది ప్రొసీజర్‌ ప్రకారం తయారు అవుతుంది కాబట్టి పరిమితం అయిన మద్యం తయారీలో ఎంత మోతాదులో ఆల్కహాల్‌ ఉండాలనేదానిపై స్పష్టమైన అమనుతులు ఉంటాయి. అందులో ఏ బ్రాండ్‌లు అయినా సరే.. ఏపీతో పాటు మిగతా చోట్ల అన్ని మద్యం బ్రాండ్లు అనేవి ప్రొసీజర్‌ ప్రకారమే అనుమతుల మేరకే ఎంత శాతం ఆల్కహాల్‌ ఉండాలో అంత ఉన్నప్పుడు అనుమతులు ఇస్తారని తెలిసి కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. 

ఇవన్నీ ఎవరి డిస్టలరీలు..?
    ఇక మద్యం తయారీ కంపెనీల విషయానికి వస్తే.. ఇవన్నీ చంద్రబాబు నాయుడుగారు, ఆయన పార్టీ నేతలు నడుపుతున్న డిస్టలరీలు. ఎస్పీవై రెడ్డికి సంబంధించి ఎస్పీవై బ్రాండ్‌. ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు కాదా. ఇక విశాఖ డిస్ట్లరీకి వస్తే, ప్రస్తుత టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిది. మొన్నే ఆయన వేరేవాళ్లకు అమ్మేసానని చెబుతున్నాడు. అది ఇప్పటివరకూ మీ చేతుల్లోనే ఉంది కదా? ఇక పీఎంకే డిస్టలరీస్‌‌... యనమల రామకృష్ణుడు వియ్యంకుడిది. శ్రీకృష్ణ డిస్టలరీస్‌ ఆదికేశవుల నాయుడుగారిది. ఇవన్నీ చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న డిస్టలరీ‌. ఇక్కడ తయారు అవుతున్న మద్యం.. నాసిరకంగా ఉందంటూ ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటూ రాజకీయంగా లబ్ది పొందేలా కార్యక్రమం చేస్తున్నారు.

మద్యం తాగండి అని బాబు ప్రచారం చేయడం సిగ్గు.. సిగ్గు..
    మద్యం ఆరోగ్యానికి హానికరం అని ఏ రాజకీయ పార్టీ అయినా చెబుతుంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం మద్యం తాగండి, మద్యం ఆరోగ్యానికి మంచిది, కాబట్టి మద్యం తాగండి తమ్ముళ్లు.. సాయంత్రం పెగ్‌ వేయడానికి ఇబ్బందిగా ఉందా? మద్యం సరఫరా చేయలేని ఇది అరాచక ప్రభుత్వం అంటూ.. మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధంలో భాగంగా మద్యంపై ఒక పాలసీని తీసుకువచ్చి వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యపాన నిషేధానానికి సంబంధించి దశలవారీగా నిషేధం తీసుకువస్తుంటే.. దాన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు బాధంతా... మద్యం ధరలు పెంచేశారని.. మద్యం అందటం లేదనే. 

- పైపెచ్చు ఏమీ తెలియనట్లు మళ్లీ మద్యం గురించి, మద్యం బ్రాండ్లు గురించి లేనిపోని ప్రచారాలు ప్రభుత్వంపై చేస్తున్నారు. మనవడితో ఆడుకునే వయసులో ఉన్న చంద్రబాబు, పదిమందికి మంచి చెప్పాల్సిన స్థితిలో ఉండి, పచ్చి అబద్ధాలు ఆడుతూ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మేము తిప్పికొడతాం. 

- చంద్రబాబు నాయుడు హయాంలో 43వేల బెల్ట్‌ షాపులు ఉండేవి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్‌ షాపులను మూసివేయించాం. గుడి, బడి పక్కన... ఎక్కడపడితే అక్కడ చివరికి కిరణా దుకాణాల్లో కూడా మద్యాన్ని అమ్మించిన ఘటన చంద్రబాబుది. మీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉంటే మేము వచ్చాక 2,934కు తగ్గించిన మాట వాస్తవం కాదా? మీ హయాంలో 24 గంటలూ మద్యం, ఎక్కడబడితే అక్కడ మద్యాన్ని ఏరులై పారించారు.

- ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లో మద్యం వ్యాపారం ఉంటే ఇబ్బంది అవుతుందని, ప్రభుత్వమే మద్యం షాపులను పర్యవేక్షిస్తూ అమ్మకాల సమయాన్ని తగ్గించింది వాస్తవం కాదా? 

- గడిచిన కొన్ని దశాబ్దాలుగా నాటు సారా తయారీ జరుగుతోంది. మేము అధికారంలోకి రాగానే ప్రత్యేంగాంగా ఎస్‌ఈబీ వ్యవస్థను పెట్టి కంట్రోల్‌ చేస్తున్న విషయం వాస్తవం కాదా? మీ హయాంలో నాలుగేళ్లలో నాటు సారాకు సంబంధించి 83,926 కేసులు నమోదు అయితే ... వైయస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక 92,766 కేసులు పెట్టడం, రెండేళ్లలోనే 12 లక్షల సారా నిల్వలను స్వాధీనం చేసుకున్నది.. ఇవన్నీ అధికారిక లెక్కలు కాదా? ఇవేమీ మీకు కనిపించడం లేదా?

నారావారు సారా గురించి మాట్లాడటమా..?
    ఇవాళ నారా వారు సారా గురించి మాట్లాడటం ఎంత విడ్డూరంగా ఉంది. నారావారు సారా, మద్యం తాగమని ప్రోత్సహించడం సరైన పద్ధతేనా? ఇదేనా ఒక రాజకీయ పార్టీ చెప్పేది? ఒక రాజకీయ పార్టీగా మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పాల్సిందిపోయి... ఆ బ్రాండ్‌, ఈ బ్రాండ్‌ మీకు అందడం లేదా అంటూ మాట్లాడుతున్నారు.  మా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది. మా ప్రభుత్వం ఎక్కడైనా సరే ట్రాన్స్‌ఫరెన్సీగా వ్యవహరిస్తుంది, ఇది మా ప్రభుత్వ లక్ష్యం. 

- మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి అక్రమ రవాణా, అక్రమ మద్యం, నాటు సారా తయారీని ఎక్కడికక్కడ కఠినంగా నియంత్రించుకుని వెళుతున్నాం. గంజాయి రవాణాను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, చూసి నేర్చుకోవాలని ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగంగా కేంద్ర హోంశాఖ ఇతర రాష్ట్రాలకు  చెప్పడం వాస్తవం కాదా? 

మద్యం కోసం ఒక రాజకీయ పార్టీ ధర్నా చేయడమా..?
    వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ పారదర్శకంగా ఉంటుంది. మీ దుష్ప్రచారాలను తిప్పికొడతాం. చంద్రబాబు విధానాలను చూసే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని  ప్రజలు తిప్పికొట్టి తగిన బుద్ధి చెప్పారు. అయినా మీ విధానం మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు మరోసారి గుణపాఠం నేర్పుతారనేది టీడీపీ తెలుసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా మద్యం గురించి ధర్నా చేయడం చూశారా? మద్యం తక్కువ ధరకు ఇవ్వండి, ప్రతి ఊరికి, ఇంటింటికీ మద్యం ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వాలంటూ ప్రచారం చేయడంలోనే.. ఆ పార్టీ విధానం ఏంటో బయటపడుతోంది కదా? అని కారుమూరి వెంక‌ట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top